అమ్మాయిలూ చదువులరాణులూ!

నేను విజయవాడ సిద్ధార్థా కళాశాలలో ఇంజనీరింగ్  చదువుకునే రోజుల్లో నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదనే ప్రచారం ఒకటి ఉండేది. హాస్టల్లో రోజూ సాయంత్రం అబ్బాయిలందరూ చేరినప్పుడు సాగే పిచ్చాపాటీ కబుర్లలో సహజంగానే అమ్మాయిల గురించి చర్చలూ, కామెంట్లూ, గట్రా గిట్రా జరుగుతూ ఉండేవి. నేను అమ్మాయిల ప్రస్తావన రాగానే వెంటనే లేచి వెళ్ళిపోయేవాడిని. ఇది చూసీ చూసీ ఎవరో “ఫణీంద్రకి అమ్మాయిలంటే పడదేమో” అన్న అనుమానం వ్యక్తం చెయ్యడం, ఆ అభిప్రాయం స్థిరపడడం జరిగిపోయాయి. “అమ్మాయిలంటే పడని వాడిని కాదు, పడిపోయే వాడినే అహో!” అని నేను కూడా గొంతెత్తి ప్రకటించే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఈ నాటకం చాలా కాలం పాటు సాగింది!

కాలేజీ కుర్రకారు అమ్మాయిల గురించి మాట్లాడుకుని ఆనందించడంలో నాకేమి తప్పు కనిపించలేదు. నాకు నచ్చనిదల్లా అమ్మాయిల గురించి చులకనగా మాట్లాడడమే. “అమ్మాయిల గురించి తెలియనిదేముంది? చదవరూ పెట్టరు. రిజర్వేషన్ ఉంది కాబట్టి (అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో 33% ladies quota ఉండేది, ఇప్పటి సంగతి తెలియదు) ఎలాగో ఇంజనీరింగ్‌లో వచ్చిపడతారు” అన్నాడొకడు ఒకసారి. ఇలాంటి మాటలు ఈ కాలంలో ఏ కాలేజీ అబ్బాయిలూ అనకపోవచ్చు కానీ నేను చదువుకున్న 1998-2002 మధ్య కాలంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో అమ్మాయిల గురించి ఇలాంటి కామెంట్లు తరచూ వినిపించేవి.  ఈ మాటలు అన్న మిత్రుడికి స్కూల్లో ఎప్పుడూ బాగా చదివే అమ్మాయిలు తారసపడలేదు కాబట్టి అతనికి ఇలాటి అభిప్రాయం స్థిరపడింది. అలాగే నాకు అమ్మాయిలంటే అంత గౌరవం ఉండడానికి కారణం నా సంస్కారమో, మంచితనమో కాదు. నా అనుభవం. ఫ్లాష్ బ్యాకులోకి వెళితే…

శైలజ @ రాజమండ్రి

అప్పుడు నా వయసు 7-8 ఏళ్ళు ఉంటుందేమో, మూడో క్లాసు చదువుతున్నాను. క్వార్టర్లీ పరీక్షలు మొదలయే కాలం. స్కూల్ ముగిసాక నేను ఇంటికి వెళుతూ ఉంటే “ప్రభు” వచ్చి, “ఆగు, పనుంది” అన్నాడు. ప్రభు నా బెస్ట్ ఫ్రెండ్, మా “గ్యాంగ్ లీడర్” (అప్పట్లో మేమంతా వీర చిరంజీవి ఫ్యాన్స్, మా ప్రభుగాడు తెగ చిరంజీవిలా ఫీల్ అయిపోయి స్కూల్లో ఫైట్లూ గట్రాగిట్రా చెయ్యడమే కాక, నాతో కూడా ఒకసారి చేయించాడు!). కొద్దిసేపటికి మేమిద్దరం మా స్కూలు వెనుక ఉన్న విశాల మైదానంలోని పిచ్చిమొక్కలని, తుప్పలని దాటుకుంటూ వెళ్తున్నాం.  వాడు ఎక్కడికి తీసుకెళుతున్నాడో, ఎందుకు తీసుకెళుతున్నాడో అర్థం కాలేదు. ఒక పెద్ద చీమపుట్ట దగ్గర ఆగాము. “కళ్ళు మూసుకో” అన్నాడు.  వీడు చీమలని పాములని పూజించడం ఎప్పుడు మొదలెట్టాడబ్బా అనుకుంటూ నేను వాడు చెప్పినట్టే చేశాను.

“నాతో పాటూ చెప్పు”

“సరే”

“చీమదేవా, చీమదేవా! పరీక్షలు త్వరలో మొదలవుతున్నాయి. మాకు నీ సహాయం కావాలి. ఆ “శైలజ” పరీక్షలు రాస్తున్నప్పుడు, నువ్వు నీ సైన్యంతో వెళ్ళి తనని బాగా కుట్టెయ్యాలి. దెబ్బకి తను పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడం, ఫణి గాడికి ఫస్టు ర్యాంకు, నాకు సెకెండ్ ర్యాంకు రావడం జరగాలి. ఇదే మా ప్రార్థన”

ఈ సంఘటన నా కల్పన కాదు, నిజ్జంగా జరిగిందే! ఇప్పుడు ఆలోచిస్తే అప్పటి మా అమాయకత్వానికి నవ్వుకోవాలో, ప్రభుగాడి క్రియేటివిటీని మెచ్చుకోవాలో అర్థం కాదు. మేమిద్దరం అల్లరచిల్లరగా తిరిగినా, చదువులో మాత్రం ముందే ఉండేవాళ్ళం. నాకో వాడికో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. “ర్యాంకుల యావ” మా పసిమనసులకి పట్టి, మేము కొంచెం గర్వంగా ఫీల్ అయ్యేలోపు అనుకోని ఉపద్రవం ఒకటి వచ్చిపడింది శైలజ రూపంలో. తను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మా స్కూల్‌కి వచ్చింది. వచ్చీరావడంతోనే ఫస్ట్ ర్యాంకు ఎగరేసుకుపోయింది. మా స్కూల్లో “First In Class, Second In Class”, బ్యాడ్జీలు ఇవ్వడం మొదలెట్టాక First In Class రెడ్ బ్యాడ్జీ ఆ పిల్లకే దక్కింది.  ఇది ప్రభుగాడు సహించలేకపోయాడు. “ఒరేయ్, నాకు ఫస్ట్ ర్యాంకు రాకపోయినా, నా బెస్టు ఫ్రెండువి నీకొచ్చిందని సంతోషించా. నీ ప్లేసులో ఆ శైలజని ఉండనివ్వను. మన బాస్ చిరంజీవి మీద ఒట్టు!” అన్నాడు.

ఏదో సినిమా డైలాగులు కొడుతున్నాడు అనుకున్నాను కానీ, మా ప్రభుగాడు చాలా డిటెక్టివ్ వర్కే చేశాడు తర్వాత. శైలజ ఏ బస్సులో వస్తోంది, ఎక్కడైనా ప్రైవేటుకి వెళ్తోందా, ఆమె ఏ సబ్జెక్టులో వీక్  ఇలా చాలా వివరాలు తెలుసుకున్నాడు. ఆఖరికి ఆమెకి ఇష్టమైన కలర్స్ కూడా కనుక్కున్నాడు ఎలాగో. ఈ ఇన్‌ఫర్మేషన్ అంతా ఉపయోగించి చాలా ట్రిక్కులు ట్రైచేశాడు కానీ, పెద్ద ఫలితం దక్కలేదు. 4th క్లాస్ అయ్యాక నేను ఆ స్కూల్ నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యే టైముకి, ఒకట్రెండు సార్లు నాకు ఫస్టు ర్యాంకు వచ్చినా టీచర్ల దృష్టిలో, ఫ్రెండ్స్ దృష్టిలో, ముఖ్యంగా (బైటకి ఒప్పుకోలేకపోయినా) మా దృష్టిలో శైలజే Best & Brilliant student in the class.

నేను స్కూల్ విడిచి వెళుతున్న టైములో ప్రభు గాడు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి –

“ఒరేయ్! నువ్వు రాజమండ్రి నుంచి ఇంకో ఊరికి వెళిపోతున్నావ్. చాలా బాధగా ఉన్నా, ఒక విషయంలో మాత్రం హ్యాపీ. అక్కడ మళ్ళీ నీకే ఫస్టు ర్యాంకు వస్తుంది. శైలజ పీడ తొలగినట్టే!”

రుబీనా @ ఎలమంచిలి

మా నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ కావడంతో రాజమండ్రి నుండి విశాఖ జిల్లా ఎలమంచిలి వెళ్ళాం. రాజమండ్రితో పోలిస్తే ఇది పల్లెటూరే. ఒకటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. మొదటి రోజు స్కూల్లో అందరూ నన్ను పట్నం నుంచి వచ్చిన పిల్లాడని ఎంతో గౌరవంతో చూశారు! ఇక ఇక్కడ మనకి తిరుగులేదు అనుకుని మెరీనా తీరంలా నా మనసు మెరిసిపోతున్న తరుణంలో సునామీలా వచ్చింది “రుబీనా”. శైలజ కేవలం చదువులో టాప్ అయితే రుబీనా చదువు + dynamism కలబోత. లీడర్షిప్ లక్షణాలు పుష్కలం, నాకు సున్నా. ఎలక్యూషన్‌లో ఆమె అనర్గళం, నాకు స్టేజ్ ఎక్కితే మనసు కలకలం! ఎలమంచిలి లాంటి ఊరులో ఇంత కంచులాంటి అమ్మాయి ఉండడం అన్నది నేను ఊహించని విషయం.

ఆమే క్లాసుకి “మానిటర్” గా ఉండేది. తర్వాత నన్నూ “మానిటర్” ని చేశారు. టీచర్లు లేనప్పుడు క్లాసుని కంట్రోల్‌లో పెట్టడం మా డ్యూటీల్లో ఒకటి. అయినా ఆమెని చూస్తే నాకెంత బెరుగ్గా ఉండేదంటే నేనూ క్లాస్ లీడర్‌ని అన్న సంగతి గుర్తోచ్చేది కాదు. సందు చివరి వెంకటేశ్వర స్వామి గుడీ, తిరుపతి ఏడుకొండల వాడి గుడీ రెండూ వెంకటేశ్వర స్వామి గుళ్ళే అయినా, తిరుపతి తిరుపతే! ఒకసారి – “Rubeena, may I go out for toilet? Urgent!” అని సిగ్గువిడిచి క్లాసులో అడిగాను. తను కిలకిలా నవ్వి “You don’t need my permission, you are a monitor too” అంది. ఎంత పొలైట్‌గా, రాజసం ఉట్టిపడేలా  చెప్పిందంటే ఆ మాటకి నాకు inferiority complex ఇంకా పెరిగింది.

ఇంకోసారి స్కూల్లో మా నాన్నగారి బ్యాంకు వాళ్ళు వ్యాస రచనల పోటీ పెట్టారు. పేపర్లు మా ఇంటికే వచ్చాయి. ఒకాయన బెస్ట్ వ్యాసం సెలెక్ట్ చెయ్యడానికి వచ్చారు. నా ముందే ఆయన అన్ని వ్యాసాలూ చదివాడు, నాకు కనబడకుండా జాగ్రత్తపడుతూ. సైలంటుగా తన పని చేసుకుంటున్న వాడు కాస్తా, ఒక్కసారిగా –  “Wonderful, wonderful! ఎంత బాగా రాసిందో ఓ అమ్మాయి” అని పైకి అనేశాడు. “ఆ అమ్మాయి పేరు రుబీనా” అన్నాను నేను వెంటనే. ఆయన పేపర్ మీద పేరు చూసి, నేను చెప్పింది నిజమే అని తెలుసుకుని “నీకెలా తెలిసింది?” అని ఆశ్చర్యంగా అడిగాడు. “తెలుసు! తనకే ఫస్ట్ ప్రైజ్ అని కూడా తెలుసు” అన్నాను. “నువ్వూ రాశావా? నీ పేపర్ ఎక్కడుందో చూస్తాను” అని వెతకబోయాడు. “లేదు లేదు, నాకు ఒంట్లో బాగోలేదని నేను పార్టిసిపేట్ చెయ్యలేదు” అన్నాను. అవసరార్థం అబద్ధాలు పలకడం చిన్నప్పుడే నేర్చుకుంటాం కదా!

5th అయ్యాక నేను డైరెక్టుగా 7th కి జంప్ కొట్టడంతో రుబీనా నుంచి జంప్ అయ్యాను. కొత్త క్లాసులో రుబీనా అంతటి ధీటైన ప్రత్యర్ధులు లేకపోయినా, నా reference రుబీనానే. ఎలమంచిలి స్కూల్ అంటే నాకు తనే గుర్తోస్తుంది.

మధులత @ కాకినాడ

ఎలమంచిలి నుంచి మా నాన్నకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడంతో 8th క్లాస్‌కి కాకినాడ వచ్చిపడ్డాం. “అదిత్యా పబ్లిక్ స్కూల్” అనే  స్కూల్‌లో నాకు అడ్మిషన్ వచ్చింది. పల్లెటూరిలోనే పేరు రానప్పుడు, మళ్ళీ కాకినాడలో ఏమి వెలుగుతాం అనుకుని నేను పెద్ద హోప్స్ పెట్టుకోలేదు. నా అనుమానాలు నిజం చేస్తూ రెజిస్ట్రేషన్ ఫీస్ కట్టడానికి నేను మా నాన్నగారితో వెళ్ళినప్పుడు ఆఫీసులో గోడకి ఓ అమ్మాయి పోస్టర్ ఉంది. “మా టాపర్” అని ఏదో రాసుంది.

నాన్న: “ఎవరండీ ఆ అమ్మాయి”?

స్కూల్ క్లర్కు: “మధులత అని, 7th class district topper”

నాన్న: ఈ స్కూలేనా?

స్కూల్ క్లర్కు: Of course, లేకపోతే ఇక్కడెందుకు పెట్టుకుంటాం?

(నా కేసి చూస్తూ) BTW, ఆ అమ్మాయి నీ క్లాసే!

నా ఫేస్‌లో ఎక్సైట్మెంట్ కనిపిస్తుందేమో అని చూశాడు కానీ, నేను తలతిప్పుకున్నాను!

జీవితంలో వార్నింగులు కొన్నిసార్లు పనికివస్తాయి. గమనిక: “త్వరలో నీ బ్రతుకు చిద్రమవును” అని ఒక బోర్డు ఉంటే ప్రిపేర్డ్‌గా ఉంటాం! అడ్మిషన్ రోజే ఫ్యూచర్ కళ్లకి కట్టినట్టు కనిపించడంతో, నేను జరగబోయే ఘోరాలకి సిద్ధంగా ఉన్నాను. రుబీనా తిరుపతి కొండైతే, మధులత హిమాలయ శిఖరం. రుబీనా లక్షణాలతో పాటూ ఓ అద్భుతమైన వ్యక్తిత్వం మధులత సొంతం. ఆమె స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఎంతో inspiring గా ఉండేది. అందుకే తరచూ ప్రిన్సిపాల్ ఆమెచేత మాట్లాడించేవాడు. తనకి చాలా clarity ఉండేది. అందర్లాగా  ఇంజనీర్, డాక్టర్ అవుతాను అనకుండా IPS officer అవ్వడమే తన లక్ష్యమని చాలా సార్లు చెప్పేది. ఒక రకంగా ఆమె మొత్తం స్కూల్‌కే brand ambassador & role model అనుకోవచ్చు.

క్లాసుకి మూడు సెక్షన్లు ఉన్నాయని, నేనూ మధులతా వేరు వేరు సెక్షన్లనీ తెలుసుకున్నాక నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. మొదటి పరీక్షలు అయ్యాక నాకు సెకండ్ ర్యాంకు వచ్చింది. పర్వాలేదు, ఫస్టు ఎంతో దూరంలో లేదు అనుకున్నాను. ఈ స్కూల్‌లోనూ First In Class, Second In Class బ్యాడ్జీలు ఇచ్చేవారు. అదీ ఉదయం అసెంబ్లీ టైములో, స్కూల్లో అందరి ముందూ, పేర్లు పిలిచి మరీ ఇచ్చేవారు. ఇదేదో బాగుందని నేను సంబరపడుతూ ఎదురుచూసిన రోజు రానే వచ్చింది, నేను ఊహించని మలుపుతో. మా సెక్షను వచ్చాక, నేను, ఫస్ట్ ర్యాంకరూ కలిసి స్టేజి ఎక్కి నిలబడ్డాం. ప్రిన్సిపాల్ బ్యాడ్జి ఇస్తాడు, అందరూ చప్పట్లు కొడతారు, వెంటనే దిగిపోవడమే అనుకున్నాం (మిగతా వాళ్ళు అలాగే చేశారు). అయితే ప్రిన్సిపాల్ మమ్మల్ని చూసి బ్యాడ్జి ఇవ్వకుండా మైకు దగ్గరకి వెళ్ళి, ఇలా ఓ లెక్చరు ఇచ్చాడు –

“I don’t understand what is wrong with this section! When Madhulata of that section can get 99%, it is a shame that the first ranker of this section has just got 82%”

(మా కేసి చూస్తూ, మమ్మల్ని ఉద్దేశించి)

“Learn from that girl! With just around 80% marks where is the pride in wearing a badge? I refuse to present the badge till you deserve it!”

సన్మానసభ కాస్తా అవమానసభగా మారాక మేము బిక్కమొహం వేసుకుని స్టేజ్ దిగిపోయాము. ఈ టార్చరు దాదాపు ప్రతి పరీక్షకీ ఉండేది. మొట్టమొదటి సారి – “దేవుడా! నాకు ఫస్టు వద్దూ, సెకెండూ వద్దు. థర్డ్‌ర్యాంకు వచ్చేలా చూడు” అని ప్రార్థించాను.

సెక్షన్లు వేరు కావడంటో నాకు మధులతతో అంత పరిచయం కలగలేదు. హిమాలయ శిఖరానికి ఎదురుగా ఉన్న చిన్నకొండలు కనిపించినా, కంటికి ఆనాలన్న రూలేం లేదు కాబట్టి, తన దృష్టిలో నేనొక non-existing entity అయ్యుంటానని భావించాను. ఆమెతో ఎప్పుడూ మాట్లాడినట్టు కూడా గుర్తు లేదు, ఒక్కసారి తప్ప. ఓ రోజు మాథ్స్ పరీక్ష అయ్యాక నేను ఇంటికి వెళుతూ ఉంటే మధులత కొందరు bright students తో ఓ లెక్క ఆన్సరు గురించి చర్చిస్తూ కనబడింది. మధులత ఆన్సరు, వాళ్ళ ఆన్సరు టాలీ అవ్వట్లేదు. కాని మధులత తనదే కరెక్టంటోంది.  నేను కనిపించగానే – “ఉండండి. ఫణీంద్రని కనుక్కుందాం” అని తనే నా దగ్గరకి వచ్చి – “ఈ ప్రోబ్లంకి సొల్యూషన్ చెప్పు” అంది. నేను చేసినది చెప్పాను. ఆమె మొహం వెలిగిపోయింది. “చూశారా! నేనే కరెక్ట్! Thanks Phanindra” అంటూ వెళ్ళిపోయింది. మధులత నన్ను ఆన్సరు అడిగి వెరిఫై చేసుకుందా? ఇది నిజమేనా? ఇదో పెద్ద ఎచీవ్‌మెంటుగా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా మధులత దృష్టిలో నేనూ bright studentనే అన్న తలపు నాకు కొంత గర్వాన్నిచ్చింది.  దాదాపు స్కూల్‌ఫస్ట్ వచ్చినట్టే భావించాను!

టెంత్‌లోనూ మధులత స్టేట్ లెవెల్‌లో మంచి ర్యాంకే సంపాయించింది. తర్వాత టచ్‌లో లేను. But she remains the most inspiring person of my entire school life. టెంత్ అయ్యేటప్పటికి నాకు అమ్మాయిలంటే చాలా మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. ముళ్ళపూడి మాటల్లో చెప్పాలంటే – “అబ్బాయిలూ, అమ్మాయిలూ సమానం. కానీ అమ్మాయిలు కొంచెం ఎక్కువ సమానం (ముఖ్యంగా చదువులో)” అని డిసైడ్ అయ్యాను. చదువనే కాదు, జనరల్‌గా అమ్మాయిలంటే చాలా గౌరవం ఏర్పడిపోయింది. ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలూ  “బాయ్స్ ఓన్లీ” కాలేజీలో చదివినా, నేను ఏమీ మారలేదు. ఇంజనీరింగ్‌కి వచ్చేటప్పటికి ఆ గౌరవం అలాగే కొనసాగింది. కాబట్టే, ఇంజనీరింగులో ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలపై చులకనగా కామెంట్లు  చేసినా, అసభ్యంగా వాగినా చాలా insultingగా అనిపించి, అక్కణ్ణుంచి వెళిపోయేవాడిని.

కొసమెరుపు ఏమిటంటే, నేను ఇంజనీరింగ్ లోనే మొట్టమొదటి సారి overall topper of the departmentగా నిలిచాను. నా పేరు కాలేజీలో కాస్తో కూస్తో వెలిగింది కూడా. కానీ అప్పటికి నాకు ర్యాంకుల పైన మోజు పోయింది!

Advertisements

18 thoughts on “అమ్మాయిలూ చదువులరాణులూ!

  1. Post చాలా బాగుంది. మీ గురించి, రుబీనా , మధులత గురించి తెలుసుకోవడం బాగుంది.

    Like

  2. చాలా నిజాయితీ గా కొన్ని సందర్భాల్లొ హాస్యంగా ఉంది.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s