అనగనగా ఓ అమ్మాయి

1

అంత అందమైన అమ్మాయిని నేను మర్చిపోయానంటే ఆశ్చర్యంగా ఉంది. గుండె ఝల్లనిపించేంతటి సోయగం నా జ్ఞాపకాల్లోంచి గల్లంతైపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆంధ్రా అమ్మాయా, తెలంగాణా అమ్మాయా అని తర్కించకుండా, మన తెలుగింటి ముద్దుగుమ్మే అని సగర్వంగా, సమైక్యంగా ప్రతి నవయువకుడూ ఎలుగెత్తి చాటే అందం! తర్వాత తను నాదంటే నాదంటూ తన్నుకునేలా చేసి కుర్రగుండెల మధ్య చిచ్చుపెట్టేంత అందం! అమవాస్య లాంటి నా బుర్రలో వెలిగిన ఒక దీపావళి ధమాకాని మర్చిపోవడం అసంభవం!

Hitec city లో పనిచేస్తున్నాను కాబట్టి, Inorbit mall కి తరచూ వెళ్తూనే ఉంటాను. ఇది ఆఫీసు బాసు నుంచి నాకు కొంత తెరిపినిచ్చే టైం పాసు. నా బ్రహ్మచారి జీవితానికి కాసింత “పిల్ల”గాలి స్పర్శ. ఏకాంతంలో ఆనందాన్ని అన్వేషించుకునే రకం వాణ్ణి కాబట్టి సాధారణంగా ఒక్కణ్ణే వెళతాను. ఈ రోజు సాయంత్రం కూడా ఒక్కణ్ణే వెళ్ళాను. ఎప్పటిలాగే కొన్ని “మెరుపుతీగలు” కళ్ళముందు మెరిశాయి. ఎప్పటిలాగే కళ్ళతో పలకరించాను. కానీ మొట్టమొదటి సారి ఒక మెరుపు నన్ను చూసింది. చూడడమే కాదు చిరునవ్వు నవ్వింది. నవ్వడమే కాదు నా వైపుకి నడిచి వచ్చింది. రావడమే కాదు నన్ను పలకరించింది.

“హేయ్ రాజేష్! What a surprise! నువ్వూ ఈ ఊర్లోనే ఉన్నావా? So glad to meet you. Hey, నేను అర్జంటుగా వెళ్ళాలి. నీ ఫోన్ నంబర్ చెప్పు, రాత్రి కాల్ చేస్తాను”

ఆ అమ్మాయి కళ్ళలో ఉత్సాహం, గొంతులో ఆనందం స్పష్టంగా తెలుస్తున్నాయి. నాలో మాత్రం ఆశ్చర్యం, కంగారు. ఆ స్థితిలో ఏం చేసానో సరిగ్గా గుర్తు లేదు కానీ, నా సెల్ నంబరు ఇచ్చానని లీలగా గుర్తొస్తోంది. తేరుకుని ఎలాగో ఇంటికి చేరుకున్నాను. కానీ చిక్కుముడి వీడలేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?

నాకు ఫ్రెండ్సే తక్కువ, అందులో అమ్మాయిలు అసలే తక్కువ, ఆ అమ్మాయిల్లో అందగత్తెలు ఇంకా తక్కువ, ఆ అందగత్తెల్లో నా పేరు గుర్తుంచుకుని మరీ ఉత్సాహంగా పలకరించే వాళ్ళు సున్నాకి మించరు. మరి ఈ సన్నజాజి లాంటి అమ్మాయి ఎవరబ్బా? పేరుని పోలిన పేరులు ఉండొచ్చు, మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ పేరూ రూపం రెండూ పోలే మనుషులు తక్కువ. కాబట్టి తను అనుకున్న రాజేష్ నేనేనా? ఈ ఆలోచన నాలో కొంత ఆశ రాజేసినా ఆమె అనుకున్న రాజేష్ నేను ఖచ్చితంగా కాదు. అయితే ఎంత బాగుణ్ణో అనిపిస్తూ ఉన్నా, అవ్వనిది అవ్వదు కదా. ఇలా నా ఎనలిటికల్ ఎబిలిటీని ఉపయోగించి ఆ బ్యూటీ పొరబడిందని డిసైడ్ అయ్యాను.

“అన్నయ్యా, అమ్మ భోజనానికి పిలుస్తోంది” అన్న పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకున్నాను. కానీ బయటపడలేదు, లేకపోతే అస్సలు ఇష్టపడని ఆనపకాయ కూరని ఏ వంకా పెట్టకుండా తినెయ్యడం ఏమిటి?

2

భోజనం చేసి నా రూముకి వచ్చి ఆమె కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. చేస్తే ఎలా అని కంగారు ఒక పక్క, చెయ్యదేమో అనే భయం ఒక పక్క. ఫోన్ మోగింది –

హాయ్ రాజేష్! How are you? ఏంటి ఈ రోజు మాల్‌లో మరీ అంత ఆబ్వియస్‌గా అమ్మాయిలకి సైట్ కొడుతూ దొరికిపోయావ్ నాకు! నువ్వేం మారలేదన్న మాట!!

మన ఫేసుకి చిలిపితనం ఒక్కటే తక్కువ అనుకుంటూ ఆ అమ్మాయి మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాను.

హాయ్, ఇంతకీ మీరెవరు?

వావ్! జోకులా?

జోకులు కాదు మిస్, షాకులు. మీరెవరో నాకు నిజంగా తెలీదు.

అంటే, నా పేరు కూడా తెలీదా?

exactly!

వెల్! మరి నాకు తెలియని అబ్బాయిని నా ఫ్రెండని నేనెలా అనుకుని ఉంటాను?

ఈ వయసులో పొరబడడం, తడబడడం కామనే లెండి!

ఛ! అంటే నా కళ్ళు నెత్తికెక్కాయా?

May be, ఓ strangerని ఇలా టీజ్ చేసి, బకరాని చేస్తానని మీ ఫ్రెండ్స్‌తో బెట్ కట్టారేమో?

అబ్బో! ఇంకా?

Or, “వెన్నెల్లో ఆడపిల్ల” నవల్లో అమ్మాయిలాగ నన్నెక్కడో చూసి మనసు పారేసుకుని ఇలా..”

అవును తమరు పెద్ద మహేష్‌బాబని! రొటీన్ తెలుగు సినిమా ఆలోచనలు తప్ప కొత్తవి ఏమీ తట్టవా మీకు?

అంటే?

అమెరికన్ సీక్రట్ ఏజన్సీ వాచ్ లిస్ట్‌లో ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పోలికలు మీలో కనబడ్డంతో మీ గురించి కూపీ లాగమని నన్ను రిక్రూట్ చేసుకుని ఉండొచ్చుగా?

వాట్! అంటే నా ఫేస్ టెర్రరిస్టులా ఉందంటారా?

టెర్రరిస్టులు స్మార్ట్‌గా ఉండకూడదంటారా?

ఏదో రిటార్ట్ ఇవ్వబోయాను కానీ, ఆ అమ్మాయి నన్ను స్మార్ట్‌గా ఉన్నావందని రియలైజ్ అయ్యేటప్పటికి కొంత ఫ్లాట్ అయ్యాను.

ఓకె. మీరు నా ఫ్రెండే అనుకుందాం. ఓ హింటివ్వండి మీ గురించి. కనుక్కుంటా.

హింట్ ఇస్తే హిట్ కొట్టడంలో పెద్ద కిక్కేముంది మాస్టారూ? మీ ఇంటెలిజెంట్ బుర్రకి పదును పెట్టండి. రేపుదయం కాల్ చేస్తాను, గుడ్ నైట్!

తను కాల్ చేస్తే పజిల్ సాల్వ్ అవుతుంది అనుకుంటే ఇంకా కాంప్లికేట్ అయ్యింది. అందంతో పడేసింది, ఇప్పుడు తెలివితో పడేసింది. ఈ పడ్డం బానే ఉన్నా తన ట్రాప్ నుంచి బయటపడ్డం ఎలా? తను నన్ను ఆటపట్టించట్లేదు నిజమే చెప్తోంది అనుకుంటే ఎవరీ అమ్మాయి? రాత్రంతా జాగారం చేసినా ఆ సోయగం ఎవరో అంతు చిక్కలేదు.

3

ఉదయం ఫోన్ మోగింది. వెంటనే ఎత్తాను.

హలో రాజేష్ గారు, నేనండి అపరిచితురాలిని! మీ Sherlock Holmes బుర్ర నా గురించి ఏమంటోంది?

షర్‌లాక్ కాదు, లాక్ అయ్యింది, ఇంకా చెప్పాలంటే బ్లాక్ అయ్యింది అని మనసులో అనుకుంటూ,

సండే ఉదయాన్నే సుడుకో పజిల్‌లాగ తగులుకున్నారండీ మీరు! రాత్రి అంతా ఎంత మథించినా, చీకటే తప్ప ఒక్క వెలుగరేఖ లేదు!

మీరు కవా? ఈ రోజుల్లో కూడా ఇంకా “వెన్నెల్లో ఆడపిల్ల” నవల చదివారంటే మీరు పనిచేసేది హైటెక్‌లోనైనా మనసు బ్లాక్ & వైట్ కాలంలో ఉందని అర్థమౌతోంది! సరే మీకు ఎలాగూ తెలివి లేదని తేలిపోయింది కాబట్టి కనీసం కవిత్వాన్నైనా వాడండి. చిరుగాలిని, సెలయేటిని అడగలేకపోయారా?

మిమ్మల్ని తాకి మైమరచి చిరుగాలి స్థంభించిపోయింది. మీ హొయలు చూసి చిన్నబోయి సెలయేరు ఆగిపోయింది. ఎలాగండీ అడిగేది?

అబ్బో! ఈ కాలం కన్నెపిల్లలు కవిత్వంతో పడరు కవిగారూ! మీ స్వప్నప్రపంచం నుంచి బైటపడి నా సంగతి తేల్చండి.

నిలువునా ముంచేసి ఇప్పుడు తేల్చమంటే ఎలాగండీ? మా ఆఫీసులోనా మీ అంత బ్యూటీస్ ఉండే చాన్స్ లేదు! నా కాలేజ్ అమ్మాయిలంతా ఎప్పుడో ఎంగేజ్ అయిపోయారు. నేను చదివిన చిన్న స్కూల్లో అమ్మాయిలతో స్నేహం ఒకటే తక్కువ! ఆ చెత్తలో కష్టమర్ కోడ్ నా మొహాన కొట్టి గంటలో బగ్ కనుక్కోమన్నా కనుక్కుంటాను కానీ, మీరెవరో తేల్చడం నా వల్ల కాదండీ. మీరే చెప్పండి!

సో, నేను మీకంటే తెలివైనదాన్నని ఒప్పుకుంటారా?

నాకంటే అందమైన వారని ఒప్పుకుంటాను!

సరే మరి. ఓ బ్యూటీతో డేట్ చేసే చాన్స్ మీకే! సాయంత్రం 6 కి బంజారా హిల్స్ Coffee Dayలో కలుద్దాం. వేడి కాఫీ తాగితే మీకు నా స్టోరీ గుర్తొస్తుంది! బై!

4

Coffee Day లో అందరూ “కుదిరితే కప్పు కాఫీ, వీలైతే కాసిని కబుర్లు” మోడ్‌లో ఉన్నారు. నేను మాత్రం – “కుదిరితే చిన్న పరిచయం, వీలైతే జీవనసహచర్యం” మూడ్‌లో ఉన్నాను. మా అమ్మ సంబంధాలు చూస్తూ ఉంటే నేను – “ఊరూ పేరూ తెలిస్తే చాలా, మనిషి తెలియక్కరలేదా” అని విసుక్కున్నాను. ఇప్పుడు ఊరూ పేరూ కూడా తెలియని అమ్మాయిపై మనసు పారేసుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది!

ఆ అమ్మాయి వచ్చింది. వయసు తళుక్కుమంది. చిన్న నవ్వు నవ్వింది. మనసు కలుక్కుమంది. పెదవి విప్పింది –

గుర్తొచ్చిందా ఏమైనా?

మిమ్మల్ని చూస్తే నన్ను నేనే మర్చిపోతున్నాను, ఇంక గుర్తురావడం సాధ్యమా?

flirtingకి ఏమీ తక్కువ లేదు. అదీ తెలియదని బుకాయించే అమ్మాయితో!

మీరు నా ఫ్రెండని మీరే కదా అన్నారు!

ఫ్రెండ్ అన్నాను. జస్ట్ ఫ్రెండ్! తమరి ట్రెండ్ చూస్తే డౌటుగా ఉంది.

ముందు ఈ పజిల్ ఎండ్ చెయ్యండి!

లాస్ట్ చాన్స్! ఓ గెస్ కొట్టండి.

ఓకె. మీరు దూరపు వరసకి నాకు మరదలు అవుతారు. ఎక్కడో ఏ ఫేమిలీ ఫంక్షన్‌లోనో నన్ను చూశారు. అప్పటి నుంచీ నా మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు, నన్ను భర్తగా పొందాలని నోములూ వ్రతాలూ చేస్తున్నారు …

స్టాప్, స్టాప్! గోముగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటాడు ఎవడైనా, నోములు చేసే అమ్మాయిని కాదు! మీది తెలుగు సినిమా పైత్యం అని తెలుసు కానీ, మరీ మిస్సమ్మ కాలం సినిమాలు చూస్తున్నారనుకోలేదు!

ఏదో ఆటపట్టించడానికి అన్నాను లెండి. మీరు నా మనసుతో హోలీ ఆడుకున్నప్పుడు నేనూ కొంత ఆడాలి కదా!

ఆటపట్టించాలనే తప్ప, ఈ ఆట కట్టించాలనే ధ్యాస లేదన్న మాట!

నిన్నటి వరకూ ఉందండీ, ఇప్పుడు లేదు. ఇంత థ్రిల్లింగ్‌గా ఉన్న కథకి అప్పుడే ముగింపు ఎలా పలకమంటారు చెప్పండి?

కొత్త కథ మొదలవ్వాలంటే, పాత కథ ఎండ్ అవ్వాలి! ఇంకొక చాన్స్ ఇస్తా, మళ్ళీ ట్రై చెయ్యండి.

ట్రాన్స్‌లో ఉన్న వాడికి ఎన్ని చాన్సులు ఇచ్చినా యూజ్ లేదు!

షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది లెండి! 5th క్లాసులో మీకు తగిలిన షాక్ లాటిది తగిలితే మీరే దారికొస్తారు!

5th క్లాసా? అప్పుడు మేము వైజాగ్‌లో ఉన్నాం. అప్పటి దాకా స్కూల్ టాపర్‌గా వెలుగుతున్న నన్ను, మట్టికరిపించింది ఓ కొత్తగా వచ్చిన అమ్మాయి! అక్కడ మొదలు 7th క్లాస్ అయ్యాక మేము హైద్రాబాద్ వచ్చేవరకూ నాకు ఫస్ట్ ర్యాంక్ రాకుండా చేసింది ఆ పిల్ల! అంటే నువ్వు “ప్రవల్లిక”వా?

షాక్ తిన్నావా? గెస్ చెయ్యలేదు కదూ?

నువ్వు నా ఫ్రెండ్‌వి అని అబద్ధం చెప్పావ్! నువ్వు నా ఫ్రెండువి కాదు, నా శత్రువువి!

ఫ్రెండ్స్ కంటే శత్రువులే గుర్తుండాలిగా, నన్నెలా మర్చిపోయావ్ మరి!

అప్పటి నా చిన్న మనసు నీ వల్ల జరిగిన అవమానాన్ని సహించలేకపోయింది. కానీ ఏమీ చెయ్యలేకపోయింది. అందుకే మేము హైద్రాబాద్ వచ్చాక కన్వీనియంట్‌గా నిన్ను మర్చిపోయింది. అయినా, తలంతా నూనె రాసుకుని, జిడ్డు మొహంతో ఉండే ప్రవల్లిక ఇప్పుడు ఇంత “కెవ్ కేక”లా ఉంటుందని ఎవడు ఊహిస్తాడు! బట్ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడెలా కనుక్కున్నావ్ నన్ను?

వెల్, నాకు పెళ్ళి సంబంధాలు చూస్తుంటే మీ సంబంధం గురించి తెలిసింది. వివరాలను బట్టి నువ్వే అనిపించింది. నాన్న – “సంబంధం బాగుంది. నీకు నచ్చితే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి, తర్వాత నీ ఫొటో, బయోడాటా పంపిస్తాను” అన్నారు. “ముందు ఫోన్ చేసి, వాళ్ళ చెల్లి నంబరు తీసుకోండి, పనుంది” అన్నా. అలా..

నా చెల్లే నాకు వెన్నుపోటు పొడిచింది అన్నమాట! ఎంత దారుణం! పోనీలే నీలాంటి తెలివైన అందగత్తెతో ముడిపెట్టిందని ఆనందపడతాను.

సార్! కొంచెం తగ్గండి. ఇంకా నేను నిన్ను ఓకె చెయ్యలేదు. ముందు మనం చెయ్యాల్సిన పని ఒకటుంది.

ఏమిటి, ప్రేమించుకోవడమా?

కాదు, కాఫీ ఆర్డర్ చెయ్యడం!

ఇద్దరం ఒకేసారి హాయిగా నవ్వుకున్నాం. మా నవ్వు అందంగా మెరిసింది. ఆ మెరుపు వెలుగులో ముందున్న కాలం ఒక్కసారి కనిపించి, మురిపించి మాయమైంది! ఉందిలే మంచి కాలం ముందు ముందునా…

Advertisements

6 thoughts on “అనగనగా ఓ అమ్మాయి

  1. Too good Phanindra Garu…..telugu language ente sweeto ee story read cheste telustundi….chaduvutunnatu kadhu chustunattu anipinchindi…..👏👏👏👏

    (I thought only Haritha writes well, never read your other posts, will start doing now…..)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s