ఇది పాట కానే కాదు!

నేను: ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు
జనం: మరి పాట ఆపెయ్ రాదూ? నీ గానం మాకు చేదు!

షడ్జమం

చిన్నప్పటి నుంచీ నాకు పాటలు పాడ్డం అంటే మహా ఇష్టం. మా family gatherings లో పిల్లలందరిచేతా పాటలు పాడించడం రివాజుగా ఉండేది. నేనూ ఓ పాట పాడ్డం, అందరూ మెచ్చుకోవడం జరిగేది. చిన్నపిల్లలు పాడినప్పుడు ప్రోత్సహించడానికి “బాగా పాడావ్” అంటారని, దానర్థం మనకి singing talent ఉన్నట్టు కాదని నాకు చాలా పెద్దయ్యే దాకా తెలియలేదు! ఈ తెలియకపోవడం వలన జరిగిన అనర్థాలని సరదాగా ముచ్చటించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం!

ఆ పాటా ఈ పాటా అని లేకుండా అన్ని పాటలూ వినడం, నచ్చిన పాటలు నొటికొచ్చినట్టు పాడడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. లిరిక్స్‌కి అర్థాలు తెలియని చిన్న వయసులో “ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు ఎంత కఠినం!” అని పాడితే ఇంట్లో అందరూ నవ్వుకునేవారు! 7th class లో ఉన్నప్పుడు టీచర్ పాట పాడమంటే – “ఏప్రిల్ మేలలో పాపల్ లేరురా, బోరు బోరురా!” అని పాడితే ఆవిడ ఎందుకు చిరునవ్వులు చిందించిందో తెలియని అమాయకత్వం ఉండేది! అప్పటి కాలం హిట్ పాటలతో మొదలెట్టిన ప్రస్థానం నేను ఎదుగుతున్న కొద్దీ అలనాటి ఘంటసాల కాలం దాకా వెళ్ళింది. డైరీలలో పాటలు రాసుకోవడంతో మొదలెట్టిన కలక్షన్ చాలా తెలుగు పాటల పుస్తకాలుగా ఎదిగింది. మాటలని పట్టించుకోని పాట కాస్తా, సిరివెన్నెల వేటూరి వంటి రచయితల పుణ్యమా అని సాహిత్యంగా కవిత్వంగా ఎదిగి, లిరిక్ బాగోకపోతే పాట వినలేని స్థాయికి చేరింది నేను ఇంటర్మీడియట్ పూర్తిచేసే టైముకి.

రిషభం

తెలియనివాళ్ళ ముందు పాడడం అన్నది ఇంజనీరింగ్‌లో మొదలైంది. ర్యాగింగ్‌లో “నీ ఫేవరెట్ హీరో ఎవడ్రా” అని అడిగారు. నేను – “చిరంజీవి” అని చెప్పాను. “అబ్బో! అయితే ఒక మాంఛి చిరంజీవి పాట పాడుకో” అన్నారు. అప్పుడే “చూడాలని ఉంది” సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాలో పాట పాడితే ఇంప్రెస్ చెయ్యొచ్చనే ఉద్దేశ్యంతో, నాకు ఆ సినిమా పాటల ట్యూన్లు అంత రాకపోయినా, లిరిక్స్ సరిగ్గా తెలియకపోయినా, “ఓ మేరియా, ఓ మేరియా!” అంటూ అందుకున్నాను. వెంటనే ఒకడు – “చస్! ఆపరా బాబూ! చిరంజీవి ఫేన్స్ పరువు తీసేస్తున్నావ్! “మేరియా” ఏంట్రా, మేరీ బిస్కట్ లాగ? అది “మారియా”! పో వెళిపో” అన్నాడు. పాట బాగా పాడలేదన్నాడని ఫీల్ అయినా, ర్యాగింగ్ నుంచి బైటపడేలా చేసింది పాటే కనుక, “అంతా మన మంచికే” అనుకున్నా.

సరే! బైట పాడ్డం మనకి అంత అచ్చి రాలేదని, రూంలోనే తలుపు వేసుకుని పాడ్డం మొదలెట్టాను. నేను చదివిన విజయవాడ సిద్ధార్థాలో “కమ్మ”దనం ఎక్కువ కాబట్టి చాలా మంది NTR, బాలయ్య fans ఉండేవారు. ఓ రోజు నేను సీరియస్‌గా – “చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో” (“జస్టిస్ చౌదరి” చిత్రం) పాట పాడుతుంటే పక్క రూంలో ఉన్న కమ్మ మిత్రుడు విని – “అబ్బబ్బా! చించేశావు! ఏది మళ్ళీ పాడు” అన్నాడు. ఇంకోడిని కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ పాడి వినిపిస్తే – “ఎంతైనా, NTR మహ గొప్పోడు!” అని తెగ మురిసిపోయారు ఇద్దరూ. నన్నే పొగిడినట్టు నేను ఉప్పొంగిపోయాను!

గాంధారం

ఇలా రూం సింగింగే తప్ప స్టేజ్ మీద పాడే ధైర్యం చెయ్యలేదు. ఎప్పటికీ స్టేజ్ ఎక్కననే అనుకున్నా. కానీ విధి వైపరీత్యం వలన ఓ దుర్ముహూర్తాన “పాడాల్సి” వచ్చింది. ఏటా జరిగే సిద్ధార్థా కల్చరల్ ఫెస్ట్‌లో పాడడానికి బైట కాలేజీ వాళ్ళు చాలా మందే వచ్చారు. ఇంత మంది సింగర్స్ పాడుతున్నారు, నా పంట పండింది అనుకుంటూ నేను ఉత్సాహంగా ఆ పాటల పోటీకి శ్రోతగా వెళ్ళాను. కాలేజీలో బాలయ్య ఫాన్స్ కి చిరంజీవి ఫాన్స్ కి ఏవొ గొడవలైన కారణంగా, సినిమా పాటలు బ్యాన్ చేశాం, ఓన్లీ లలిత గీతాలే పాడాలి అని సడన్‌గా అనౌన్స్ చేశారు. చాలా మంది disappoint అయ్యి వెళ్ళిపోయారు. “లలిత గీతాలు పాడేవాళ్ళు ఎవరూ లేరా? రండి! పాడండి! కాలేజీ పరువు నిలబెట్టండి” అంటూ ఎవరో ప్రసంగించారు. నాలో ఏదో ఆవేశం ప్రవేశించి, ఆ క్షణికావేశంలో రెజిస్టర్ అయ్యాను. నా వంతు వచ్చింది. స్టేజ్ ఎక్కాను, కంఠం బదులు కాళ్ళు వణుకుతున్నాయి. చాలా మంది జనమే ఉన్నారు. జడ్జీలుగా ఎవరు ఉన్నారా అని చూస్తే, ముగ్గురు జడ్జీలలో “పద్మజ” మేడం కూడా కనిపించారు. ఆవిడ మాకు microprocessors చెప్పేది, మంచి పేరు ఉంది తనకి, నాపై మంచి ఇంప్రషన్ కూడా ఉంది. “చచ్చాన్రా బాబు!” అనుకున్నాను. సరే నిండా మునిగాక చలేమిటి అనుకుని, గొంతు విప్పి అందుకున్నాను – “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” అంటూ! వెంటనే పద్మజ మేడం కిసుక్కున నవ్వింది, తర్వాత బాగోదని చెయ్యి అడ్డుపెట్టుకుంది. జనాలు – “దిగిపో! దిగిపో” అని గోల మొదలెట్టారు. నేను మాత్రం, కాలేజీ పరువూ, ఇంకా మొత్తం తెలుగుజాతి పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాపైన ఉందన్నట్టు ఫీలైపోయి మొత్తం పాట పాడి గానీ దిగలేదు!

దిగాక ఎవరికీ మొహం చూపించకుండా వెంటనే హాస్టల్‌కి నడుచుకుంటూ వచ్చేశాను. రూం తాళం తీస్తుంటే NTR ఫేన్ అయిన కమ్మ మిత్రుడు కనిపించాడు. “ఎక్కడనుంచి వస్తున్నావ్” అని అడిగాడు. “singing competitionకి వెళ్ళి, పాటలు విని వస్తున్నా” అన్నాను, “పాడాను కూడా” అన్న సంగతి చెప్పకుండా జాగ్రత్త పడుతూ. “నేనూ వద్దామనే బయలుదేరా! సగం దూరం వచ్చా కూడా. ఈ లోపు ఎవడో “మా తెలుగు తల్లికి” అంటూ మొదలుపెట్టాడు. దూరం నుంచి వింటేనే భరించలేకపోయా, ఇంక దగ్గరకి వెళ్ళి వినే టార్చర్ ఎందుకని వెనక్కి వచ్చేశా. ఎక్కడ దొరుకుతారండీ ఇలాంటి వాళ్ళు!” అన్నాడు. నాకేమనాలో తెలియలేదు! “నువ్వూ పాడలేకపోయావా? బాగా పాడతావు కదా!” అన్నాడు. “అన్న NTR పాట పాడదామనే అనుకున్నా, కానీ సినిమా పాటలు బ్యాన్! ఏం చేస్తాం!” అని సమాధానం చెప్పి రూంలోకి వచ్చిపడ్డాను!

మధ్యమం

స్టేజ్ ఫియర్ వలన శ్రుతి తప్పింది కానీ నా గాత్రానికి ఏ ఢోకా లేదని సర్దిచెప్పుకున్నాను. అయితే ఇకపై స్టేజ్ మీద పాడాలని టెంప్ట్ కాకూడదు అని డిసైడ్ అయ్యాను. కానీ దేవుడు ఓ అమ్మాయిని పంపించి నా వ్రతదీక్షకి భంగం కలిగించాడు. ఓ కార్తీకమాసం వనభోజనాలకి వెళ్ళాం ఇంట్లో అంతా. అక్కడో పాటల పోటీ జరుగుతోంది. మా బావ – “పాడు పాడు” అన్నాడు. నేను – “అబ్బబ్బే, మన వల్ల కాదు” అన్నా. ఈ లోపు ఓ అమ్మాయి కనిపించింది, అందంగా ఉంది. “మీరు పాటలు పాడతారా?” అంది. “అబ్బో, వీడు సూపర్ సింగర్” అన్నాడు పక్కనే ఉన్న మా బావ! “మరి ఇంకా చూస్తారే, పార్టిసిపేట్ చెయ్యండి” అంది. అంత తియ్యని అమ్మాయి, తియ్యని గొంతుతో, తియ్యగా అడిగితే కాదనలేక, “సరే” అన్నా.

నేను ఎంచుకున్న పాట, “తరలిరాద తనే వసంతం”, చాలా కష్టమైనది. ఆ పాట పాడి ఇంప్రస్ చేస్తే, ఏమో “కన్నె వసంతం” తరలి వస్తుందేమో అన్న ఊహతో స్టేజ్ ఎక్కాను. జడ్జీగా ఓ ముసలాయన ఉన్నాడు. నేను లిరిక్ కాగితం పట్టుకుని, చెయ్యి ఒణుకుతున్నా, ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ పాడడం మొదలుపెట్టాను. మొదటి చరణం సగం పాడాక, సడన్‌గా ఆ పెద్దాయన – “బాబూ! ఆపు! నువ్వు పాడుతున్న శ్రుతి ఏమిటి?” అన్నాడు! ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి రమణీయ ఆకృతి గురించి చెప్పగలను కానీ, సంగీతం శ్రుతి గురించి నాకేం తెలుసు! తెల్లమొహం వేశాను. ఆయన కరెక్టుగా పాడి వినిపించి – “తప్పు శ్రుతిలో పాడుతున్నావ్, అందుకే బాగులేదు. పాడాలన్న ఉత్సాహం మంచిదే, కానీ ఈ సారి కొంచెం పాడడం నేర్చుకుని పాడు బాబూ” అన్నాడు. నేను అవమానంతో తలదించుకుని కిందకి దిగాను. తర్వాత తలెత్తి చూస్తే, ఆ అమ్మాయి, మా బావ పడీ పడీ నవ్వుతూ కనిపించారు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ట్రాప్ చేసారని నాకు అర్థమైంది!

పంచమం

“చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం” లాగ, “తక్కువ మంది జనం, ఇబ్బంది లేని పాట” అని డిసైడ్ అయ్యి ఇకపై పెద్ద పెద్ద గుంపుల మధ్య పాడకూడదని నిశ్చయించుకున్నాను. B.Tech అయ్యాక, చెన్నై IITలో చదువుతున్నప్పుడు, మా హాస్టల్ తెలుగు సంఘం వాళ్ళు ఒక పాటల పోటీ పెట్టారు. నేను, ఓ పాటలు పాడే మిత్రుడు ఇద్దరం కలిసి బయలుదేరాం. “ఏ పాట పాడుతున్నావ్?” అని అడిగాడు ఆ మిత్రుడు. “సొగసు చూడ తరమా” అన్నాను (“మిస్టర్ పెళ్ళాం” సినిమా). “ఆ పాటా?”, అని కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టాడు. బహుశా పెళ్ళయ్యాక పాడాల్సిన పాటలు బ్రహ్మచారులమైన మనకెందుకు అనుకున్నాడేమో!

హాల్లో ఓ పదిహేను మంది మాత్రమే ఉన్నారు. “హమ్మయ్య” అనుకున్నాను. నా ముందు వాళ్ళు బాగా పాడారు, నా మిత్రునితో సహా. నేను మొదలెట్టాను – “సొగసు చూడ తరమా, నీ సొగసు చూడ తరమా” అంటూ. ఈ సారి శ్రుతి తప్పలేదు కానీ, నేను మరీ ఇన్వాల్వ్ అయ్యి పాడడంతో పాట బాగా స్లో అయిపోయింది! పాట పూర్తిచేసాక నేను మళ్ళీ లోకంలోకి వచ్చి చూస్తే అంతా నాకేసి సీరియస్‌గా “నీ పాట భరించ తరమా” అన్నట్టు చూస్తున్నారు! ఎవరూ చప్పట్లు కొట్టలేదు, నా మిత్రుడితో సహా! “అయ్యో” అని నేను ఫీల్ అవుతూ ఉండగా నా తర్వాత వాడు “తందనాన భళా తందనాన” అంటూ అన్నమాచార్య కృతిని పాడడం మొదలెట్టాడు. అంతా అవాక్కయ్యాం! ఎందుకంటే శ్రుతీ లేదు, లయా లేదు, రకరకాల తాళాలతో చిత్రవిచిత్రంగా పాడుతున్నాడు. నవ్వాపుకోడానికి చాలా కష్టపడ్డాం. వాడి పుణ్యమా అని పోటీ తర్వాత అందరూ నా పాటని వదిలేసి వాడి పాట మీద కామెంట్లు వేసుకున్నారు. “thanks, సోదరా!” అనుకున్నాను మనసులో. కొసమెరుపు ఏమిటంటే సదరు అన్నమయ్య నాకు పక్కరోజు న్యూస్‌పేపర్ రూంలో కనిపించాడు. “మీరు క్లాసికల్ నేర్చుకున్నారా?” అని అడిగాడు. “లేదు! ఏం?” అన్నా. “నిన్న చాలా excellent గా పాడారు! keep it up” అన్నాడు! “మీరూ చాలా బాగా పాడారు, సాక్షాత్తూ తిరుపతి కొండమీద ఉన్నట్టే అనిపించింది!” అన్నాను, మనసులో నవ్వుకుంటూ. కాకీ కాకీ కలిసి కోకిల మనలాగే పాడుతుంది కదూ అనుకున్నాయట!

దైవతం

ఇలా “మూడు తప్పు శ్రుతులూ, ఆరు తప్పురాగాలతో” సాగుతున్న నా పాటల ప్రస్థానంలో నాకు జ్ఞానోదయం కలిగించే సంఘటన ఒకటి జరిగింది. చదువు అయ్యి హైదరాబాద్‌లో ఉద్యోగం మొదలెట్టాక అనుకోకుండా పాటలు రాసే అవకాశం వచ్చింది. “దత్” అనే కుర్రోడు, “అన్నా, నేనో ఆల్బం చేస్తున్నాను, లిరిక్స్ నువ్వు రాయగలవా?” అని Orkutలో అడిగాడు. పాటలు రాయడం అంటే కొత్త ట్యూన్స్ వినడం, రాయడం, పాడడం ఉంటుంది కాబట్టి నేను ఎక్సైట్ అయ్యి వెంటనే ఒప్పుకున్నా. ఓ ఐదు పాటల దాకా రాశాను. అందులో ఒకటి – “ఒప్పుకో ప్రియతమా” అన్నది. చాలా కష్టపడి కంపోజ్ చేశాడు, చాలా బాగా వచ్చింది. కొంత హై-పిచ్‌లో ఉంటుంది పాట. నా గొంతులో అంత range పలకదు. ఓ సాహితీ మిత్రుల సమావేశానికి దత్‌ని తీసుకుని వెళ్ళాను. అక్కడ “మీరు పాటలు రాస్తున్నారట కదా ఈ మధ్య. ఓ పాట వినిపించండి” అన్నారు. నేను వెంటనే ఈ పాటని చాలా ఉద్వేగంగా పాడాను, అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. దత్ మాత్రం కొంచెం ఇబ్బందిగా కనిపించాడు! సమావేశం అయ్యాక తిరిగి వస్తున్నప్పుడు అడిగాను – “ఏంటి, దత్ అలా ఉన్నావ్?” అని. “అన్నా, మీరు ఏం అనుకోనంటే ఓ మాట చెప్తాను. మీరు పాట ట్యూన్‌ని మార్చేసారన్నా!” అన్నాడు. “ఖూనీ చేసేసారన్నా” అందామనుకుని మొహమాట పడ్డట్టు ఉన్నాడు కుర్రాడు! అతని మొహంలో బాధ చాలా స్పష్టంగా కనిపించింది.

నేను ఎప్పుడూ నన్ను నేను SPB అనుకోలేదు కానీ, ఓ మోస్తరు సింగరుగా మాత్రం భావించాను. ఓ మంచి పాటని విన్నప్పుడు ఆ పాటని పాడేయ్యాలన్న ఎక్సైట్మెంటులో ఆ పాటని శ్రద్ధగా నేర్చుకోవడం పైన అంత దృష్టి పెట్టలేదు. నా ఆనందం సంగతి సరే కానీ, నేను తప్పు పాడడం అన్నది ఆ సంగీతదర్శకుడి కళని అవమానించినట్టేనన్న విషయం నాకు అప్పుడే అర్థమైంది. “నీ బాత్రూంలో నువ్వు ఏదైనా పాడుకో, కానీ అందరి ముందు పాడేటప్పుడు పాట అందాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీకు ఉంది”, అని నా గుండె కూత పెట్టింది!

నిషాదం

అప్పటి నుంచి సరిగ్గా నేర్చుకోనిదే అందరి ముందూ ఏ పాటా పాడకూడదని నిర్ణయించుకున్నాను! ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ల ముందు! ఎలాగూ నేర్చుకోవడం అన్నది నా బద్ధకం వలన కుదరదు కనుక, అందరి ముందు పాడడం దాదాపు తగ్గించేశాను. అలాగని అస్సలు పాటలు పాడడం మానేసానని కాదు. సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న మిత్రులని కలిసినప్పుడు “సిరివెన్నెల” పాటలని అప్పుడప్పుడూ పాడతాను. ఇక్కడ సంగీతం కన్నా, సాహిత్యం పైనే దృష్టి కనుక ట్యూన్ తప్పు పాడినా ఫరవాలేదు! అయితే, మ్యూజిక్ డైరెక్టరుకి క్షమాపణ చెప్పుకుని మొదలెడుతున్నాను! ఇక నేను రాసుకుని, నేను ట్యూన్ కట్టుకున్న పాటలైతే చెలరేగిపోతాను! ఎందుకంటే ట్యూన్ తప్పు అని చెప్పేవాడు ఎవడూ ఉండడు కాబట్టి.

నా పాటని మెచ్చుకోని వాళ్ళు లేకపోలేదు. అమవాస్యకో పున్నమికో కొంచెం బాగా పాడిన రోజులు ఉన్నాయి. బాగుందన్న వాళ్ళు ఉన్నారు. నా పెళ్ళికి ముందు, ఓ సారో అమ్మాయి నేను పాడగా విని వెంటనే Orkutలో “ఫణీంద్ర మంచి సింగరు అని నిన్నే తెలిసింది” అంటూ testimonial రాయడం ఓ తియ్యని జ్ఞాపకం! పాపం అమాయకురాలు!

కథలో నీతి ఏమిటంటే – “మన ఆనందం కోసం పాడడం వేరు, విన్నవాడికి ఆనందం కలిగించేలా పాడడం వేరు. అద్వైతసిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము అన్నది నిజమే కావొచ్చు కానీ, మన అమరత్వం కోసం పాట విన్నవాడిని అమరవీరుణ్ణి చెయ్యకూడదు!”

15 thoughts on “ఇది పాట కానే కాదు!

  1. @ కమ్మ మిత్రుడు విని – “అబ్బబ్బా! చించేశావు! ఏది మళ్ళీ పాడు” అన్నాడు. ఇంకోడిని కూడా తీసుకొచ్చాడు. మళ్ళీ పాడి వినిపిస్తే – “ఎంతైనా, NTR మహ గొప్పోడు!” అని తెగ మురిసిపోయారు ఇద్దరూ. నన్నే పొగిడినట్టు నేను ఉప్పొంగిపోయాను!

    lol.

    టాపిక్ ఎక్కడినుంచైనా తీసుకొచ్చి conclusionగా తమవారి డబ్బాకొట్టుకోవటమే కమ్మదనం.

    Like

    1. ఇక్కడ “కమ్మ” వారి గురించి రాయడం నా ఉద్దేశ్యం కాదు. అసలు ఆ ప్రస్తావనే
      తీసుకురాకుండా ఉండాల్సింది, కానీ అది మా సిద్దార్థా కాలేజీలో ఉన్న
      caste-feeling పై సెటైర్!

      మొత్తం కులం వాళ్ళందరిని ఒక గాటన కట్టెయ్యడం సబబు కాదని నా అభిప్రాయం.

      2014-04-06 5:21 GMT-07:00 ఎద రస నస :

      >

      Like

  2. Ahaa, bale rasaru, entaga ante, mimmalni Phani Garu ani kakunda, Guruvugaru ani cheppadam start chestanu….

    Telugu is not my mother tongue, so pls ignore my mistakes in telugu 🙂

    Like

    1. thanks Dinesh! I just write for fun, nothing of literary value here. I am sure there are much better Gurus than me.

      it is impressive that you are interested in reading Telugu articles even though Telugu is not your mother tongue. thats great!

      Like

  3. Mee cheta enno paatalu padinchukunnaanu anni paatalu chaala chakkagaa paadaaru bahusaa baaga sangitam ekkuva vachina vaari vadda ibbandi paduntaaru meeru. Mee paatale kaadu mee raatalu kuda mammalaristunnaayi

    Like

  4. నీలో ఉన్న ఇంకో కళాకారుణ్ణి చూసి మురిసిపోయాను (నిజానికి నవ్వుకున్నాను). ఎంత మంచి కామెడీ ‘సింగర్‌’ వో నువ్వు అని 😉

    Like

  5. Nicely written 🙂
    నా ఆరు ఋతువులు చదివి, పాటలేమైనా రికార్డ్ చేసి ఉంటే పంపించు అనడంలో ఓ కుట్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందిప్పుడు ;);)

    Like

  6. But you are an awesome lyricist anna!!!! 100 ki 100 when it comes to writing.
    I wish, I could soon associate with you.
    Loves and Regards,
    -Dath

    Like

Leave a comment