ద సెవెన్ ఇయర్ ఇచ్!

1

లలితకి నిద్ర పట్టట్లేదు. పక్కనే ఇద్దరు పిల్లలూ మత్తుగా నిద్రపోతున్నారు, ఆ పక్కనే శ్రీరాం అనబడే శ్రీవారు కూడా. తన నిద్రలేమికి కారణం అతనే! ఇందాకే దాహం అనిపించి లేచినప్పుడు, శ్రీరాం ఏదో కలవరిస్తున్నట్టు అనిపించి దగ్గరకి వెళ్ళి వింది. “స్వప్నా! స్వప్నా!” అని పలవరిస్తున్నాడు. దెబ్బకి మత్తంతా వదిలిపోయి, స్వప్నజగత్తు నుంచి బైటకొచ్చింది.

“ఎవరీ స్వప్న?”. శ్రీరాం ఆఫీసులో అమ్మాయిలూ, బైట అతని ఆడ స్నేహితులూ అందరూ దాదాపుగా తనకి తెలుసు. కాస్త అందంగా ఉన్నవాళ్ళని పేరుతో సహా గుర్తుంచుకుంది, అందులో “స్వప్న” ఖచ్చితంగా లేదు. అయినా లంకంత ఆఫీసులో ఎన్ని టీములున్నాయో, ఎంతమంది సుందరాంగులున్నారో ఎవరికి తెలుసు? గత కొన్ని నెలలుగా క్రిటికల్ ప్రాజక్ట్, చాలా బిజీ అని ఇంటికి లేటుగా వస్తున్నాడు. “పాపం నా మొగుడు కష్టపడిపోతున్నాడు” అనుకుంది కానీ ఏ ఇష్టసఖి చెంతనున్నాడో అని ఇప్పుడు డౌట్ వస్తోంది. సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు అనుకుంది ఇన్నాళ్ళు, రాముడి పక్కనున్న చంద్రుడు ఇలా కన్నుకొడతాడు అనుకోలేదు! ఈ ఆలోచనలతో తనకి గుర్రుగా ఉంటే మొగుడు మాత్రం గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు!

2

తెల్లారగానే ప్రాణస్నేహితురాలు పద్మకి ఫోన్ చేసింది.

“అబ్బా! ఇంత ఉదయాన్నే ఫోన్ చేసావేమిటే! వీకెండ్ రోజున స్లీపుని ఎర్లీగా ఎండ్ చెయ్యడం మహా పాపం!”

“ప్చ్, రాత్రంతా నిద్దరలేదే!”

“అబ్బో ఫ్రైడే రొమాన్సా? నీ పని బావుందే, పెళ్ళై ఏడేళ్ళైనా ఎడతెగని వలపు వెన్నెల!”

“ఛీ ఆపు, ఉదయాన్నే కవిత్వమేంటి చిరాగ్గా! గొల్లుమని ఏడుస్తుంటే కళ్యాణి రాగంలా ఉందన్నాట్ట ఎవడో! సీరియస్ విషయం గురించి ఫోన్ చేశానే. శ్రీరాం కి అఫైర్ ఉందేమో అని డౌటుగా ఉంది”

“వాట్?”

“అవును, రాత్రి “స్వప్నా, స్వప్నా” అని కలవరించడం నేను స్పష్టంగా విన్నాను!”

“ఓస్ అంతేనా! దీన్ని అఫైర్ అంటారేంటే నీ భాషలో? నేను నవ్వలేక చస్తున్నా ఇక్కడ. చూడు లల్లూ, కళ్ళని నమ్మాలి కాని కలల్ని నమ్మకూడదు!”

“త్రివిక్రం స్టైల్ డైలాగులు కొట్టకు! నాకు మండిపోతోంది ఇక్కడ! Facebookలో పొట్టిస్కర్టు వేసుకున్న అమ్మాయి పక్కన నిలబడి మీ ఆయన నవ్వుతూ ఉన్న ఫోటోని చూసి నువ్వు లైక్ కొట్టినప్పుడే నీ విశాల హృదయం నాకు అర్థమైంది! మేము నీ అంత మోడ్రన్ కాదు లేమ్మా!”

“మళ్ళీ నవ్వొస్తోందే! చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను, నీ అమాయకత్వం భలే ముచ్చటేస్తుందే లల్లూ! నీ ఇంటర్మీడియట్ చదువు అయ్యాక, “మనకి బోలెడు ఆస్తి ఉంది, అమ్మాయి ఉద్యోగం చెయ్యాలా ఏమైనానా!” అని నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేస్తే, మా “అమ్మానాన్నలకి నేనంటే ఎంత ప్రేమో” అని అమాయకంగా మురిసిపోయావ్! “మీ అమ్మయి జాతకం దివ్యంగా ఉంది, మల్లెలు విసిరే మొగుడొస్తాడు” అని ఎవరో జాతకం చెప్తే సాయంత్రాలు మల్లెపూలు పెట్టుకుని మరీ అమాయకంగా ఎదురుచూశావ్! సరే నీ అదృష్టం పండి, నువ్వు కోరుకున్నట్టే మంచి పట్నం కుర్రాడు భర్తగా దొరికాడు! మాణిక్యం లాంటి భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, వజ్రంలా నిగనిగలాడుతున్న జీవితం! హాయిగా కాపురం చేసుకోక ఈ అనుమానాలెందుకే?”

“అవును లేవే పద్దూ! నువ్వు ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నావుగా, నీతులు బానే చెప్తావ్! నువ్వు మోడ్రన్ అయిపోయావ్, నేను మాత్రం ఓల్డ్ పల్లెటూరి దాన్నంటావ్. మీ మోడ్రన్ వాళ్ళు ముఖ్యమైన వాటిని తేలిగ్గా, అక్కర్లేని వాటిని అతిగా పట్టించుకుంటారని నేనెన్ని సార్లు చెప్పినా నీకు ఎక్కదు మరి!”

“అబ్బబ్బా, సర్లేవే, పొద్దున్నే క్లాస్ పీకకు! ఇద్దరం హైద్రాబాద్‌లో ఉన్నామన్న మాటే కానీ, ఎప్పుడో కానీ కలవట్లేదు. ఈ వంకతోనైనా కలుద్దాం, సాయంత్రం మా ఇంటికి రా, తీరిగ్గా మాట్లాడుకుందాం.”

3

ఆలోచనల్లో మునిగి తేలుతూనే మొహం కడుక్కుని, వంటింట్లోకి వెళ్ళి టిఫిన్ చెయ్యడం ప్రారంభించింది. పిల్లలు లేవలేదు, కొద్ది సేపటికి శ్రీరాం లేచి ఫ్రెష్ అయ్యి హాల్లో సోఫాలో కూర్చుని ఏదో మ్యూజిక్ చానెల్ చూస్తున్నాడు.

“లల్లూ, టీవీలో నీకిష్టమైన పాట, “స్వప్నవేణువేదొ సంగీతమాలపించె”, “రావోయి చందమామ” సినిమాలోది వస్తోంది, చూస్తావా?”

అబ్బా! మళ్ళీ స్వప్నేనా అని మనసులో తిట్టుకుంటూ,

“బుర్రంతా ఆలోచనలతో వేడెక్కిపోయింది. ఈ స్వప్నలు, వేణువులు వినే మూడ్ లేదు. మీరు వినండి!”

“రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలోయ్ మీ ఆడవాళ్ళు. ప్రతిదానికి గాభరా పడిపోతారెందుకో! సెలవే కదా ఈ రోజు. “శనివారపు పూట – పతిదేవుని చెంత” అనుకోవచ్చు, మంచి కాఫీ ఇచ్చుకోవచ్చు, పక్కన కూర్చోవచ్చు, సరదగా కబుర్లు చెప్పుకోవచ్చు, ఇంకా ఏమైనా..”

“ఆ..ఆ! నేను తమరి చెంత కూర్చుంటే పెసరట్టు ఉప్మా వచ్చి ప్రసాదంలా ప్లేట్లో వాలుతుందీ? లొట్టలేసుకుని తినే వాళ్ళకి వంటింట్లో మేము పడే తిప్పలేం తెలుస్తాయ్!”

దెబ్బకి సైలంట్ అయ్యాడు మొగుడు. పెసరట్టు ఉప్మా అందిస్తూ అడిగింది –

“ఎందుకో ఈ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తోంది! నేనంటే మీకు ఇష్టమేనా?”

“ఎంత మాట! ఉప్మా పెసరట్టుని నేనంటే ఇష్టమా అని అడిగిందా? వెన్నెల జాబిల్లిని నేనంటే ఇష్టమా అని అడిగిందా? పూలదండ జడని నేనంటే ఇష్టమా అని అడిగిందా?”

“కానీ నేను అడిగాను! ముందు విషయం తేల్చండి. మీ చాకచక్యాలు చాకులాంటి నా దగ్గర కాదు!”

“సరే, ప్రియమైన చాకు గారూ! ఇప్పుడీ ప్రశ్న ఎందుకొచ్చిందీ అని? సెల్ ఫోన్‌ని రోజూ రీచార్జ్ చేసినట్టుగా రోజుకో “ఐ లవ్ యూ” చెప్తే కానీ భార్యకి ఆనందం లేదంటే, భర్తల ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది!”

“నేను “ఐ లవ్ యూ” కోరుకోవట్లేదు, లవ్ కోరుకుంటున్నాను!”

“అర్థమైంది లల్లూ! ఆ బిజీ ప్రాజెక్టు పుణ్యమా అని ఫేమిలీతో టైం స్పెండ్ చెయ్యడం కుదరట్లేదు. అందుకే నీకిలాంటి అనుమానాలొస్తున్నాయ్! ఈ రోజు సరదాగా టైం స్పెండ్ చేద్దాం. సాయంత్రం మూవీ చూసి తర్వాత డిన్నర్‌కి వెళ్దామా?”

“అదేం వద్దు! పద్మ వాళ్ళింటికి డిన్నర్‌కి రమ్మంది మనని. మేము మాట్లాడుకోవాలసినవి చాలా ఉన్నాయి.”

“ప్రాణస్నేహితులు ఇద్దరూ రోజూ మాట్లాడుకుంటూనే ఉంటారుగా! ఇంకా కలిసి మాట్లాడుకునేవి ఏముంటాయి మీకు?”

“ఆ..! మొగుణ్ణి కొంగున కట్టుకోవడం ఎలాగ అన్న టాపిక్ మీద పద్మ టిప్స్ చెప్తానంటేను!”

4

సాయంత్రం పద్మ ఇంటికి వెళ్ళారు. లలితకి ఓ బాబూ పాపా అయితే, పద్మకి ఒక బాబు. జీతాలు రెండైనప్పుడు ఒక్క బిడ్డే ఉండడం ఇప్పుడు కామనే కదా! పిల్లలు ఆడుకుంటున్నారు. శ్రీరాం, పద్మ భర్త రఘు కూడా మాటల్లో పడ్డారు. ఇదే అదనని స్నేహితురాళ్ళిద్దరూ తమ సీక్రట్ మీటింగ్ మొదలుపెట్టారు!

“చెప్పండి లేడీ డిటెక్టివ్ గారూ, ఏమైనా కనుక్కున్నారా?” – పద్మ అడిగింది!

“లేదే! శ్రీరాం కి తెలియకుండా ఫోన్‌లో మెసేజిలూ అవీ చూశాను, ఏవీ అనుమానాస్పదంగా కనిపించలేదు!”

“అనుమానం నీలో ఉంటే ఫోన్‌లో ఎలా కనిపిస్తుందే! నువ్వు మరీ ఇదైపోతున్నావ్ కానీ, మన మొగుళ్ళు పాతకాలం మగవాళ్ళ లాగ అఫైర్లు నడిపించే రకాలు అనిపించదే నాకు!”

“నన్ను అమాయకురాలంటావ్ కానీ, నువ్వే అమాయకురాలివే పద్దూ! లేకపోతే కాలం ఎంత మారినా, మగవాళ్ళు మారారూ, మగబుద్ధి మారిందీ? అయినా మన ఆడవాళ్ళు మనకే ముద్దొచ్చేసేంత అందంగా పుడుతూ ఉంటే మగవాళ్ళు ఇట్టే వలలో పడరూ?”

“నిజమే అనుకో! కానీ నీ హ్యాపీ ఫేమిలీ గురించి నాకు తెలుసే! శ్రీరాం గురించీ తెలుసు. ఈ స్వప్న అసలు అమ్మాయే కాదని నా గట్టి నమ్మకం. మొన్నే ఏదో కథలో చదివాను, భర్త “సరళా సరళా” అని కలవరిస్తే భార్య నీలాగే కంగారు పడుతుంది. చివరకి భర్త చాలా income tax కట్టాలని, అందుకే టాక్స్ రిటర్న్ చేసే “సరళ్ ఫార్మ్” ని తలచుకుని బాధపడుతూ అలా కలవరించాడనీ..”

“నువ్వు మరీ చెప్తావే! “సరళ్ ఫార్మ్” గురించి కలవరించిన వాడు “సరళ్ సరళ్” అంటాడు కానీ, “సరళా సరళా” అంటాడూ? సదరు భార్యామణి అంత అమాయకురాలు కాబట్టే ఆ భర్తగారి ఆటలు సాగాయి!”

“సర్లేవే, కథ కన్విన్సింగ్‌గా లేకపోయినా పాయంట్ ఏమిటంటే నువ్వు అతిగా కంగారు పడి నిద్దర చెడగొట్టుకోకూడదని! నీ వాలకం చూస్తుంటే రోజూ నిద్ర మానేసి మీ ఆయన ఏమి కలవరిస్తాడా అని ఎదురుచేసేలా ఉన్నావ్!”

“అది కాదు లేవే! శ్రీరాం కి నేనంటే చాలా ప్రేమే అనుకో, కానీ పెళ్ళైన ఇన్నేళ్ళ తర్వాత, కొంత ఇంట్రస్ట్ తగ్గడం సహజమే కదా!”

“యా! “సెవెన్ ఇయర్ ఇచ్” అని ఒక మాట ఉంది కూడా! పెళ్ళైన ఏడేళ్ళ దగ్గర నుంచీ మొగుడికి పెళ్ళాంపై మోజు తగ్గుతుందని దానర్థం!”

“చావు కబురు అంత చల్లగా చెప్తావేంటే! మా పెళ్ళై ఏడో ఏడే నడుస్తోంది ఇప్పుడు! దేవుడా, ఏడడుగులతో మొదలైన బంధం, ఏడేళ్ళకి ఇలా ఏడిపిస్తుందని ముందే రాశావా!”

“అబ్బా! అదేదో కల్పించిన లెక్క లేవే. నువ్వు మరీ ఇదైపోకు! నా మాట విని, ఈ “స్వప్న” సంగతి మర్చిపోయి, ఇంటికి వెళ్ళి, “నిజ” జీవితంలో హాయిగా గడుపు!”

5

పద్మ తేలిగ్గా తేల్చేసింది కానీ, మరిచిపోవడం అంత ఈజీ కాలేదు లలితకి. సిల్లీగా అనిపించినా కొన్ని విషయాలు మనసుని ఓ పట్టాన వదిలిపెట్టవు. తమ మధ్య ప్రేమ ఉన్నా, తమ బంధంపై నమ్మకమున్నా కూడా ఈ అనుమానం మనసుని తొలుస్తూనే ఉంది. అంతకముందు మామూలుగా అనిపించినవన్నీ ఇప్పుడు కొత్త సందేహాలని రేకెత్తిస్తున్నాయి. రోజూ లేటుగా రావడం ప్రాజక్టు పనా, పర్సనల్ పనా? శ్రీరాం ఈ మధ్య స్మార్ట్‌గా తయ్యారవుతున్నాడని అనిపిస్తోంది ఏమిటి? అతను ఫోన్‌లోకి చూసి నవ్వినా, ఆనందంగా కనిపించినా వెనుక ఆ స్వప్న ఉందేమో అని అనుమానం రావడం ఏమిటి? తను ఎంతో ప్రేమించే భర్తని తనే క్షుణ్ణంగా వేయి కళ్ళతో పరీక్షించడం తనకే వింతగా ఉంది!

పోనీ ఓ సారి ఆఫీసుకి వెళ్తేనో! అంత పెద్ద ప్రైవేట్ కంపనీలో తను వెళ్ళి చూసినా కూడా ఏమీ తెలియదని తెలిసినా ఎందుకో మనసు పీకుతోంది. అసలీ “స్వప్న” నిజంగా అమ్మాయే అయినా, ఆఫీసులోనే ఉండాలని లేదనీ, బయట అమ్మాయి అయ్యుండవచ్చనీ తెలుసు. అయినా వెళ్ళి చూస్తే పోలా అనిపించింది. రాత్రి భోజనాల వేళ భర్తని అడిగింది –

“ఏమండీ! రేపో రోజు సరదాగా మీ ఆఫీసుకి నేను లంచ్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఉదయం కట్టిన బాక్స్ భోజనం తినే బదులు అప్పుడే ఫ్రెష్‌గా వండిన వంట భార్యతో కలిసి తినే చాన్స్ మీకు! మీ కోలీగ్స్‌ని ఒకసారి పలకరించినట్టూ ఉంటుంది!”

“అంత కష్టపడడం ఎందుకు? చల్లారితే రుచి తగ్గిపోయే వంటా నీది, సాక్షాత్తూ అమృతం కాదూ! మా వాళ్ళని కలవాలంటే ఎలాగూ ఒక వారంలో ఆఫీసు పార్టీ ఉందిగా?”

“పార్టీయా?”

“అదేంటి మర్చిపోయావా? చెప్పాను కదా, కంపెనీ ఇయర్లీ పార్టీ వచ్చే శుక్రవారమే అని! మనం ప్రతి సంవత్సరం వెళ్తాం కదా! మా ప్రాజక్టు కూడా అప్పటికి ఓ కొలిక్కి వస్తుంది, ఇక కొంచెం రిలాక్స్ అవ్వొచ్చు.”

6

పార్టీలో చాలా జనం ఉన్నారు, కోలాహలంగా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంస్ నడుస్తున్నాయి, పరిచయాలూ పలకరింపులూ జరుగుతున్నాయి. శ్రీరాం టీం వాళ్ళతో పలకరింపులు అయ్యాయి,  అంతా తెలిసిన వాళ్ళే. ఒక అమ్మాయే కొత్తగా ఉంది. ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే శ్రీరామే పరిచయం చేసాడు –

“లలితా! ఈ అమ్మాయి “లేఖ” అని, ఈ మధ్యే జాయన్ అయ్యింది. వెరీ బ్రిలియంట్. మా ప్రాజక్టులో చాలా మంచి కంట్రిబ్యూషన్ చేసింది.”

“హాయ్” అని చెప్పి ఊరుకుంది. “స్వప్న” అన్న పేరు ఎక్కడైనా వినిపిస్తోందా అని శ్రద్ధపెట్టడం వలన మిగతావి అంత పట్టించుకోవడం లేదు.

డిన్నర్ టైములో “రమ”తో మాటలు కలిపింది. రమ శ్రీరాం కొలీగ్ శరత్ భార్య. తనూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే చేస్తోంది, బానే పరిచయం ఉంది.

“ఏమిటో! ప్రాజెక్టు పని అని తెగ బిజీగా ఉంటున్నాడు శ్రీరాం ఈ మధ్య” – ఓ రాయేసి చూసింది.

“అవును! శరత్ కూడా అంతే! బట్ ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ రిలీజ్ అయిపోయింది. ఇకనుంచి అంత ప్రెషర్ ఉండదు.”

అమ్మయ్యా, అయితే ప్రాజెక్టు బిజీ నిజమే అన్న మాట!

“ఓహో! ఏమిటో శ్రీరాం చేసే పనీ, ఆ ప్రాజెక్టు వివరాలు నాకంత తెలియవు. చెప్పినా అర్థమవ్వవు! నేను అందుకే అడగను”

“వీళ్ళు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ quite interesting. “Sleep Analysis Software” అనీ, కొన్ని devices వాడి మన నిద్రకి సంబంధించి కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేసే సాఫ్ట్‌వేర్. అందుకే ప్రాజక్ట్ కోడ్ నేముని వెరైటీగా “స్వప్న” అని పెట్టామని కూడా శరత్ చెప్పాడు!”

ఈ మాటలు విని లలిత మనసు దూదిపింజెలా తేలిపోయింది! సో స్వప్న అమ్మాయి కాదన్న మాట! అంత వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు, ప్రాజెక్టు పేరుని ఒక్కోసారి కలవరించడంలో ఆశ్చర్యం లేదు! హమ్మయ్య! పద్మ చెప్పింది నిజమే, ఇంటికి వెళ్ళిన వెంటనే దానికి ఫోన్ చేసి చెప్పాలి అనుకుంది. నిప్పులాంటి తన భర్తని అనుమానించిన మనసుని పదే పదే తిట్టుకుంది. “మా ఆయన బంగారం” అని మనసులోనే ముద్దులు పెట్టుకుంది!

7 (year itch!)

“మీరు చాలా ట్రెడిషనల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నారు. Cute Kids too!”

తనదైన ఆనంద లోకంలో విహరిస్తున్న లలిత ఈ మాటలు విని మళ్ళీ లోకంలోకి వచ్చింది. ఎదురుగా “లేఖ”. ఇందాక గమనించలేదు కానీ చాలా చక్కని అమ్మాయే! చిన్న పిల్లే, పెళ్ళి ఇంకా అయ్యి ఉండదు.

“Thank You! నాకు ట్రెడిషనల్‌గా ఉండడమే ఇష్టం. నా పేరు కూడా చాలా ట్రెడిషనల్ – “లలిత కామేశ్వరీ సుగుణ చంద్రిక!”, అందరూ సింపుల్‌గా “లలిత” అంటారు!”

“వావ్! what a name! నా పేరు కూడా నిజానికి “స్వప్నలేఖ”. అఫీషియల్ పర్పసస్‌కి “లేఖ” అని వాడుతున్నాను, క్లోజ్ ఫ్రెండ్స్ అంతా “స్వప్న” అనే పిలుస్తారు!”

21 thoughts on “ద సెవెన్ ఇయర్ ఇచ్!

    1. Simply superb! లలిత, పద్మల మధ్య మాటలు చాలా నేర్పుగా వున్నాయి. అలాగే చివర్న ఇచ్చిన చమక్కు భలే వుంది.

      Like

  1. ఆరున్నొక్క సంవత్సర దురద ఏడవ అంకంలో పంచ్ ఇచ్చి,
    ఇక జరగబోయేది ఊహకు వదిలేయడం నాకు బాగా నచ్చింది.
    మీకు దురద ఇంకా ప్రారంభం కాలేదనుకుంటాను.

    Like

    1. Thanks for the appreciation!

      On Wed, Aug 19, 2015 at 4:49 AM “ఎద రస నస” wrote:

      > D MADHU MOORTHY commented: “nice story involves readers to imagine. antena > aipoinda inka undali kada anipisthundi.” >

      Like

Leave a comment