అదృష్టం వాటేసుకుంటే…

నేను అదృష్టాన్ని నమ్మను! కానీ కొన్ని సార్లు అదృష్టమే మనని నమ్ముకుంటుంది. అలాంటప్పుడు ఏమీ చెయ్యలేం! అదృష్టం వాటేసుకుని ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటే కాదనడం పురుషలక్షణం కాదు కూడా! ఇలా అదృష్టం నా ప్రేయసిగా ఉన్న B.Tech ఫైనల్ ఇయర్ రోజుల్లోని కొన్ని తీపిముచ్చట్లు…

కోయిల కూసిన వేళ

జనవరిలో సంక్రాంతి సెలవలకి ముందు విజయవాడలో పెద్ద పుస్తకప్రదర్శన ఒకటి జరుగుతుంది. విజయవాడ సిద్ధార్థాలో B.Tech చదివిన రోజుల్లో ప్రతి ఏడూ అక్కడకి వెళ్ళడం నాకు చాలా ఇష్టమైన పనిగా ఉండేది. ఇప్పటికీ కూడా ఎక్కడైనా పుస్తకాలు కనబడితే వాటిని పలకరించి కుశలప్రశ్నలు వెయ్యడం నాకు అలవాటు! అలా ఆ సంవత్సరం (2002) కూడా వెళ్ళాను. ఎన్నో వందల స్టాళ్ళు ఉంటాయి. మొత్తం తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా సమయం పడుతుంది కూడా. నాకున్న 3-4 గంటల టైములో నేను వీలైనన్ని పుస్తకాలు చూసెయ్యాలని తాపత్రయంలో ఉన్నాను. అలా తిరుగుతూ ఉండగా కనిపించింది ఒక యండమూరి పుస్తకాల స్టాల్.

కొన్ని యండమూరి నవలలు చదివి ఉండడంతో కుతూహలంగా లోపలకి వెళ్ళాను. చాలా చదవని నవలలు కనిపించాయి. కొన్ని కొందామనుకున్నాను కానీ, ఖరీదు చాలా ఎక్కువ అనిపించింది, జీతం లేని నా విద్యార్థి జీవితానికి! “ఆ! నవలలు పాత పుస్తకాల షాపులో దొరకకపోవా? ఒకసారి చదివి పడేసే వాటిని కొనడం అవసరమా, అద్దెకి తెచ్చుకోవచ్చు కావాలంటే” అంటూ ఓ “అందని ద్రాక్ష పుల్లన” లాజిక్ చెప్పుకుని వచ్చేస్తూ ఉంటే ఓ చిన్న పుస్తకం ఆకర్షించింది. ఆ పుస్తకం పేరు “పడమటి కోయిల పల్లవి”. కొన్ని ఆంగ్ల కవితలకి యండమూరి చేసిన తెలుగు అనువాదాలు ఉన్నాయి. చాలా చౌక, పది రూపాయలే! “ఇది బెస్టు” అని వెంటనే కొని స్టాల్ నుంచి వెళుతూ ఉంటే, అంతక ముందు గమనించని ఓ పెద్ద బోర్డ్ చూశాను. దానిపై ఇలా రాసుంది – “యండమూరి అభిమానులకి బంపర్ ఆఫర్! ప్రతి పుస్తకంలో ఓ కూపన్! ప్రదర్శన ఆఖరి రోజున లక్కీ డ్రా! ఫ్రిజ్ గెలుచుకునే అవకాశం”. నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయాను.

“పడమటి కోయిల పల్లవి” పుస్తకం బానే అనిపించింది. ఆ కూపన్ సంగతి మాత్రం నేను మర్చిపోయాను. నిజానికి ఆ కూపన్‌ని నలిపి నా హాస్టల్ రూం లోని డస్ట్‌బిన్‌లో పడేశాను. హాస్టల్ అంతా హాలిడే మూడ్‌లో ఉంది, సంక్రాంతి సెలవలు వస్తున్నాయి కదా. కాలేజ్ ఆఖరి రోజున నేను ఇంటికి వెళ్దామని బట్టలు సర్దుకుంటూ ఉండగా హాస్టల్ మిత్రుడు సుబ్రహ్మణ్యం తలుపు తట్టాడు. “ఫణీంద్రా, నేను పుస్తక ప్రదర్శనకి వెళ్తున్నా. ఈ రోజే ఆఖరి రోజు కదా. నీకేమైనా పుస్తకాలు కావాలా?” అని అడిగాడు. అతనికి నా పుస్తకాల పిచ్చి తెలుసు. “లేదు. నేను ఆల్రెడీ వెళ్ళాను. పుస్తకాలు కొన్నాను కూడా” అని చెప్పాను. “సరే. వెళ్తాను అయితే. మళ్ళీ పండగ తర్వాతే మనం కలవడం. హ్యాపీ సంక్రాంతి” అన్నాడు.

నాకెందుకో సడెన్‌గా ఆ కూపన్ సంగతి గుర్తొచ్చింది. పోనీ నింపితే పోలా అనిపించింది ఎందుకో (అదృష్టం ఇలాగే చెవిలో గుసగుసగా ప్రియవచనాలు పలుకుతూ ఉంటుంది. వినిపించుకున్న వాడు ధన్యుడు!) “ఉండు. ఒక కూపన్ ఉంది. అది యండమూరి స్టాల్‌లో ఉన్న బాక్సులో వేస్తావా” అంటూ, కూపన్‌ని డస్ట్‌బిన్ నుంచి తీసి, దుమ్ము దులిపి, సాఫు చేసి డీటైల్స్ నింపాను. సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంగా ఆ పాలిపోయిన కూపన్ కేసి చూశాడు – “ఇది వాడు తీసుకుంటాడు అంటావా?” అన్నాడు. “ఏమో! ట్రై చేద్దాం. నష్టం ఏమీ లేదుగా” అన్నాను. “సరే, ఫణీంద్రా! బై” అని వెళ్ళిపోయాడు.

సెలవలయ్యాక మళ్ళీ హాస్టల్‌కి వచ్చి డోర్ తెరవగానే ఓ పావలా కార్డు కనిపించింది. మనకి కార్డులో ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరా అనుకుంటూ చదివితే – “కంగ్రాట్స్! మీరు ఫ్రిజ్ గెలుచుకున్నారు!” అంటూ ఎవరిని సంప్రదించాలో వివరాలు ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది ఆ కూపన్ సంగతి! నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది బోగస్ ఏమో అన్న అనుమానం కూడా వచ్చింది. అప్పుడే సుబ్రహ్మణ్యం కూడా దిగాడు. “ఏమి అదృష్టం ఫణీంద్రా! దుమ్ము దులిపితే తుమ్ములు వస్తాయని తెలుసు కానీ, ఫ్రిజ్ వస్తుందని ఇప్పుడే తెలిసింది. తీసుకో ఫణీంద్ర. రూములో పెట్టుకుందాం. సమ్మర్‌లో బాగా పనికొస్తుంది” అంటూ ఏవో కామెడీ డైలాగులు కొట్టాడు. ఈ విషయాన్ని హాస్టల్ అంతా ప్రచారం చేశాడు, ఆ కూపన్ బాక్సులో వేసిన లక్కీ హ్యాండ్ తనదే అన్న విషయం నొక్కి చెప్తూ!

ఫ్రిజ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆ పబ్లిషింగ్ హౌస్ వాడు మాటల్లో – “ఇంతకీ మీరే పుస్తకం కొన్నారండీ?” అన్నాడు. మరీ పది రూపాయల పుస్తకం కొన్నానని చెప్పడానికి మొహమాటం అడ్డొచ్చింది. “డబ్బు టూద పవరాఫ్ డబ్బు” నవల కొన్నాను, ధనలక్ష్మి నడిచొచ్చింది. ఇప్పుడు “ప్రేమ” నవల కొందామా అని ఆలోచిస్తున్నాను” అని చెబుదామనుకున్నాను. కానీ కూపన్ నంబర్ బట్టి పుస్తకం తెలిసిపోతుందేమో, అబద్ధం చెప్పడం ఎందుకు? మొత్తానికి మాట మార్చి – “యండమూరి ఈ కొత్త పుస్తకం ఉంది చూశారూ (“విజయానికి ఆరో మెట్టు” అని గుర్తు), ఇది చాలా అద్భుతంగా ఉందని విన్నాను. ఎంతండీ ఇది?” అన్నాను. మొత్తానికి అలా ఓ 250 రూపాయలు పెట్టి ఓ పుస్తకం కొనాల్సి వచ్చింది, ఫ్రిజ్‌ని తెచ్చుకునే ముందు.

మాటల గలగల!

అదే సంవత్సరం ఫిబ్రవరిలో అనుకుంటా, IETE (Institute of Electronics and Telecommunications Engineers) వాళ్ళు ఒక పోటీ పెట్టారు. ఒక 50 టాపిక్కులు ముందే ఇస్తారు, వాటిలో ఎన్నో కొన్ని (కుదిరితే అన్నీ) ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అక్కడ లక్కీడిప్‌లా ఓ కాయితం తీసి అందులో వచ్చిన టాపిక్ గురించి ఐదు నిమిషాలు టెక్నికల్ ప్రజంటేషన్ ఇవ్వాలి. ఇది స్టేట్ లెవెల్ కాంపిటీషన్. విశాఖపట్నం, హైదరాబాద్ నుండి కూడా విద్యార్థులు వస్తారు. మా డిపార్టుమెంటులో కొందరు ప్రొఫెసర్స్ IETE లో ఏక్టివ్ మెంబర్స్ కాబట్టి వాళ్ళు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, మా కాలేజీ వాళ్ళని పార్టిసిపేట్ చెయ్యమని ప్రోత్సహిస్తూ, నిజం చెప్పాలంటే బలవంతం చేస్తూ ఉన్నారు! అసలే ఫైనల్ ఇయర్! ప్రాజెక్టు పనుల్లో బిజీ, పైగా GATE కి ప్రెపరేషన్ కూడా ఉంది (కొందరు GRE ప్రెపరేషన్ లో ఉన్నారు). కాబట్టి ఎవరూ అంత ఆసక్తి చూపించట్లేదు. క్లాసు టాపర్‌ని కాబట్టి నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారని, నేను “తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” పద్ధతి ఫాలో అయ్యి, ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాను.

పోటీ ఆదివారం అయితే రెజిస్ట్రేషన్ కి ఆఖరి రోజు శుక్రవారం. మొత్తానికి ఎలాగో గండం గట్టెక్కి నేను రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అగత్యం రాకుండానే శనివారం వచ్చేసింది. “హమ్మయ్యా” అని ఊపిరి పీల్చుకుని చాలా కాలం తర్వాత రిలాక్సడ్‌గా మా డెపార్టుమెంటులోకి అడుగు పెట్టాను. ఇంతలోనే మా గత బ్యాచ్ టాపర్ అయిన ఒక సీనియర్ (అతను ఆ సంవత్సరం మా డిపార్టుమెంటులో లెక్చరర్‌గా పని చేశాడు), నన్ను పట్టుకుని ఆపాడు – “ఒరేయ్! నువ్వు ఆ IETE కాంపిటీషన్‌కి రెజిస్టర్ అయ్యావా లేదా? ఆ కాంపిటీషన్ ఉన్నది మనలాంటి వాళ్ళ కోసమే!” అన్నాడు కాస్త గర్వంగా! నేను అతితెలివి ఉపయోగించి – “రెజిస్టర్ అవుదామనే చాలా అనుకున్నాను. కానీ బిజీగా ఉండడం వల్ల మర్చిపోయాను. ప్చ్, ఇప్పుడే తెలిసింది రెజిస్ట్రేషన్‌కి ఆఖరి రోజు నిన్నే అని! ఏం చేస్తాం, బ్యాడ్ లక్!” అన్నాను. వెంటనే అతను – “దానిదేముంది! మనం ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాం. నీ పేరు నేను ఇచ్చేస్తాను. నువ్వు రేపు తిన్నగా వెన్యూకి వచ్చేసెయ్. గుడ్ లక్” అని చెప్పి వెళ్ళిపోయాడు. షాక్ తినడం నా వంతయ్యింది!

వెంటనే వెళ్ళి ఆ ప్రోగ్రాం బ్రోచర్ చూస్తే ఉన్న 50 టాపిక్కులూ చాలా లేటెస్ట్ టెక్నికల్ టాపిక్కులు. మా అవుట్ డేటెడ్ నాగార్జున యూనివర్సిటీ సిలబస్ పుణ్యమా అనీ వాటిలో నేను ఓ 5-10 టాపిక్కుల పేర్లు మాత్రమే విన్నాను. మిగతావి ఏమిటో కూడా తెలియదు. “చచ్చాన్రా దేవుడా” అనుకుని లైబ్రరీకి వెళ్ళి ఏవో పుస్తకాలు కొన్ని తీసుకుని ఊసూరుమంటూ హాస్టల్‌కి బయలుదేరాను. ఆదివారం రానే వచ్చింది. నేను భయం భయంగానే వెళ్ళాను. ఓ పది టాపిక్కుల వరకూ కొంత చదవగలిగాను. ఈ రోజు “అవమానం” తప్పదు అని నిర్ధారణకు వచ్చాను.

ఓ యాభై మంది వరకూ వచ్చారు విద్యార్థులు. అందులో నా ఇంటర్మీడియట్ మిత్రుడు కూడా కనిపించాడు. వాడు మంచి బ్రిలియంట్, భీమవరం కాలేజీలో చదువుతున్నాడు. “చాలా బాధగా ఉందిరా. ఓన్లీ నలభై టాపిక్కులే చదవగలిగాను!” అన్నాడు! నా మీద నాకే జాలి వేసింది అది విన్నాక. పోటీ మొదలైంది. ఆశ్చర్యం! ఎవరికీ వాళ్ళు చదివిన టాపిక్కులు రావట్లేదు. చాలా మంది ఓ రెండు నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఆఖరికి నా మిత్రుడు కూడా. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మధ్యాహ్నం సెషన్ మొదలయ్యే ముందు నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ ప్రకటన చేసారు – “మా ప్రోగ్రాం స్థాయి ఎక్కువగా ఉందో, లేక విద్యార్థుల స్థాయి తక్కువగా ఉందో అర్థం కావట్లేదు. కనీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేకపోవడం క్షమార్హం కాదు! కాబట్టి ఈ మధ్యాహ్న సెషన్‌లో అందరూ ఖచ్చితంగా పూర్తిగా ఐదు నిమిషాలూ మాట్లాడాల్సిందే. మీరేం చేస్తారో మాకనవసరం!”

“ఆహా, ఇలాటి ఆఫర్లు కూడా ఉన్నాయా నేను మాట్లాడే సమయానికి! హాయిగా హాస్టల్‌లో ఆదివారం స్పెషల్ బిర్యానీ తింటూ సేద తీరాల్సిన వాడిని ఇలా బుక్కయ్యానేంటో” అనుకున్నాను. “ఫణీంద్ర” అని నా పేరు పిలవగానే “నీ పని అయ్యింద్రా” అన్నట్టు వినిపించింది నాకు! టెన్షన్ పడుతూ వెళ్ళి చీటీ తీసాను – VLSI design టాపిక్! నా ఆనందానికి అవధులు లేవు. నేను చదివిన పది టాపిక్కులలో అది ఉండడమే కాక, నేను ప్రాజెక్టు చేస్తున్నది దాని మీదే! ఇక నేను విజృంభించి నోటికొచ్చినది అంటా వెళ్ళగక్కాను. మొట్టమొదటి సారి ఆ పోటీలో, “టైం అయిపోయింది ఇక ఆపరా బాబూ!” అనడానికి సూచనగా బెల్ మోగింది. మిగతా విద్యార్థులు అంతా కుళ్ళుకుంటూ నాకేసి చూసి తప్పదన్నట్టు చప్పట్లు కొట్టారు!

ఇక చెప్పేదేముంది? ఫస్టు ప్రైజు నాకే వచ్చింది. ఇబ్బందిపడుతూ తీసుకోవాల్సి వచ్చింది. వెంటనే బయటపడి హాస్టల్‌కి పరిగెత్తాను. రూం దగ్గర సుబ్రహ్మణ్యం కనిపించాడు. చేతిలో సర్టిఫికెట్ చూసి, “నీకు కాకపోతే ఎవరికి వస్తాయి ఫణీంద్రా ఫస్టు ప్రైజులు!” అన్నాడు. నేను టాపర్‌ని అని ఏనాడు గర్వపడలేదు కానీ, ఆ మాట విన్నాకా మాత్రం అవమానంతో సిగ్గుపడ్డాను!

పక్కరోజు నా కథంతా విన్నాక సుబ్రహ్మణ్యం అవాక్కయ్యి – “ఇంకా చూస్తావేంటి ఫణీంద్రా! అదృష్టం వద్దన్నా నీ వెంట పడుతోందని రుజువైంది! మొన్నఫ్రిజ్జు, నిన్న ప్రైజు! పద వెంటనే ఓ కోటి రూపాయల లాటరీ టిక్కెట్టు కొనేద్దాం! ఓ రిక్వెస్టు ఫణీంద్రా! నిన్ను అంటుకు తిరిగే భాగ్యం ప్రసాదించు. అలాగైనా నీ అదృష్టం కొంత తగిలి నాకూ GATE లో మంచి స్కోర్ వస్తుందేమో!” అంటూ ఎప్పటిలాగే జోకులు వేశాడు!

పరీక్షాపత్రాల లీల

తెలివితేటలు వేరు, పరీక్షలు బాగా రాయగలగడం వేరు. అదేంటో నాకు పరీక్షల్లో ఎప్పడూ బాగా మార్కులు వచ్చేవి, కానీ నేను పెద్ద తెలివైన వాడినని ఎప్పుడూ అనుకోలేదు. “పరీక్షలు బాగా రాసే కళ కొంత నాకు వచ్చిందేమో” అనుకునేవాడిని. ఈ ప్రస్థానం B.Tech లో కూడా కొనసాగి నాకు తొంభై శాతం పైగా పర్సంటేజ్ ఉండేది. దీని మీదే సుబ్రహ్మణ్యం ఒకసారి జోక్ చేస్తూ – “అదేం పర్సంటేజ్ ఫణీంద్రా! ఈ పర్సంటేజ్ కి పడని వాళ్ళు ఉంటారా? కాలేజీలో మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయికి ప్రపోజ్ చేసెస్ చెప్తాను! నిన్ను కాదనే అమ్మాయి సిద్ధార్థాలోనే ఉండదు. చాలెంజ్!” అన్నాడు! నేను నవ్వుతూ – “అమ్మాయిలు పర్సనాలిటీకి పడతారు కానీ, పర్సంటేజుకి పడతారంటావా?” అన్నాను.

సరే! మా క్లాసులోని ఓ తెలివైన స్నేహితుడు ఓ రోజు నా దగ్గరకి వచ్చి – “ఫణీంద్రా! మొన్న సెషనల్‌కి నువ్వు రాసిన ఎగ్జాం పేపర్ నాకిస్తావా?” అన్నాడు. నేను ఆశ్చర్యంగా – “ఎందుకు?” అన్నాను. “ఏం లేదు, నువ్వు ఎగ్జాంస్ ఎలా రాస్తున్నావో, నీకన్ని మార్కులు ఎలా వచ్చేస్తున్నాయో కొంత స్తడీ చేద్దామని” అన్నాడు. సరే అని ఆ రోజే ఇచ్చిన ఓ పేపర్‌ని అతనికి ఇచ్చాను. దానిలో నాకు 15/15 మార్కులు వచ్చాయి కాబట్టి అది మంచి “స్తడీ మోడలే” అనిపించింది.

పక్కరోజు ఆ మిత్రుడు ఆ పేపర్ నాకిచ్చేశాడు. “ఏమైనా తెలిసిందా?” అని అడిగాను. “ఆ! మన లెక్చరర్లు పేపర్లు సరిగ్గా దిద్దరని తెలిసింది” అన్నాడు! “ఎందుకు అలా అనిపించింది?” అన్నాను, “అనిపించడం కాదు, కనిపించింది. నువ్వే చూడు” అని నా ఆన్సర్‌షీట్ లోని ఆఖరి పేజీ చూపించాడు. పరీక్షలోని మూడు ప్రాబ్లంస్‌లో ఆఖరి ప్రాబ్లం మొదలెట్టాను ఆ పేజీలో, పక్క వైపు తిప్పి చూస్తే incompleteగా ఉంది! అప్పుడు గుర్తొచ్చింది, టైం లేక నేను ఆ లెక్కని పూర్తిగా చెయ్యలేదు. కానీ నా టైం బావుండి మా లెక్చరర్ నా మీద నమ్మకంతో పేజీ తిప్పకుండానే ఫుల్ మార్కులు వేసేసాడు!

“అదృష్టం ఫణీంద్రా! దారుణమైన అదృష్టం. నీకు “గుడ్ లక్” చెప్తే నీ అదృష్టాన్ని తక్కువ చేసినట్టు, ఎందుకంటే నీకు వండర్ఫుల్ & ఎక్సలెంట్ లక్ ఉంది. “గుడ్ లక్” అనడం అండర్ స్టేట్మెంట్” అన్నాడు!


అయితే అదృష్టం ఎప్పుడూ మనతోనే ఉండదు. “మూగమనసులు” సినిమాలో కొసరాజు “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా” అనే గొప్ప పాట రాశారు. శివుడి తలపైనున్న గంగ గురించి చెప్తూ – “ఎవరో పిలిస్తె వచ్చింది, ఎవరి కోసమో పోతోంది, మయాన మజిలీ ఏసింది” అంటాడు. అదృష్టం గంగమ్మ తల్లి లాంటిది. ఒకసారి మునిగితేలి ధన్యులమయ్యాం అనుకోవాలే తప్పితే, శివుడిలా ఫీలైపోయి అదృష్టగంగని బంధించెయ్యాలి అనుకోకూడదు! ఎప్పుడూ అర్థభాగమై శివుని చెంతనే పార్వతి ఉన్నట్టు, మన స్వయంకృషి, మన ప్రయత్నమే మనతో ఉండేవి. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే అదృష్టవంతుడు. నాకు వీడ్కోలిచ్చి అదృష్టం కొన్నాళ్ళకి వెళ్ళిపోయింది. అయితే నన్ను “GATE” దాటించి IIT చెన్నైలో పడేశాక వెళ్ళింది. అది ఇంకో కథ!

Advertisements

5 thoughts on “అదృష్టం వాటేసుకుంటే…

  1. “ఫణీంద్ర” అని నా పేరు పిలవగానే “నీ పని అయ్యింద్రా” హ హ హ హ ఈ లైన్ అదిరిపోయింది!

    Like

  2. హాయ్ ఫణి, నిన్ను అదృష్టం కా(వా)టేసిన సన్నివేశాలు నన్ను మన బిటెక్ హాస్టల్ రోజులలోకి తీసుకుని వెళ్ళాయి. చాలా హృద్యంగా వ్రాసావు. I enjoyed reading them, thank you for sharing them. నీవు వ్రాసిన ముగింపు నాకు బాగా నచ్చింది.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s