అనగనగా ఓ పింకు పర్సు కథ!

 

1

“Blue is for boys and pink is for girls!”
“Blue is for boys and pink is for girls!”

ఐదేళ్ళ నా కూతురు నన్ను ఆటపట్టిస్తూ ట్యూన్ కట్టి మరీ రిపీట్ మోడ్‌లో పాడుతోంది! స్నానానికి వెళుతూ ఏమరపాటులో నా టవల్ బదులు నా కూతురి పింక్ టవల్ అందుకోబోవడమే నేను చేసిన తప్పు! అందుకు ఈ పరాభవం తప్పలేదు.

“చూడు బుజ్జమ్మా! గర్ల్ కలర్స్ అనీ బోయ్ కలర్స్ అనీ ఉండవు. అన్ని కలర్సూ మంచివే. Pink is not just for girls” అన్నాను నేను కొంచెం ఉడుక్కుంటూ.

“You are so funny daddy!” అంటూ వెళ్ళిపోయింది, నాకేమీ తెలీదు అన్నట్టు ఓ లుక్ ఇస్తూ.

“ఈ కాలం పిల్లలకి ఉగ్గుపాలతోనే బ్రాండ్ నేములూ, కార్టూన్ క్యారెక్టర్లు తెలిసిపోతున్నాయి. వీటితో పాటూ అబ్బాయిలూ అమ్మాయిలూ తమ తమ వేరు వేరు లోకాల్లో ఉండడం అలవాటు అవుతుంది. అందులో భాగమే ఈ “పింక్ అన్నది అమ్మాయిల రంగు” అన్న భావన. నా చిన్నతనంలో అయితేనా ఇలాటి తేడాలేవీ తెలియవు…” – ఇలా నా ఆలోచనా స్రవంతి సాగుతూ ఉండగా గుర్తొచ్చింది గతంలో నేనీ పింక్ రంగు విషయంలో చేసిన ఓ పొరబాటు. అదీ చిన్నతనంలో చేసింది ఏమీ కాదు, పెద్దరికంలో జరిగిందే!

2

చెన్నై ఐ.ఐ.టీలో చదువు పూర్తయ్యాక ఓ సంవత్సరం పాటు అక్కడే ఉద్యోగం వెలగబెట్టాను. అడయారులో ఓ సింగిల్ రూం అద్దెకి తీసుకుని ఉన్నాను. ఇంటి ఓనరు రూంలో వంటాగింటా చెయ్యడానికి వీల్లేదు అని తేల్చిచెప్పెయ్యడం నాకు కలిసొచ్చింది. ఎందుకంటే నాకు వంట చెయ్యడం అస్సలు రాదు. ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. నేనెప్పుడూ హస్టల్లోనే ఉండి చదువుకుని, బుద్ధిగా మెస్సులో పెట్టే గడ్డినే మహాప్రసాదంగా తినే టైపు విద్యార్థిని! ఇప్పుడు చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చాక, “ఉద్యోగం పురుష లక్షణం, వంట నేర్చుకోవడం బ్యాచిలర్ లక్షణం, పెళ్ళయ్యాక భార్య మెచ్చే లక్షణం” అని డిసైడ్ అయ్యి చేతులు కాల్చుకోవాలనే ప్లాన్ చేశాను. కాని దైవనిర్ణయం వేరేలా ఉంది! సరే ఈ వంకతో రోజూ అడయార్‌లోని “సంగీత” రెస్టారెంటునే నా కిచెనుగా చేసుకుని తమిళ వంటకాలని హాయిగా భుజిస్తూ గడిపాను. ఈ రెస్టారెంటుకి పక్కనే అప్పట్లో ల్యాండ్‌మార్క్ బుక్ షాప్ ఉండేది. అప్పుడప్పుడూ నేను వెళుతూ ఉండేవాడిని.

ఇక్కడో విషయం చెప్పాలి. అమ్మాయిలకి బట్టల షాపింగ్ అంటే వచ్చే ఉత్సాహం నాకు పుస్తకాల షాప్‌కి వెళ్తే వస్తుంది. విండో షాపింగ్ చేసినట్టు ఏమీ కొనకుండా ఊరికే అలా పుస్తకాలు చూసి తిరగేస్తూ ఉంటే అదో ఆనందం. అయితే ల్యాండ్‌మార్కులో పుస్తకాలు, మ్యూజిక్ మాత్రమే కాక ఇతర వస్తువులు కూడా ఉంటాయి. అదే నా కొంప ముంచింది ఓ రోజు. పుస్తకాలు చూస్తూ ఉంటే కొన్ని మనీ పర్సులు కనిపించాయి (నేను మనీ పర్సుని “పర్స్” అనే పిలిచేవాడిని అప్పట్లో. మగవాళ్ళ పర్సుని వాలెట్ అంటారని పర్స్ అనకూడదని నాతో కొందరు వాదించారు! కానీ బ్రిటీష్ ఇంగ్లీషులో “పర్స్” పదం అబ్బాయిలకీ వాడొచ్చనే అనుకుంటున్నాను). నేను వాటిని పట్టించుకోకుండా పోతూంటే ఒక పర్సు నన్ను ఆకర్షించింది. సాధారణంగా పర్సులు అన్నీ బ్లాక్ లేదా బ్రౌన్ రంగులో ఉంటే ఆ పర్స్ మాత్రం లేత గులాబీ రంగులో ఉంది. “అరే భలే ఉందే!” అని నేను చేతులోకి తీసుకుని చూస్తే నాజూగ్గా, ఓ పువ్వుని స్పర్శించినట్టు, అమ్మాయి బుగ్గని నిమిరినట్టు ఉంది. ఓపెన్ చేసి చూస్తే సింపుల్ అండ్ నీట్ డిజైన్. నాకు చాలా నచ్చింది. రొటీన్ పర్సులకి భిన్నంగా ఇలా రూపొందించిన ఆ డిజైనర్ ని మెచ్చుకుని, ఖరీదు ఎంతా అని చూస్తే గుండాగింది. ఐదొందలు రూపాయిలో ఎంతో (ఎగ్జాక్ట్ కాస్టూ, పర్సు బ్రాండూ గుర్తు లేవు)! ఆ రోజుల్లో అది చాలా ఎక్కువే (ఈ రోజుల్లో కూడానేమో!). “ఓర్నాయనో, ఇంత కాస్ట్లీ పర్సులు కూడా ఉంటాయా!” అనుకుని తిరిగి పెట్టేశాను. నిజానికి నాకు కొత్త వాలెట్ అవసరం కూడా లేదు. కానీ మనసు పీకుతూ ఉంది కొనాలని. నేను పుస్తకాలు కాకుండా వేరే ఏ వస్తువులు కొనడానికి టెంప్ట్ అవ్వడం అనేది చాలా అరుదు. కానీ విధి వైపరీత్యం వల్ల ఆ రోజు ఆ పర్సు నా మనసుని దోచుకోవడంతో వెనక్కి వెళ్ళి మరీ పర్సుని తీసుకున్నాను. కౌంటర్‌లో డబ్బులు ఇస్తున్నప్పుడు క్యాషియర్ నాకేసి చూసి ఓ చిరునవ్వు నవ్వాడు. నేను నా గర్ల్ ఫ్రెండుకి గిఫ్ట్ ఇస్తున్నానని అనుకుని ఉంటాడు. చిత్రమేమిటంటే నాకు మాత్రం అది అమ్మాయిల పర్సని తట్టనే లేదు వాడి నవ్వు గమనించినా కూడా!

రూంకి వచ్చిన వెంటనే క్యాష్ అంతా కొత్త పర్సులోకి మార్చి, పాత పర్సుని డస్ట్ బిన్‌లో గిరాటేశాను. చిన్నపిల్లాడికి ఐస్‌క్రీం కొనిచ్చినట్టు సంబరపడి ఓ రెండు మూడు సార్లు పర్సుని చూసుకుని ఆ రాత్రి పడుకున్నాను. పక్క రోజు హోటల్‌లో టిఫిన్ చేసి బిల్ పే చేస్తున్నప్పుడు ఒకింత గర్వంగా నా పర్సుని బైటకి తీసి, షో చేస్తూ సర్వర్‌కి డబ్బులు తీసి ఇచ్చాను. నాకు “తమిళ్ తెరియాదు” అన్న మాట తప్ప తమిళం ముక్క తెలియకపోయినా, రోజూ అదే హోటల్‌లో అదే పొంగల్ సాంబారు + ఫిల్టర్ కాఫీని ఆర్డర్ చేస్తూ ఉండడంతో ఆ సర్వర్ నాకు స్నేహితుడైపోయాడు. నన్ను చూసి చిరునవ్వు నవ్వడం, నేను ఆర్డర్ చెయ్యకుండానే టిఫిన్ తెచ్చెయ్యడం చేస్తూ ఉండేవాడు. వాడు నన్నూ, నా పర్సు సెలక్షన్‌నీ మెచ్చుకోలుగా చూస్తాడని ఆశిస్తూ వాడి మొహం కేసి చూస్తే ఆనందం బదులు ఆందోళన కనిపించింది. “ఇదేంటి వీడిలా తేడాగా చూశాడు” అని ఆలోచించాను. తెలివైన వాడిని కాబట్టి నాకు వెంటనే వెలిగింది! తేడా పర్సులో ఉందని, అది అమ్మాయిల పర్సని! నిజానికి నాకు కొనేటప్పుడే ఏ మూలో సందేహం వచ్చింది, కానీ అమ్మాయిలు అచ్చం అబ్బాయిలు వాడే వాలెట్లు కూడా వాడతారని నేను ఊహించలేదు. వెంటనే నాకు అమ్మాయిలపై కోపం వచ్చింది – “మా మగవాళ్ళ ఫేంటులూ, షర్టులూ, క్రాఫులూ అన్నీ కాపీ కొట్టారు. మీ అందంతో మా హృదయాలు కబ్జా చేశారు. మీ చాకచక్యంతో మా పర్సులోని డబ్బులని ఖాళీ చేశారు. ఆఖరికి మా పర్సుని కూడా కాపీ చేస్తారా! ఎంత దారుణం!” నిజానికి నాకు కోపం కన్నా బాధ ఎక్కువ వచ్చింది. అంత మనసుపడి కొనుక్కున్న పర్సుని వదులుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే నాకు ఓ సత్యం స్ఫురించింది. ఈ వాలెట్ అన్నది జేబులో ఉంటుంది కాబట్టి ఎవడికీ కనిపించదు, డబ్బులు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఒక వేళ ఎవరైనా చూసి నవ్వుకున్నా, ఏమైనా అనుకున్నా, నాకు చెన్నైలో ఎవరూ తెలీదు కాబట్టి, తమిళ్ రాదు కాబట్టి జరిగే నష్టం ఏమీ లేదు. కాబట్టి పర్సుని భద్రంగా నా జేబులోనే దాచుకోవాలని తీర్మానించాను.

3

చెన్నైలో ఉన్నంత కాలం పెద్ద ప్రోబ్లం రాలేదు కానీ, ఓ ఆర్నెల్ల తర్వాత నేను హైదరాబాద్ కి షిప్ట్ అయ్యాను. అక్కడ మా బావ ఒకడు గచ్చిబౌలీ లోని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ ఉంటే వాడితో కలిసి రూంలోకి దిగాను. వాడు అంతకముందు హాస్టల్‌లో ఉండేవాడు. సరే మేమిద్దరం కొన్ని సామాన్లూ, స్టవ్ అవీ కొనుక్కుని వంటలు చేసుకోవడం మొదలుపెట్టాం. నేను నాకొచ్చిన రీతిలో వంటల ఎక్స్పెరిమెంట్లు చేశాను ఒకట్రెండు సార్లు. వాడు ఏమనలేక తిన్నాడు కానీ, ఓ రోజు సడన్‌గా, “రేపటి నుంచి కూరల కటింగ్ నువ్వు చెయ్యి, వంట నేను చేస్తాను” అన్నాడు! వాడికి వంట చాలా బాగానే కుదిరేది. సరే చేయి తిరిగిన వాడు ఉండగా గరిట పట్టనేల అని నేనూ కూరలు తరగడంతో సరిపెట్టుకున్నాను. ఇలా ఓ నెల గడించింది. నా పింకు పర్సుని మాత్రం వాడికి కనబడకుండా జాగ్రత్తపడ్డాను. వాడసలే లౌకిక విషయాల్లో నాకన్నా సిద్ధహస్తుడు, అమ్మాయిల వ్యవహారాల్లో నిష్ణాతుడు. చూస్తే ఇట్టే పసిగట్టేస్తాడు. కానీ సాంబారు ఘుమఘుమలని కిచన్లో దాచలేనట్లు, నా రహస్యం వాడి కంట పడనే పడింది.

“ఒరేయ్! లేడీస్ పర్స్ వాడుతున్నావా? అర్జెంటుగా దాన్ని తీసి పడేసెయ్. నా ఫ్రెండ్స్ ఎవరైనా చూసారంటే, నీ సంగతేమో కానీ నా పరువు పోతుంది” అన్నాడు కూల్‌గా

“ఇది అమ్మాయిల పర్సు కాదు, అబ్బాయిలదే. రంగు మార్చారంతే” అని నేను బుకాయించబోయాను

“నీకు పరీక్షల్లో మార్కులూ, IITలో సీట్లు వచ్చాయి కానీ, తెలియాల్సినవి తెలియలేదు! కొంచెం అమ్మాయిలతో ఫ్రెండ్‌షిప్ ఉండుంటే అమ్మాయిలు ఏమి వాడతారో తెలిసి ఉండేది. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న వాడిని, స్ట్రైటుగా చెబుతున్నాను, అది 100% అమ్మాయిల పర్సే!” అన్నాడు.

నాకిక ఒప్పుకోక తప్పలేదు. “సరే! కానీ ఇంత కాస్ట్లీ పర్సుని, అదీ ముద్దొస్తున్న పర్సుని, పడెయ్యలేం కదా! కొన్ని రోజులు ఉంచుకున్నాక ఆలోచిస్తాను” అన్నాను

“నీ ఖర్మ! ఏదో ఒకటి ఏడు. కానీ నేను పక్కన ఉన్నప్పుడు ఆ పర్సుని బైటకి తియ్యొద్దు ప్లీజ్!” అని వెళ్ళిపోయాడు

4

ఇలా నా బావగాడి కళ్ళల్లో పడకుండా నా పర్సుని దాస్తూ రోజులు నెట్టుకొస్తున్నాను. ఓ రోజు నా బీటెక్ మిత్రుడు ఒకడు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తే కొందరు ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అని లంచ్‌కి కలిసాం. తిండీ కబుర్లూ అన్నీ అయ్యాక, బిల్ పే చెయ్యాల్సిన సమయం వచ్చింది.

“ఇది నా పార్టీ రా! నేనే బిల్ పే చేసేస్తాను!” అన్నాడు నా అమెరికా మిత్రుడు, మొహమాటం కొద్దీ.

“అలా కుదరదు. నిన్ను కలిసే వంకతో ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం. బిల్ కూడా పంచుకుందాం. అందరూ పర్సులు తియ్యండి!” అన్నాడింకొక మిత్రుడు నాకు కొంచెం కంగారు కలిగేలా. నేను ఎలాగో అలా ఎవరికీ కనబడకుండా టేబుల్ కింద పర్సుని బైటకి తీసి డబ్బులు ఇచ్చి గండం నుంచి గట్టెక్కాను.

చివర్లో ఆ మిత్రుడికి వీడ్కోలు చెప్దామని వెళ్ళాను. మేమిద్దరమే ఉన్నాం. వాడు నాతో –

“థాంక్స్ ఫణీ! చాలా రోజులకి కలిశాం. వెరీ హ్యాపీ. ఒక విషయం చెప్పనా? అమ్మాయిలు సిగ్గుపడితే గులాబి రంగు బావుంటుంది, కానీ అబ్బాయిల పర్సుకి ఆ రంగు బావుండదు! లక్కీగా నువ్వు అమెరికాలో లేవు. అక్కడే కనుక నువ్విలాంటి పర్సేసుకుని తిరిగితే నీకు పేర్లు పేట్టేస్తారు! Please throw away that purse!” అని చెప్పి నిష్క్రమించాడు.

5

ప్రేమ పిచ్చిదన్నారు పెద్దలు. ఇలా ఎన్ని అవమానాలు జరిగినా నాకు పర్సుపై మమకారం చావలేదు. ఇంకా వాడుతూనే ఉన్నాను, నా జాగ్రత్తలు నేను తీసుకుంటూ. ఐతే అసలైన అవమానం జరగనే జరిగింది. మా కంపెనీలో ఇద్దరు అమ్మాయిలతో నాకు పరిచయం ఉండేది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఓ రోజు లంచ్ అయ్యక, మా బిల్డింగ్ కింద ఉన్న ATM కి వాకింగ్‌లా వెళ్ళాం. ఇద్దరిలో ఒక అమ్మాయి డబ్బులు విత్‌డ్రా చెయ్యాలి. తన కార్డు పనిచెయ్యలేదు.

“మెషీన్‌లో ప్రోబ్లం ఉందనుకుంటా, లేక నా కార్డులోనో! మీ కార్డు ఒక సారి పెట్టి చూస్తారా?” అని అడిగింది.

అమ్మాయి అడిగిందన్న తొందరలో నేను అసలు విషయం మర్చిపోయి, ఆ పింకు పర్సుని బైటకి తీశాను! ఇద్దరు అమ్మాయిలూ స్టన్ అయ్యి, ఒక్కసారిగా పడీ పడీ నవ్వారు! ఎలాగోలా నవ్వుని కొంత ఆపుకుని,

“సారీ అండీ! నవ్వినందుకు. ఇది లేడీస్ పర్సని మీకు తెలుసా?” అన్నారు.

“అవునా! what an idiot I am!! కలర్ బావుందని ఈ మధ్యే ఓ మాల్‌లో కొన్నాను” అని అబద్ధం చెప్పాను, ఏమైనా పరువు మిగిలుంటే అది కాపాడుకోవడానికి.

“మీరు మరీ అమాయకులు ఫణి గారూ! ఏమీ తెలీదు. సారీ, ఏమనుకోకండి. ఇంకా నవ్వొస్తోంది, ఆపుకోలేకపోతున్నాం” అని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అమ్మాయిలు “నువ్వు అమాయకుడివి” అంటే అబ్బాయిలకి నచ్చుతుంది. దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. కానీ ఇలాంటి సందర్భంలో అలా అనడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని నాకనిపించింది. ఇక పర్సుని త్యాగం చెయ్యాల్సిన సమయం ఆసన్నమైందని నా బుద్ధి హెచ్చరించింది. నా పర్సు కేసి భారంగా చూస్తూ, “సారీ, మై డియర్! It is time to say good-bye!” అన్నాను.

6

షాప్‌కి వెళ్ళి కొత్త పర్సు కొనాలి అని నేను అనుకుంటూ ఉండగా, ఆ పక్క రోజు నా చెల్లి నాతో, “అన్నయ్యా! నీ బర్త్ డే వస్తోంది కదా! నీకు గిఫ్ట్‌గా వాలెట్ ఇద్దామని అనుకుంటున్నాను. నీకు ఓకేనా?” అని అడిగింది.

చెల్లెళ్ళు, గిఫ్టులు ఇచ్చే చెల్లెళ్ళు, అదీ పర్సు గిఫ్ట్ ఇచ్చే చెల్లెళ్ళు దొరకడం అన్నల అదృష్టం అని మనసులో మురిసిపోతూ, “ఎందుకమ్మా గిఫ్టులు! నేను కొనుక్కుంటానులే” అన్నాను మొహమాటానికి.

“లేదు! నేనే ఇస్తాను. మళ్ళీ నేను రాఖీ కట్టినప్పుడు నువ్వు ఎలాగూ గిఫ్ట్ ఇవ్వాలిగా!” అంది చిరునవ్వుతో, నా తెలివైన చెల్లెలు.

“సరే! నీ ఇష్టం. బట్ బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ మాత్రమే కొను” అన్నాను

“అదేంటన్నయ్యా, అలా అన్నావ్! జెంట్స్ పర్స్ అంటే ఆ రెండు కలర్సే కదా ఉంటాయి?” అని అడిగింది.

“అవును నిజమే. జస్ట్ కంఫర్మ్ చేసుకోవడానికి అడిగాను అంతే!” అన్నాను పక్కకి తప్పుకుంటూ!

అలా ఆ పింకు పర్సుతో నా ప్రేమ కథ ముగిసింది. ఆ పర్సు తప్పు ఏమీ లేకపోయినా, నా మనసు ఒప్పుకోకపోయినా, జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రంగుల పేర్లతో మనిషినీ మనిషినీ, మనసునీ మనసునీ విడదీసే ఈ లోకం పోకడ మారినప్పుడే ఇలాంటి అన్యాయాలు నశించేది! ఈ వర్ణ తీవ్రవాదాన్ని అందరూ ఖండించాలి! మార్పు రావాలి. అప్పటి వరకూ, నా బోటి వాళ్ళు, “జీవితమనే హరివిల్లులో ఎన్నో రంగులుంటాయి. కానీ అన్ని రంగులూ అందరివీ కావు!” అని సరిపెట్టుకోవాల్సిందే! తప్పదు!

Advertisements

11 thoughts on “అనగనగా ఓ పింకు పర్సు కథ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s