చీకటి మరకల ఉదయం!

1

కుక్కర్ మూడో కూత వేసింది! అప్పటికే టిఫిన్ చెయ్యడం పూర్తి చేసి, ఆఫీసుకి వెళ్ళే శ్రీవారికీ, స్కూలుకి వెళ్ళే కూతురుకీ ఆ రోజు వేసుకోవాల్సిన బట్టలు తీసిపెడుతున్న సుభద్ర వెంటనే బెడ్రూంలోంచి వంటింట్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. ఏ పనిలో ఉన్నా చెవిని కుక్కర్ కూతలపై వేసి లెక్కతప్పకుండా మూడో కూత తరువాత ఠక్కున కట్టేసే ప్రజ్ఞ ఆమె సొంతం! కూతురూ, భర్తా హడావిడిగా రెడీ అయ్యే లోపు ఆమె వేడి వేడి టిఫిన్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టి, లంచ్ బాక్సులు కూడా కట్టి ఉంచింది. ఏ రోజూ టైముకి రెడీ అవ్వని భర్తనీ, ఆ లక్షణమే పుణికిపుచ్చుకుని పుట్టిన పదేళ్ళ కూతురునీ చూసి ఆమె రోజూలానే ఓ చిరునవ్వు నవ్వుకుంది! భర్తనీ, కూతురునీ సాగనంపాక ఆమె చిక్కటి కాఫీ పెట్టుకుని వరండాలోకి వచ్చి, కుర్చీలో కూర్చుని, తాను మురిపెంగా కుండీల్లో పెంచుకుంటున్న పూలమొక్కల్ని చూస్తూ వేడి కాఫీని ఆస్వాదిస్తోంది. ఇలా రోజూ తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని రిలాక్స్ అవ్వడం ఆమెకి అలవాటు.

అది పూణే నగరంలో మూడంతస్తుల ఇల్లు. కింద ఇంటి ఓనర్లూ, రెండో అంతస్తులో అద్దెకి సుభద్రా వాళ్ళూ ఉంటున్నారు. ఇల్లు పాతదే కానీ, ఇంటి చుట్టూ పచ్చదం, రెండో అంతస్తులో పెద్ద వరండా ఉండడంతో ముచ్చటపడి ఈ ఇల్లే అద్దెకి తీసుకోమంది, భర్తకి ఇంకో కొత్త అపార్ట్‌మెంటు నచ్చినా.  వరండాలో ఓ మూలకి ఉన్న మెట్లెక్కి వెళితే మూడో అంతస్తులో ఒక చిన్న సింగిల్ రూం ఉంటుంది, మిగతా అంతా ఖాళీ జాగా.  ఓ నెల క్రితం వరకూ ఓ తమిళ అమ్మాయి ఉండేది అక్కడ. సుభద్ర తరచూ రాత్రివేళ మేడ పైకి వెళ్ళి వెన్నెలని ఆస్వాదిస్తూ ఆ అమ్మాయితో కబుర్లు చెప్పేది. ఆ అమ్మాయి ఖాళీ చేశాక ఎవరో కుర్రాడు వచ్చాడు.

కాఫీ తాగుతూ పూలమొక్కల కేసి చూస్తున్న సుభద్రకి మేడ మెట్ల దగ్గరగా ఉన్న పూలకుండీల మధ్య ఓ మడత పెట్టిన కాయితం కనిపించింది. తీసుకుని చదివితే ఏదో కవిత –

నీకు పడ్డ మూడు ముళ్ళు
మన ప్రేమకి పడ్డ శాశ్వత సంకెళ్ళు
నీ పెళ్ళిమంటపాన ఆ అగ్నిహోత్రం
చితిమంటలపాలైన మన ప్రేమకి సాక్ష్యం
నీపై వాలే అక్షింతలు
మన ప్రేమసమాధిపై రాలే పూలు
చెలీ తెలుసుకో
నీ కళ్యాణ వైభవం
మన కన్నీటి తోరణం
ఆ మంగళ వాద్యం
మన గుండెల ఆర్తనాదం

ప్రేమ వైఫల్యపు బాధ నిండిన ఈ కవిత కొత్తగా వచ్చిన కుర్రాడు రాసిందే అయ్యి ఉండాలి అనుకుంది సుభద్ర. అతను తెలుగు వాడే అన్నమాట! కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలానే ఉంటాడు. ఉదయం రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళడం చాలా సార్లు చూసింది కానీ ఎప్పుడూ పలకరించలేదు. అతని వాలకం ఏదో తేడాగా అనిపించేది. ఓ నవ్వూ, ప్రశాంతత లేకుండా ఎప్పుడూ నిర్లిప్తంగా కనిపిస్తాడు. ఈ నెలరోజుల్లో ఒక ఫ్రెండు రావడం కానీ, ఓ పార్టీ చేసుకోవడం కానీ చూడలేదు. ఎవరితో కలవకుండా, మౌనంగా తనపని తాను చేసుకునే రకం కాబోలు! ఆ కవిత చదివాక అతని తీరుకి కారణాన్ని కొంత ఊహించగలిగింది. అతన్ని కలిసి మాట్లాడాలనిపించింది ఒక్కసారిగా సుభద్రకి. ఆఫీసుకి లేటుగా వెళతాడు కాబట్టి రూంలోనే ఉండి ఉంటాడు.

2

ఉదయ్‌కి మనసంతా చికాగ్గా ఉంది. అతనిలో నిత్యం రగిలే బాధకి సంకేతంగా నిప్పుల కొలిమిలాంటి సూర్యుడు ఆ రోజూ ఉదయించాడు. అతని భారమైన జీవితానికి ఇంకో రోజు జతకలిసింది. బతకడానికి డబ్బు కావాలి కాబట్టి ఓ ఉద్యోగం, ఆ ఉద్యోగానికి వెళ్ళడం కోసం ఓ మామూలు మనిషిలా కనిపించాలి కాబట్టి అలా ఉంటాడు కానీ తను ప్రాణంగా ప్రేమించిన వర్ష దూరమయ్యాక అతను మామూలుగా లేడు, ఎప్పటికీ కాలేడు. నిన్న వర్ష పెళ్ళిరోజు, అతని గుండె పగిలిన రోజు! సంవత్సరం క్రితం మనసుకైన ఆ శాశ్వత గాయానికి రోదనగా అతను రాసుకున్న కవిత ఒకసారి మళ్ళీ బయటకి తీసి చదువుకున్నాడు. కవిత అతనికి అక్షరం అక్షరం గుర్తుంది కానీ ఆ పాత కాయితం ఓ సజీవ స్మృతి. అందుకే ఆ కవితను బైటకి తీసి, కాయితాన్ని తాకి చూసి, మళ్ళీ జ్ఞాపకాల్లో మునిగాడు. అతనికి కన్నీళ్ళు రాలేదు, ఆ స్థితి ఎప్పుడో దాటిపోయాడు. చెమ్మంటూ ఉండడానికి ముందు మనిషై ఉండాలి, అతనిలో మనిషితనం ఎప్పుడో చచ్చిపోయింది. కాదు ఈ సంఘమే చంపేసింది అంటాడు అతను. కవిత చదివాక జేబులో పెట్టుకుని ఆఫీసుకెళ్ళాడు. రోజంతా కుదిరినప్పుడల్లా తీసి చదువుకుంటూ ఉన్నాడు. కానీ రాత్రి రూంకి వచ్చి చూసుకుంటే లేదు, ఎంత వెతికినా కనిపించలేదు.

బాధపడుతూ, తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ రాత్రంతా గడిపాడు. తనకి ప్రియమైనవి ఎందుకు దూరమైపోతాయో అతనికి అర్థం కాలేదు. తీవ్రమైన నిరాశ అతన్ని ఆవహించింది. జీవితం నరకమే, మళ్ళీ రోజుకో కొత్తశిక్షా? ఇలా చస్తూ  బ్రతికే కంటే చావడమే మేలని చాలా సార్లు అనిపించింది. కానీ ధైర్యం చాలలేదు. ఆ ధైర్యమే ఉండుంటే పెద్దలనీ సంఘాన్నీ ఎదిరించి వర్షని దక్కించుకునే వాడేమో.

అతను ఈ ఆలోచనల్లో ఉండగా ఎవరో తలుపు తట్టారు. తన రూంకి ఎవరొచ్చుంటారా అని ఆశ్చర్యపడుతూ తలుపు తీశాడు. ఎదురుగా కింద పోర్షన్‌లో ఉండే ఆవిడ కనిపించింది. రెండు మూడు సార్లు చూశాడు ఆమెని. తన జీవితాన్ని అపహాస్యం చేస్తూ విరబూసినట్టుండే పూలమొక్కల్ని పెంచేది ఆవిడే కదా! “ఎందుకొచ్చారు” అన్నట్టుగా చూశాడు.

“మేము కిందే ఉంటాం. నా పేరు సుభద్ర. ఊరికే పలకరిద్దామని వచ్చాను, నిన్ను చూస్తే మా తమ్ముడిలా అనిపించావ్…”

ఈ పూసుకున్న నవ్వులూ, పలకరింతల ఫార్మాలిటీస్ అతన్ని మభ్యపెట్టలేవు. ప్రస్తుతం ఎవరితోను మాట్లాడే మూడ్ కూడా లేదు.

“మీరు తమ్ముడూ అని వరస కలిపారని, నేను మిమ్మల్ని అక్కా అని పిలవలేను. నాకు వరసల మీదే కాదు, మనుషుల మీద కూడా నమ్మకం లేదు! క్షమించండి!”  – సాధ్యమైనంత మర్యాదగా చెప్పే ప్రయత్నం చేశాడు.

సుభద్ర అతని ముక్కుసూటి సమాధానానికి కొంత ఆశ్చర్య పడుతూనే ఏ మాత్రం తొణక్కుండా –

“నాకూ మనుషుల మీద నమ్మకం లేదు! కానీ నేను మనిషినన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే నిను పలకరిద్దామని వచ్చాను. ఇరుగుపొరుగు వాళ్ళం కదా, చేదోడువాదోడుగా ఉండడానికి నమ్మకాలూ అవీ అవసరమా?”

ఓ మామూలు గృహిణిలా కనిపించే సుభద్ర నుంచి అలాంటి సమాధానం ఊహించలేదు అతను. అతని అహం కొంచెం దెబ్బతింది. అది తెలియనివ్వకుండా –

“అవసరాల మీద ఏర్పడే సంబంధాలు నాకు అవసరం లేదు. మీ ఆప్యాయతకు థాంక్స్!” అన్నాడు.

సుభద్ర చిరునవ్వు నవ్వుతూ  –

“చాలా చదువుకున్న వాడివిలా ఉన్నావయ్యా! ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నాకవన్నీ తెలియవు. కానీ తెలిసిన ఒక విషయం ఏమిటంటే కోరుకున్నది పారేసుకోకూడదు, పారేసుకున్నదాన్ని కోరుకోకూడదు”

అతను అర్థం కానట్టు చూశాడు. సుభద్ర అంతవరకూ అతనికి కనిపించకుండా చేతిలో మడతపెట్టి పట్టుకున్న కవిత ఉన్న కాయితాన్ని తీసి ఇస్తూ –

“వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే మొహమాటపడకు. నన్ను అక్కా అని పిలవక్కరలేదులే!” అని కిందకి దిగివెళ్ళిపోయింది.

అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తేరుకుని ఆనందంగా కాయితం కేసి చూసుకున్నాడు. ఎప్పటిలానే వర్ష స్మృతుల్లో గడిపాడు మిగిలిన రోజంతా.

3

ఈ సంఘటన జరిగాక, ఆ కుర్రాడి కథ ఏమయ్యుంటుందా అని సుభద్ర చాలా సార్లు ఆలోచించింది. కొద్ది రోజుల తరువాత ఓ ఉదయం సమాధానం సుభద్ర ఇంటి తలపు తట్టింది. ఆ రోజు సుభద్ర ఇంటి పనుల్లో ఉండగా మేడపై నుంచి ఏదో వాగ్వివాదం వినిపించింది. ఎవరొచ్చారో ఏమయ్యుంటుందో అని సుభద్ర అనుకుంటూ ఉండగానే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఎవరో పెద్దాయన, అరవై ఏళ్ళ వయసుంటుందేమో. నీరసంగా, ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టు భారంగా ఉన్నాడు.

“అమ్మా! కొంచెం మంచినీళ్ళు ఇస్తావా?”

“అయ్యో! తప్పకుండా! లోపలికి రండి” అంటూ సుభద్ర ఆహ్వానించింది.

మంచినీళ్ళు తాగి ఆయన కొద్ది సేపు ఏమీ మాట్లాడలేదు. సుభద్రా ఆయన్ని కదపలేదు. ఎదుట మనిషి మనస్థితిని గుర్తించి మసలడం ఆమెకి ఉన్న సుగుణాల్లో ఒకటి. కొద్దిసేపటికి కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఓ నిట్టూర్పు విడిచి గొంతువిప్పాడాయన –

“చాలా థాంక్సమ్మా! మీ ఇంటి తలుపు మీద తెలుగు అక్షరాలు కనిపించి మీరు తెలుగువాళ్ళే అయ్యుంటారనిపించింది. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. బాగా అలిసిపోయాను. కాస్త సేదతీరాలనిపించి మీ తలుపు తట్టాను. ఏమీ అనుకోకు. వెళ్ళొస్తానమ్మా!”

“పెద్దవారు మీరు అంతలా చెప్పాలా? మనుషులమన్నాక గ్లాసెడు మంచినీళ్ళూ, కాసింత కన్నీళ్ళూ పంచుకోవడం కూడా పెద్ద సాయమేనా? కాస్త నడుం వాల్చి భోజనం చేసి వెళ్ళండి”

సుభద్ర ఆదరణకి ఆయన కరిగిపోతూ  –

“లేదమ్మా నేను వెళ్ళాలి. నీది మంచి మనసు. పరిచయం లేకపోయినా ఆత్మీయురాల్లా ఆదరిస్తున్నావు. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు, నీతో నా బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. మీ మేడపైన ఉన్నవాడు నా కొడుకమ్మా! ఏకైక సంతానం. పేరు ఉదయ్. మాది మునగపాక అని వైజాగ్ దగ్గరలో ఉన్న చిన్న ఊరు. మాపైన కోపంతో సంవత్సరం క్రితం నుంచీ దూరమయ్యాడు. ఎంతో కష్టపడి ప్రయత్నిస్తే ఈ పూణే నగరంలో వాడు ఉండొచ్చని తెలిసి వచ్చాను. ఈ ఇంటి అడ్రస్సు పట్టుకోవడానికి రెండు రోజులు పట్టింది.

మేము కలిగిన వాళ్ళం, మా ఊర్లో మాకు చాలా పరపతి ఉంది. వాడికెప్పుడూ లోటు చెయ్యలేదు. అయితే చిన్నప్పటి నుంచీ వాడి లోకంలో వాడు ఉండేవాడు. అదో రకం మనిషి, ఎవరితోనూ కలిసేవాడు కాదు, ఒక్క స్నేహితుడూ లేడు. ఇంట్లోనూ మాటలు తక్కువ. ఎప్పుడూ వాడి రూములో వాడు ఏవో పుస్తకాలు చదువుకుంటూ, ఏదో రాసుకుంటూ ఉండేవాడు. పోనిలే అందరి కుర్రాళ్ళలాగ అల్లరిచిల్లరగా తిరక్కుండా ఇంటిపట్టునే బుద్ధిగా ఉంటున్నాడు అనుకున్నాను. అనకాపల్లిలో ఇంటర్మీడియట్ వరకూ చదివాక ఇంజనీరింగ్ చదువుతానని బిట్స్ పిలానీకి వెళ్ళాడు. అది చాలా మంచి కాలేజీ అట! నాకు ఈ చదువుల గురించీ కాలేజీల గురించీ పెద్ద తెలీదు. నాకు తెలిసిందల్లా మా చిన్న ఊరు, అక్కడి మా కులగౌరవం, ధనగర్వం ఇవే! పెద్దరికం పేరుతో మా పాతతరం వెంటతెచ్చుకున్న బరువులు ఇవేగా! మా ఊరునుంచి వాడు దూరంగా వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అన్నాను.

ఆ కాలేజీలో చేరాక వాడిలో మార్పు కనిపించసాగింది. సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు కాస్త నవ్వుతూ కబుర్లు చెప్పేవాడు మాతో. వాడు మామూలు మనిషౌతున్నందుకు మేము ఆనందించాం, ముఖ్యంగా వాడి అమ్మ. దానికి వాడు ఎలా బతుకుతాడో అని ఎప్పుడూ బెంగ ఉండేది.  నాలుగేళ్ళ తరువాత చదివి పూర్తయ్యి మంచి ఉద్యోగం వచ్చింది వాడికి బెంగళూరులో. ఇంకేముంది త్వరలో గొప్ప కట్నంతో మా కులానికి చెందిన అమ్మాయితో ఘనంగా పెళ్ళిచేసేద్దాం అనుకున్నా! కాని వాడొచ్చి ఎవరో అమ్మాయిని ప్రేమించాను అన్నాడో రోజు. ఆ అమ్మాయి మా కులం కాదు, వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులూ లేవు. దాంతో నేను పెళ్ళి కుదరదని ధిక్కరించా. అహంకారంతో ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి నానామాటలు అన్నా. వాళ్ళకీ ఈ ప్రేమ విషయం తెలీదు, వాళ్ళూ నాలా ఉడుకుతనం ఉన్న వాళ్ళే. నన్ను ఎదురు తిట్టి ఆ అమ్మాయికి ఎవరితోనో వెంటనే పెళ్ళిచేసి అమెరికా పంపించేశారు. నేను విషయం తెలిసి మీసం మెలేశాను!”

సుభద్రకి విషయం అర్థమైంది ఇప్పుడు. మొగ్గలా ముడుచుకున్న వాడు ప్రేమలో పువ్వులా వికసిస్తే ముల్లై లోకం గుచ్చింది. అదే పాత కథ, అదే వ్యథ.

“కానీ నా తెలివితక్కువ పనివల్ల వీడు మళ్ళీ తన చీకటి గుహలోకి వెళ్ళిపోతాడని, ఈసారి తల్లితండ్రులమైన మాక్కూడా ప్రవేశం ఉండదని ఊహించలేదు. అప్పటినుంచీ వాడు మా మొహం చూడలేదు,  కనీసం ఫోన్ చేసి పలకరించలేదు. బెంగళూరు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియలేదు. తన తప్పు లేకపోయినా నా భార్యకి నావల్ల శోకం మిగిలింది. కొడుకుపై బెంగపెట్టుకుని చిక్కిశల్యమైంది. మా ఇంటిలో ఆనందం మాయమైంది”

ఒక భారమైన నిశ్శబ్దం గదంతా పరుచుకుంది. మాటల్లో చెప్పలేని విషయాలెన్నో మౌనం విశదీకరిస్తోంది. మళ్ళీ ఆయనే మాట్లాడాడు –

“ఇన్నాళ్ళకి వాడి ఆచూకీ దొరికి వచ్చానమ్మా. కాని వాడు నన్ను చూసి రగిలిన అగ్నిపర్వతమే అయ్యాడు. కొన్ని మంటలు చల్లారేవి కావేమో! నా తప్పు ఒప్పుకుని నన్ను క్షమించమన్నాను. అమ్మ కోసమైనా ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాను. కానీ వాడు ఏమాత్రం కరగలేదు. తనకెవరూ లేరన్నాడు. నన్ను పొమ్మన్నాడు. వాడిక ఎప్పటికీ ఇంటికి రాడేమో అని భయమేస్తోందమ్మా.”

“మీరు అధైర్య పడకండి. ఏదో కోపంలో అలా అన్నాడు కానీ, మిమ్మల్ని చూశాక ఇల్లూ అమ్మా గుర్తురాకుండా ఉంటాయా? మీ అబ్బాయి తప్పకుండా తిరిగివస్తాడు”

“నీ నోటిచలవ వల్లైనా అలా జరిగితే అదే చాలమ్మా! నీకు నా ఆశీస్సులు. ఉంటాను” అని ఆయన వెళ్ళిపోయాడు.

4

ఆయన వెళ్ళాక సుభద్ర ఏం చెయ్యాలా అన్న ఆలోచనలో పడింది. ఓ నిశ్చయానికి వచ్చి ఉదయ్ రూంకి వెళ్ళింది. ఈసారి తలుపులు తెరిచే ఉన్నాయి. రూంలో కళ్ళు మూసుకున్న ఏదో ఆలోచనలో ఉన్న ఉదయ్, కళ్ళు తెరిచి తీక్షణంగా సుభద్రకేసి చూశాడు.

“మళ్ళీ ఎందుకొచ్చారు? మా నాన్న నా గురించి చెప్పిన కథంతా విని నాకు నీతిబోధ చెయ్యడానికా?”

“లేదు. సానుభూతి తెలపడానికి వచ్చాను. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైపోతే కలిగే బాధ నేను అర్థం చేసుకోగలను”

“దూరం కాలేదండి! దూరం చేశారు. ద్రోహం చేశారు. నా బాధ మీకు తెలుసు అనడం తేలికే, కానీ నా బాధ మీరు పడగలరా? ఆత్మీయమైన పలకరింపులూ, పులుముకున్న నవ్వులూ వెనుక దాగున్న మనుషుల అసలు స్వరూపాలు మీకు తెలుసా? కులగౌరవాలూ, ధనమదాలూ, సంఘమర్యాదలూ తప్ప మనిషిని మనిషిగా చూడలేని సమాజం మీకు తెలుసా? అలాంటి మా ఊరి వాతావరణంలో ఇమడలేక, అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా ఏకాకిగా పెరిగిన నాకు స్నేహమాధుర్యాన్ని పంచి, జీవితాన్ని నేర్పి, సరికొత్త ప్రాణాన్ని పోసిన నా “వర్ష”ని నాకు కాకుండా చేశారు. మీకు తెలీదండీ, మీకు తెలీదు. అప్పుడే ప్రేమతో విరబూస్తున్న జంటపువ్వులని కర్కశంగా నలిపేసిన ఈ లోకపు కాఠిన్యం మీకు తెలీదు! జీవితంలో ఎప్పుడూ ఏడవని నేను వెక్కివెక్కి ఏడ్చిన రాత్రులు మీకు తెలీదు. నా వర్ష లేని ఒంటరితనంలో నేను పెట్టిన గావుకేక మీకు తెలీదు.

ఇవన్నీ తెలియని మీరు, మనిషినన్న నమ్మకం ఉండాలి, పారేసుకున్న దాన్ని కోరుకోకూడదు అంటూ డైలాగులు మాత్రం తేలిగ్గా చెప్పగలరు. ఎందుకుండాలండీ? నాకు మనుషులపైనే కాదు, నేను మనిషినన్న నమ్మకం కూడా లేదు. నేను జీవచ్చవంలా, ఓ రాయిలా బ్రతుకుతున్నాను. చచ్చే ధైర్యం లేక బ్రతుకుతున్నాను. నాలో మనిషిని చంపేసిన సంఘానికి నేను మాత్రం నవ్వుతో స్వాగతం పలకాలా? నేను మోయలేనంత శోకాన్ని శిక్షగా విధించిన లోకాన్ని నేను క్షమించేసి గుండెకి హత్తుకోవాలా? బాధా నేనే పడి, జాలీ నేనే పడి, మార్పూ నేనే చెందాలి కానీ ఈ సంఘం మాత్రం ఎప్పటిలాగే తన పాత పద్ధతుల్లో కొనసాగుతూ ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అండీ? పారేసుకున్నది జీవితం కన్నా గొప్పదైనప్పుడు, అది లేని నిస్సారమైన జీవితంలో బ్రతకడంకంటే అది ఉందనుకున్న భ్రమలోనో, లేదా దాన్ని కోల్పోయిన బాధలోనో బ్రతకడమే మంచిది. కాదంటారా?”

అతను ఆవేశంగా వర్షిస్తున్నాడు. అతని ఆవేశాన్ని చూసి సుభద్ర ఏమీ మాట్లాడలేకపోయింది. లోలోపలి బాధ ఉబికి వచ్చి అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, కానీ అతను ఏడుపు ఆపుకుంటున్నాడు. సుభద్ర అతని భుజాన్ని ఆప్యాయంగా నిమిరి మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. అతను రూం బయటకి వచ్చి ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయాడు.

5

ఓ రెండుగంటల తరువాత అతను తేరుకున్నాడు. ఆవిణ్ణి అనవసరంగా మాటలు అన్నానే అనుకున్నాడు! పాపం ఆవిడ తప్పేముంది? ఓదార్చడానికి వచ్చింది. అయినా వదిలెయ్యండని చెప్పినా ఎందుకు కలగజేసుకుంటుంది?  వద్దన్నా ఆప్యాయత చూపిస్తుంది. తాను లోకాన్ని పట్టించుకోవడం మానేస్తే లోకంలో ఎవ్వరూ తనని పట్టించుకున్న పాపాన పోలేదు, ఈవిడ తప్ప.

నాన్నకి తన ఆచూకి తెలిసిపోయింది కాబట్టి తను ఇక రూం వదిలి, ఊరు వదిలి, బహుశా ధైర్యంచేసి ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. ఈ రోజు మళ్ళీ ఆవేశం కట్టెలు తెంచుకుంది. ఈ ఆవేశం పూర్తిగా చల్లారేలోగానే తాను ఆత్మహత్య చేసుకోవాలి. అవును తప్పదు. వెళ్ళిపోవాలి. ఒంటరితనాన్ని వదిలి, జ్ఞాపకాలని వదిలి, పిరికితనాన్ని వదిలి. ఈ ఆవేశమనే నావపై ప్రయాణించి లోతు తెలియని అగాధంలోకి.  జీవితమనే నరకాన్ని వదిలి మరణమనే ప్రేయసి కౌగిలిలోకి.

వెళ్ళిపోయే ముందు ఆవిడని ఒకసారి కలిసి “సారీ” చెప్పాలి అనుకున్నాడు. కిందకి దిగి సుభద్ర ఇంటి తలుపు తట్టాడు.

“రావయ్యా! మొత్తానికి మేడ దిగొచ్చావన్న మాట” ఆశ్చర్యానందాలతో పలకరించింది సుభద్ర.

“నేను కూర్చోడానికి రాలేదు. మీతో ఓ మాట చెప్పి వెళ్ళిపోతాను”

“చెబుదువుగానులే! ముందు లోపలికి రా. నిలబెట్టి మాట్లాడితే ఏం మర్యాదయ్యా!”

సుభద్ర ఆహ్వానాన్ని కాదనలేక అయిష్టంగానే హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. పొందిగ్గా అమర్చిన ఇల్లు.

“కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా?”

“వద్దండీ. నేను వెళ్ళాలి. ఇందాకా ఆవేశపడి ఏవో మాటలన్నాను, క్షమించండి. మీకు నాపై ఈ అభిమానం ఎందుకో తెలియదు కానీ, మీ అభిమానాన్ని నేను స్వీకరించలేను. దయచేసి నన్ను పట్టించుకోవడం మానెయ్యండి! నేనెవరికీ చెందను, నాకెవరూ అక్కర్లేదు. నా దారిలో నేను దూరంగా ఎక్కడికో వెళిపోతాను, నాకే పిలుపులు వినిపించవు. మీరూ పిలవకండి. ప్లీజ్!”

ఆ మాటల్లో దాగున్న అర్థాలకి సుభద్ర మనసు కీడు శంకించింది.

“వెళిపోతాను అన్నవాణ్ణి ఆపలేనయ్యా. నీ ఇష్టం నీది. నిన్నింక ఇబ్బంది పెట్టను. చివరగా ఓ మాట చెప్పొచ్చా?”

“చెప్పండి”

“నువ్వు చాలా సున్నిత మనస్కుడివని నీ కవిత చదివినప్పుడే అర్థమైంది. సున్నితమైన మనసూ, స్పందించే గుండె లేనివాడు కవిత్వం రాయలేడు. నువ్వు ఒంటరివాడివి కూడా అని ఈ రోజే తెలిసింది. ఎవ్వరూ చొరబడని నీ మనసనే చీకటిగదిలోకి ఓ వెలుగురేఖ వచ్చింది. నువ్వు మేలుకుని తలుపు తెరిచేలోపు ఆ వెలుగుని లోకం మింగేసింది. నువ్వు లోకాన్ని ద్వేషిస్తూ చీకట్లోనే మిగిలిపోయావు. అసలు వెలుగన్నదే భ్రాంతన్నావు!  

ద్వేషం దహిస్తుందయ్యా. ద్వేషించే వాళ్ళనీ, లోకాన్నీ కూడా. దానివల్ల ఎవరికీ లాభం లేదు. నీకు తీవ్రమైన అన్యాయం జరిగింది నిజమే. దానివల్ల నీకు తీరని నష్టం బాధా కలిగాయి. సహజంగానే నీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని ద్వేషంగా మార్చుకోకు. మనసు పిచ్చిది, బాధొస్తే ఓ గోల పెట్టి ఊరుకుంటుంది. కానీ తెలివి చాలా టక్కరిది. అది దేన్నీ వదిలిపెట్టదు, బాధ కలిగించిన వాళ్ళని జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటుంది. దాని వలలో పడకు!

నేను నీలా బోలెడు పుస్తకాలు చదవలేదు. కానీ బోలెడు జీవితాన్ని చూశాను. కష్టాలూ, ఆనందాలూ, అనుబంధాలూ, స్వార్థాలూ, అపార్ధాలూ ఇవన్నీ జీవితాన్ని నిర్మించే ముడిసరుకులే. ఇలా అన్ని రకాల అనుభవాలతో, మనుషులతో నిండిన లోకాన్ని కాదని తమతమ ఊహాలోకాల్లో విహరిస్తూ, ఓ ముల్లు గుచ్చుకుంటే ఈ లోకంలోకి వచ్చి, “ఛీ! పాడు లోకం” అని ఓ మాట అనేసి మళ్ళీ తమ ఊహాలోకంలోకి జారుకునే వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకోలేరు. అనుభవించలేరు. కాలికి ఇసుక అంటకూడదు అనుకునేవాడు జీవితమనే సముద్రంలో స్నానం చెయ్యలేడు.

నీలో సంస్కారంతో కూడిన ఓ మంచి మనిషిని నేను చూస్తున్నాను. నీ గుండె గాయపడింది కానీ నువ్వింకా రాయివైపోలేదు అనుకుంటున్నాను. నీలో ఏ మూలో మిగిలిన మనసుని తట్టి చూడు. నీకు నువ్వే దట్టంగా పరుచుకున్న చీకటి తెరలు దాటిచూడు. ఆలోచనా సామ్రాజ్యాన్ని వదిలి మౌనసరస్సులో స్నానించు. అప్పుడు వినిపించే పిలుపు ఎటు పిలిస్తే అటే వెళ్ళు!”

సుభద్ర ఇంకేమి చెప్పడానికి లేదన్నట్టు చూసింది. అతను ఇంకేమీ మాట్లాడలేనన్నట్టు లేచి వెళ్ళిపోసాగాడు. అప్పుడు కనిపించింది అతనికి గోడకున్న ఆ ఫోటో. నవ్వులు చిందిస్తున్న ఓ యువకుడిది. దండేసి ఉంది. చూసి ఓ క్షణం ఆగాడు.   

సుభద్ర అతని భావం గ్రహిస్తూ –

“వాడు నా తమ్ముడు. నీ వయసే ఉంటుంది, మెడిసిన్ చదివేవాడు. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. వాడు నాకన్నీ చెప్పేవాడనే అనుకునే దాన్ని. కానీ కాదని తెలిసింది. ఆరు నెలల క్రితం సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు డల్‌గా కనిపించాడు. ఏమిట్రా అంటే ఏం లేదక్కా అన్నాడు. వాడు తిరిగి కాలేజీకి వెళ్ళిన కొన్ని రోజులకి సూసైడ్ చేసుకున్నాడని మాకు కబురొచ్చింది. వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాదందట. అమ్మానాన్నా ఇంకా తేరుకోలేదు. నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను – “జీవితం గొప్పదా, జీవితాన్ని కాదనుకునే పంతం గొప్పదా?” అని.

అతనికి ఏమనాలో తెలియలేదు.  “సారీ టు హియర్ దిస్” అని వెళ్ళిపోయాడు.

6

పక్కరోజు తెల్లవారుతూ ఉండగా సుభద్ర లేచి వాకిలి తలుపు తీసింది. తలుపు గడియకి మడిచిపెట్టిన ఓ కాయితం కనిపించింది. కీడు శంకిస్తూ తీసి చదవసాగింది –

అక్కా,

చాలా రోజుల తరువాత నిన్న నిండుగా ఏడ్చాను. అసలు ఏడుపు ఎందుకొచ్చిందో కూడా తెలీదు. ఆపలేకపోయాను, ఆపాలనిపించలేదు కూడా. కొన్నిసార్లు మనసుని శుభ్రపరచడానికి కన్నీటి స్నానం చెయ్యాలేమో! నువ్వన్నది నిజమే, నా గుండె లోతుల్లో ఆరని జ్వాలేదో ఉంది. నా ప్రతి ఆలోచనా ఆ జ్వాలని రగిలిస్తూనే ఉంది. ఈ కన్నీరు ఆ జ్వాలని ఆర్పిందో ఏమో, చాలానాళ్ళ తరువాత కొంత ప్రశాంతత దొరికింది.

నిన్న నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఇన్నాళ్ళూ బాధించిన ఈ లోకాన్ని ఓడిస్తూ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీ మాటలు నన్నాపాయి. నీ మాటలు కాదేమో, నీ మాటలు వెనుక ఉన్న ఏదో ఆత్మీయత. నీ కళ్ళలో కనిపించే అపారమైన కరుణ. మా అమ్మ గుర్తొచ్చింది. తన్నినా అక్కున చేర్చుకునే వాళ్ళు అమ్మ కాక ఎవరుంటారు! అందుకే మా ఊరు వెళ్తున్నాను, అమ్మ ఒళ్ళో తలవాల్చి మళ్ళీ కన్నీళ్ళు కార్చడానికి.

సొంత తమ్ముణ్ణి దక్కించుకోలేకపోయావు కానీ, ఈ తమ్ముణ్ణి కాపాడావు అక్కా! నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఊరినుంచి తిరిగి వచ్చాక మీ కాళ్ళపై పడి ప్రణమిల్లుతాను. క్షమిస్తావు కదూ?

నీ తమ్ముడు,
ఉదయ్

సుభద్ర కళ్ళలో ఆనందభాష్పాలు. గోడపైన తన తమ్ముడి ఫొటో కేసి చూసింది ఓ సారి. బయట అప్పుడే చీకట్లు కరిగిస్తూ సూర్యుడు ఉదయిస్తున్నాడు.

(తొలి ప్రచురణ సారంగలో)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s