మధులత

1

ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు…
వద్దులే ప్రాణము నీవు రానప్పుడు…
ఈ రాయబారాలు సాగే చలిలో!
ఈ హాయిభారాలు మోసే జతలో!!

చల్లని రాత్రివేళ ఫోన్ లోని FM రేడియో లోంచి వినిపిస్తున్న పాట గదంతా పరుచుకుంటోంది. ఆ గదిలోని మంచం మీద బోర్లా పడుకుని “స్వాతి” లో సరసమైన కథ చదువుతున్న ఆ అమ్మాయి “హాయిభారాలు” అన్న కవిప్రయోగానికి చిన్నగా నవ్వుకుంది. పాట ప్రభావమో, లేక చదువుతున్న కథ మహిమో ఏమో, ఒక కమ్మని ఊహ ఆమెని లాక్కెళ్ళిపోయింది.

అది పండు వెన్నెల రాత్రి. ఆకాశంలో చందమామ చిలిపిగా కన్నుకొడుతున్నాడు. పిల్లగాలి అల్లరి పెడుతోంది. తనూ, పక్కన తన ప్రియుడు – ఇద్దరే. మధ్యలో నేనెందుకంటూ మిగిలిన లోకమంతా తప్పుకుంది. హఠాత్తుగా ఆ ప్రియుడు ఆమె పెదాలందుకుని గట్టిగా ముద్దు పెట్టేసుకున్నాడు! అతనలా చేస్తాడని అస్సలు ఊహించలేదు ఆమె. “మహా దుడుకు సుమా” అనుకుంది సిగ్గులమొగ్గైపోతూ. ఆ సిగ్గులలోని సంకేతాలు తెలిసిన ప్రియుడు దగ్గరగా జరిగి “మొదలే కానీ అంతం లేని మన ఆటలో ఇప్పుడేం చేస్తానో చెప్పుకో చూద్దాం” అన్నాడు గుసగుసగా ఆమె చెవిలో. ఆమె చిన్నగా నవ్వి కళ్ళతో చందమామని చూపించింది. అప్పుడు గమనించాడతను, చందమామ కన్నార్పకుండా తమనే చూస్తున్నాడని! “ఎన్ని సార్లు తిట్టినా బుద్ధి మార్చుకోడీ చందమామ! ఈ సారి ఏదో ఒకటి చెయ్యాలి!” అని అతను అనుకుంటూ ఉండగానే చందమామ నవ్వుకుంటూ మబ్బుల వెనక్కి వెళ్ళిపోయాడు. విషయం తెలిసిన చుక్కలు కళ్ళు మూసుకున్నాయ్. అతను గర్వంగా ఆమెకేసి చూశాడు..

ఊహలోంచి వాస్తవంలోకి వచ్చిందా అమ్మాయి. తనకు వచ్చిన మధురమైన కలని తలుచుకుని కాస్త సిగ్గుపడింది. వెంటనే స్టడీ టేబుల్ దగ్గరకి వెళ్ళి చదువులో నిమగ్నమైపోయింది. ఇదే ఆమెలోని ప్రత్యేకత. చాలా మందిలాగ ఆమె ఊహల్లోనే తేలిపోతూ ఉండదు. కలలు కలలేనని ఆమెకి తెలుసు.

ఆ అమ్మాయి పేరు మధులత. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పాత కొత్తల కలయిక ఆమె! మోడ్రన్ అమ్మాయిలా ఉంటూనే మన ఘనమైన సంస్కృతీ సాంప్రదాయాలను ఆమె ప్రాణంగా ప్రేమిస్తుంది. జీన్స్ టీషర్ట్ వేసి కుర్రాళ్ళలో కలవరం పుట్టిస్తుంది. అలాగే బాపూ బొమ్మలా ముస్తాబై తెలుగుదనానికి నిర్వచనంలా, రమణీయ దృశ్యకావ్యంలానూ కనిపిస్తుంది. ఆమె ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలదు. అలాగే ఎన్నో తెలుగు పద్యాలను అవలీలగా వల్లెవేయగలదు. పాప్ మ్యూజిక్ వింటూ హుషారుగా స్టెప్స్ వేస్తూనే మన శాస్త్రీయ సంగీతం వింటూ మైమరిచిపోతుంది. కాళిదాసు కావ్యాల నుంచి జెఫ్రీ ఆర్చర్ నవలల దాకా ఆమెకు అన్నీ అంతో ఇంతో పరిచయం ఉన్నాయి.

మధులత అందగత్తె! మనసులోని ఉద్రేకాలని రెచ్చగొట్టే అందం కాదామెది. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆహ్లాదం ఆమెను చూసినప్పుడూ కలుగుతుంది. కాస్త అమాయకత్వం, కాస్త చిలిపితనం, కాస్త చలాకీతనం, కాస్త కొంటెతనం కలగలసిన వ్యక్తిత్వం ఆమెది. ఆమె రూపం కవులు వర్ణించినట్టు జాబిలిలా ఉంటుంది, అమవాస్య అంటని చిరునవ్వుల వెన్నెలను వెదజల్లుతూ ఉంటుంది. ఆమె నల్లని పొడుగాటి జడ మంత్రదండంలా కుర్రాళ్ళని మంత్రించి వేస్తుంది. ఎప్పుడైనా తలస్నానం చేసి ఆమె జుట్టును ముడివెయ్యకుండా అలా వదిలేస్తే ఆ కురుల కారడవిలో యువకుల మనసులు చిక్కుకుపోవలసిందే. ఆశల మెరుపులు ఆమె కళ్ళలో కనిపిస్తుంటాయి. ఆమె పెదాలు లేత గులాబి మొగ్గల్లా ఉంటాయి. నవ్వినప్పుడు పువ్వులా విచ్చుకుంటాయి. మిగిలిన ఒంపుసొంపుల సంగతి సరేసరి. ఇలా ఆమె అందాలన్నీ వేటికవే సాటి. తన అందంతో ప్రాణమున్నవారిని శిల్పాలుగానూ ఆమె మార్చగలదు, శిల్పాలకు ప్రాణాన్నీ పోయగలదు!

2

మధులత చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం. క్లాసులు మొదలయ్యే టైము కావడంతో వచ్చేవాళ్ళతో సందడిగా ఉంది. మధులత కనిపించిన వారిని పలకరిస్తూ క్లాసుకి వెళుతోంది. ఆమె అబ్బాయిలతో సహా అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది. తాను అబ్బాయిలకంటే తక్కువని మధులత ఏనాడూ అనుకోలేదు. ఆ మాటకొస్తే ఆమె వ్యక్తిత్వం ముందు అబ్బాయిలే దిగదుడుపని చెప్పాలి. ఏ విషయాన్నైనా ధైర్యంగా ప్రశ్నించడం, వివేకంగా ఆలోచించడం, జీవితంపై ఓ చక్కని అవగాహనతో మెలగడం ఆమె లక్షణాలు.

దార్లో రాజేష్ ని చూడగానే మధులత మొహం విప్పారింది. రాజేష్ వాళ్ళ క్లాస్ టాపర్. చూడడానికి చక్కగా కూడా ఉండడంతో అమ్మాయిలందరికీ అతనంటే సహజంగా అభిమానం. కానీ రాజేష్ కి అమ్మాయిలంటే సిగ్గో ఏమో, ఎక్కువగా కలిసిపోడు. ఒక్క మధులతతోనే అతనికి చనువు ఎక్కువ. మధులతకి కూడా రాజేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే రాజేష్ చాలా పట్టుదలగా చదువుతాడు. అయితే చదువే లోకంగా ఉండదు. వినోదానికీ ప్రాధాన్యతనిస్తాడు. అతను వినోదాన్ని, చదువునీ బేలెన్స్ చేస్తూ క్లాస్ టాపర్గా నిలవడం మధులతకి నచ్చిన విషయం. వాళ్ళు విడిగా కలిస్తే కబుర్లకి అంతే ఉండదు. రాజేష్‌కి కూడా మధులత అంటే ఇష్టం! మధులతని చూస్తే ఇష్టపడని, పరిచయమైతే ప్రేమలో పడని అబ్బాయిలు ఉండరు! అయితే మధులతతో ప్రేమలో పడ్డానేమో అన్న అనుమానంలోనే రాజేష్ ఉండిపోయాడు. రాజేష్ అంటే ఉన్న ఇష్టాన్ని దాటి ఈ మధ్యే కొత్తగా అంకురిస్తున్న ప్రేమని మధులతా మనసులోనే దాచుకుంది ఇంకా! ఇలా ప్రేమ వాళ్ళతో దోబూచులాడుతోంది!

“హాయ్ రాజేష్!” – ఎందుకో ఈ మధ్య రాజేష్ ని చూస్తేనే అదో ఆనందం! ఆ ఆనందాన్ని దాచిపెడుతూ మామూలుగా పలకరించింది.

“హాయ్ మధూ!” – దాచుకోలేని ఆనందంలో రాజేష్!

“ఏంటి నిద్రమొహంతో ఉన్నావ్? రాత్రి సరిగా నిద్రపోలేదా?”

“మా కాలేజీ కుర్రాళ్ళకి నిద్రపట్టనిస్తారా మీ అమ్మాయిలు?”

“సర్లే! బుక్స్ తో రొమాన్స్ చేసే నీలాంటి వాళ్ళకి ఇలాంటి మాటలు సూట్ అవ్వవు! సెమిష్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి రాత్రంతా చదువుతూ ఉండుంటావు!”

“చదువుతున్నాను కానీ ఏదీ బుర్రకి ఎక్కట్లేదు! ఎందుకంటావ్?”

“అబద్ధమంటాను! నువ్వే అలా అంటే ఏదో ఎబోవ్ ఏవరేజ్ అయిన నాలాంటి వాళ్ళు ఏమనాలి? ఈ వీకెండ్ కంబైండ్ స్టడీ చేద్దామా?”

తన మాటల్లో ఉన్న ఇంకో అర్థాన్ని మధులత పట్టించుకోలేదని కాస్త నిరాశపడుతూనే, “ష్యూర్! రఘూ, స్మితాలను కూడా పిలిచావా?” అన్నాడు రాజేష్.

రఘు – స్మిత వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళు నలుగురూ బెస్ట్ ఫ్రెండ్స్! రఘు – స్మిత ప్రేమ జంట కూడా! రెండు నెలల క్రితమే స్మితకి ప్రపోజ్ చేశాడు రఘు! వీళ్ళ నలుగురుకీ పరీక్షల ముందు కంబైండ్ స్టడీ చెయ్యడం అలవాటే!

“ఆ ప్రేమికులతో మనకెందుకులే! ఈ సారి మనిద్దరమే చదువుకుందాం, మా ఇంట్లో!”

మధులత అలా ఆహ్వానించేసరికి ఒక రకమైన ఎక్సైట్మెంట్ కలిగింది రాజేష్ కి! గతంలో వాళ్ళిద్దరూ చాలా సార్లు ఏకాంతంగా మాట్లాడుకున్నా, ఈ మధ్య మధులత అంటే ఫీలింగ్స్ పుట్టాక, మామూలుగా కలిస్తేనే పులకింత కలుగుతోంది రాజేష్ కి! ఇక ఏకాంతంగా అంటే ఏమవుతానో అనుకున్నాడు!

ఏమీ మాట్లాడని రాజేష్ వాలకం చూసి మధులత – “మా ఇంటికొస్తే నిన్నేమీ తినెయ్యనులే బాబూ! కంగారు పడకు!” అంది.

“ఏమో! నువ్వు తినకపోయినా, నీ అందం నన్నెక్కడ తినేస్తుందో అని భయం!” అన్నాడు రాజేష్! ఈ మధ్య రాజేష్ తనతో ఫ్లర్ట్ చేస్తూ ఉండడం మధులత గమనిస్తూనే ఉంది. అది ఆమెకు ఇష్టంగానే ఉంది!

3

ఆ సాయంత్రం కాలేజ్ అయ్యాక స్మితతో కలిసి ఏకాంతంగా కబుర్లు చెబుతోంది మధులత. అదేంటో ఈ మధ్య కబుర్లన్నీ ప్రేమ వీధిలో షికార్లు చేస్తున్నాయి!

“ఏమంటున్నాడే నీ లవర్ మిస్టర్ రఘూ?” – స్మితను అడిగింది మధులత.

“అమ్మో! ఫ్రెండ్ గా ఉన్నప్పుడు తెలీలేదు కానీ చాలా నాటీ!”

“ఆహా! ఏం చేశాడని అడగనులే, మళ్ళీ నేనే సిగ్గుపడాలి!”

“అడిగితే చెబుతారేంటి? లవర్స్ సీక్రెట్స్ తెలియాలంటే నువ్వూ ప్రేమలో పడాలి!”

“ఇలా పడకుండా తెలిసేవి ఏమైనా ఉంటే చెప్పు!”

“అయ్యో! పడాలే! మునగాలి! అప్పుడే ఆ థ్రిల్ తెలుస్తుంది! నువ్వు ఎంత మిస్సైపోతున్నావో!”

“నిన్న అడగడం నాదీ బుద్ధి తక్కువ! అర్జెంటుగా నన్నూ ప్రేమలోకి దింపేసేటట్టు ఉన్నావ్!”

“నేను దింపడం ఎందుకు? నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడిపోయావని నా డౌట్!”

“అదేం లేదు!” కాస్త కంగారు పడుతూ చెప్పింది మధులత, స్మిత ఎలా కనిపెట్టేసిందా అనుకుంటూ!

“నాకు తెలుసులేవే! నీకూ రాజేష్ కీ మధ్య జరుగుతున్న కథ! ప్రొసీడ్! నీకు నా ఫుల్ సపోర్ట్!”

“నీ దగ్గర దాచడం కష్టం!” సిగ్గుపడుతూ అంది మధులత!

“వహ్వా! అయితే నిజమే అన్నమాట! ఐ యామ్ సో హ్యేపీ! చెప్పెయ్ చెప్పెయ్, త్వరగా చెప్పెయ్!”

“అదే ఆలోచిస్తున్నా!”

“మధూ! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తావే! అసలు ఈ పాటికి మీరు లవ్వులూ, కిస్సులూ, హగ్గులూ దాటి ఎంతో దూరం వెళ్ళిపోవచ్చు!”, కన్ను కొట్టింది స్మిత!

“నిన్నూ!!”

4

ఆ రాత్రి రఘూ, రాజేష్ రూం లోనూ ఇదే సంభాషణ. వాళ్ళిద్దరూ రూమ్ మేట్స్.

“రేయ్ రాజేష్! నీకూ మధూకి మధ్య ఏదో జరుగుతోందని మాకు అనుమానంగా ఉందిరా!”

“ఆ “ఏదో” ఏంటో నువ్వే చెప్పి హెల్ప్ చెయ్యొచ్చుగా!”

“అన్నీ నేనే చెప్తే ఇంక నువ్వు చేసేదేంట్రా! మధు అంటే నీకు ఇష్టం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. సో సింపుల్! ఇట్ ఈజ్ లవ్!”

“లవ్ సింపుల్ అన్నవాడిని నిన్నే చూశాన్రా! ఓ చిన్న మాట చెప్పలేక చస్తున్నాను నేను!”

“హమ్మయ్య! మొత్తానికి లవ్ ఉందని ఒప్పుకున్నావ్! గ్రేట్ ఇమ్ప్రూవ్మెంట్!”

“ఇమ్ప్రూవ్మెంటా బొందా! హింట్లు ఇస్తున్నా మధు నుంచి రెస్పాన్స్ లేదు!”

“ఓకె! మాటల్లో చెప్పలేవు, పోనీ అక్షరాల్లో చెప్పొచ్చు కదా? పరీక్షల్లో పేజీలకు పేజీలు సమాధానాలు రాస్తావ్, ఓ లవ్ లెటర్ రాసి డైరెక్టుగా చెప్పలేవా?”

“లెటరా? ఈ ఐడియా పాతదే అయినా బానే ఉందే! రేపు కంబైండ్ స్టడీకి మధూ రమ్మంది!”

“ఇంకేం! లెటరే ఇస్తావో ఇంకా అడ్వాన్స్ అవుతావో నీ ఇష్టం! గుడ్ లక్!”

“థాంక్స్ రా! లవ్ లో నీకున్న టాలెంటుతో నన్ను నడిపించాలి!”

“సరే చస్తానా? నీలాంటి బ్రిలియంట్లు ఉన్నారే, ఒక ముద్దు కూడా లేకుండా ప్రేమ కథ నడిపించే బుద్ధూలు!”

5

“హాయ్, లోపలికి రా”, ఇంట్లోకి రాజేష్ ని ఆహ్వానించింది మధులత. హాల్లో కూర్చున్నారు ఇద్దరూ.

“ఇంట్లో ఎవరూ లేనట్టున్నారేంటి?” అడిగాడు రాజేష్.

“అంతా ఒక ఫంక్షన్ కి వెళ్ళారు. నేను నీతో స్టడీ ఉందని చెప్పి ఆగిపోయాను!” – ఒక అబ్బాయితో కలిసి ఒంటరిగా చదువుకుంటానని తల్లిదండ్రులతో చెప్పే నిజాయితీ, ధైర్యం మధులతది. అందుకు అంగీకరించే నమ్మకం ఆ తల్లిదండ్రులది!

ఇంట్లో ఇద్దరమే ఉన్నామన్న ఊహకి ఊరటా, అలజడీ రెండూ ఒకేసారి కలిగాయి రాజేష్ కి. తన ప్రేమని వ్యక్తపరచడానికి ఏకాంతం దొరికిందన్న ఊరట. ఆ ఏకాంతం పెడుతున్న తొందరతనానికి అలజడి! జేబులో భద్రంగా ఉన్న లవ్ లెటర్ ని తాకి చూసుకున్నాడు!

“జ్యూస్ తీస్కో!” అందించింది మధులత.

మధులత జ్యూస్ అందిస్తున్నప్పుడు కనిపించిన వక్షస్థల రేఖ రాజేష్ కంటిలో మెరుపులా మెరిసింది. చిన్న మెరుపే ఇంత అందంగా ఉంటే మరి కురిసే ఉరుముల వాన ఇంకెన్ని అందాలు దాచుకుందో అని ఆలోచిస్తున్నాడు రాజేష్. ఇలాంటి ఆలోచనలు తప్పే అని అతనికి తెలిసినా మధులతపై ఉన్న అట్రాక్షన్ వల్ల ఆమె అందాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు. ప్రేమా శృంగారం కలిసే ఉంటాయేమో, రెండు పెదవుల్లాగ! రఘూ-స్మిత లతో సహా అతను విన్న కాలేజీ ప్రేమ జంటల సరససల్లాపాలు అతన్ని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నాయి ఆ క్షణంలో! అయితే తాము ఇంకా ప్రేమికులు కూడా కామన్న వాస్తవం అతనికి గుర్తొచ్చి కాస్త స్ప్రహలోకి వచ్చాడు.

ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని సతమతమౌతున్న రాజేష్ కి, సహాయం చేస్తున్నట్టు మధులతే మాట్లాడ్డం మొదలుపెట్టింది.

“రాజేష్! నీతో ఒక విషయం చెప్పాలి! ఇది అబ్బాయిలే ముందు చెప్పాలని, అమ్మాయిలు తెగ సిగ్గుపడిపోవాలని రూల్స్ ఉన్నాయేమో నాకు తెలీదు. జీవితాన్ని పంచుకునే వాడి ముందు మనసు పంచుకోవడానికి రొమాంటిక్ ముసుగులు అవసరం లేదనుకుంటున్నాను! అందుకే నీతో స్ట్రైట్ గా చెప్పేస్తున్నాను! నువ్వంటే నాకు ఇష్టం! ఐ లవ్ యూ!”

ఒక్కసారిగా ఏం విన్నాడో, బదులుగా ఏం చెప్పాలో అర్థం కాలేదు రాజేష్ కి! గుండెల్లో ఉప్పొంగుతున్న ఆనంద జలపాతపు సవ్వడి మాత్రం వినిపిస్తోంది.

“నువ్వంటే నాకు ఫీలింగ్స్ ఉన్నా, బోలెడు సిగ్గున్నా, అవి దాటి, క్లియర్ గా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వూ నేను ఒకరినొకరం తెలుసుకున్నాక, మన మధ్య చనువుతో పాటూ ఒకరి వ్యక్తిత్వంపై ఒకరికి గౌరవమూ ఏర్పడ్డాక, ఈ అనుబంధం పెళ్ళితో ముడిపడితే అది నూరేళ్ళ పంటవుతుంది అనిపించింది! అందుకే ఈ నిర్ణయం!”

రాజేష్ నే చూస్తూ మాట్లాడుతున్న మధులత కళ్ళల్లో ఒక మెరుపు! రాజేష్ మాత్రం మధులత అంతస్సౌందర్యాన్ని సంపూర్ణంగా వీక్షించిన అనుభూతిలోనే మాట రాకుండా అలా ఉండిపోయాడు! అతనిలో వికారాలన్నీ కరిగిపోయాయి. ఇప్పుడు మధులత అతనికి ఎప్పుడూ లేనంత అందంగా కనిపిస్తోంది.

“మధూ! ఐ యామ్ సో లక్కీ! నీకు నా ప్రేమ చెప్పాలని వచ్చాను కానీ నీ ప్రేమలో మళ్ళీ పడిపోయాను! నా ప్రేమని చెప్పడానికి మాటలు రావట్లేదు అనుకున్నాను, కానీ నీ గురించి చెప్పడానికి మాటలు లేవని తెలుసుకున్నాను! థాంక్యూ!”

ఒక ఆత్మీయ ఆలింగనం తరువాత, మధులత వెంటనే –

“మన చదువు పూర్తయ్యి, ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్ళి! అప్పటి వరకూ మనం ప్రేమికులం! అయితే మన కాలేజీలో మిగతా లవర్స్ లాగ రేపటి నుంచి నీ బైక్ వెనకాల కూర్చుని, నీ నడుముపై చెయ్యి వేసి పార్కులకీ సినిమాలకీ వస్తాననుకోకు. అలాగే చిలిపితనాలు కూడా మాటల వరకే, కాలేజీలో మిగతా జంటలని చూసి ఏదో ఊహించేసుకోకు!”

“అర్థమైంది! లవ్ పేరుతో పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ దాకా వెళ్ళిపోతున్న రోజుల్లో కనీసం ఫస్ట్ కిస్ కూడా నాకు దక్కదంటావ్! సరే మిస్! నీ అందాన్ని మటుకు ఈలోపు పేక్ చేసి పక్కన పెట్టే చాన్స్ ఉందేమో చూడు! పిచ్చెక్కించేస్తున్నావ్!”

6

రెండేళ్ళ తరువాత…

అది శోభనం గది. సర్వాంగసుందరంగా అలంకరించారు. తనెంత అందంగా ఉన్నానో చూసుకుని ఆ గది గర్వంతో పొంగిపోయింది. ఇంతలోగా మధులత అడుగుపెట్టింది మనోహరంగా. ఆమె అందాన్ని చూశాక ఆ గది గర్వం పటాపంచలైపోయింది. ఇది గమనించి చిన్నగా నవ్వుకుంది మధులత. నెమ్మదిగా తలెత్తి చూసింది. ఎదురుగా మంచం మీద రాజేష్ ఆమెనే చూస్తున్నాడు. ఆ చూపుల్లో కాంక్ష లేదు, ప్రేమ ఉంది. తనంత అదృష్టవంతుడు భూమ్మీద ఎవరూ లేరనే గర్వం ఉంది. రాజేష్ ని చూస్తూ కళ్ళతో ఓ కొంటె సైగ చేసింది మధులత.

రాజేష్ ఆమెను దగ్గరకి తీసుకుని – “ఇన్నాళ్ళూ వెన్నెల్లో తడిశాను, ఇన్నాళ్ళకి వెన్నెలమ్మ దక్కింది! ఈ రెండేళ్ళ ప్రేమలో నిన్ను బతిమాలుకుని ఒకటీ అరా ముద్దులతో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు బాకీ పూర్తిగా వసూలు చెయ్యాలి! కానీ మధూ, ఇలా ఊరించి ఊరించి నువ్వు దొరకడం చాలా బావుంది. పెళ్ళికి ముందు దొంగచాటు సరసం కన్నా ఇప్పుడు దర్జాగా దొరలా నిన్ను పొందడం ఇంకా బావుంది!”

నుదుటిపైన సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు – “ఈ ముద్దు నీకు బొట్టు!”. ఆమె ముక్కుని తన ముక్కుతో సుతారంగా నిమిరి ఓ చిన్న ముద్దిచ్చి అన్నాడు – “ఇది నీకు ముక్కుపుడక!”. తర్వాత పెదాలని ముద్దాడుతూ అన్నాడు – “ఇది నీ గులాబీ పూల పెదాలపై నీటిముత్యం!”. అతను ఇంకా ఎక్కడ ముద్దులు ముద్రిస్తాడో తలచుకుని అందంగా సిగ్గుపడింది మధులత.

ఆకాశంలో చందమామకి వీళ్ళిద్దరి వలపు గుసగుసలు వినాలని తెగ ఉబలాటంగా ఉంది. వెన్నెలని అడిగాడు చెప్పమని. వెన్నెల చిరుగాలిని అడిగింది. చిరుగాలి – “నాకేం తెలుసు! నన్ను వాళ్ళ మధ్య దూరనిస్తే కదా!” అంది! పాపం చందమామకి నిరాశ మిగిలింది. కానీ వాళ్ళ గుసగుసలూ, చిలిపిపనులూ నలిగిపోతున్న మల్లెపూలకి తెలుసు, ఆగిపోయిన కాలానికి తెలుసు, వాళ్ళిద్దరినీ దీవిస్తున్న మంచానికి తెలుసు!

“హాయిభారాలు” అంటే ఏమిటో ఇప్పుడు మధులత అనుభూతి చెందుతోంది!

(ఈ కథ 2004 లో బ్రహ్మచారి కుర్రతనంలో రాసుకున్నది! కొన్ని మార్పులతో ఇప్పుడు ప్రచురిస్తున్నాను)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s