సుందరి – సీతారామ్!

1

సుందరి పేరుకి తగ్గట్టే అందంగా ఉంటుంది. “ఆ, అందాన్ని కొరుక్కు తింటామా ఏం!” అని రసికత లేని కొందరు తీసిపడేస్తూ ఉంటారు. అది నిజమే కావొచ్చు. కానీ కొరుక్కు తినాలనిపించేంత అందంగా ఉంటే తప్పులేదు! అంతటి అందం సుందరికి ఉంది. కానీ తప్పంతా ఆ పేరులోనే ఉంది. “అసలు ఏమాత్రం ఆలోచన ఉన్నా, కూతురుకి ఇలాంటి పేర్లు ఎవరైనా పెడతారా? కాలేజీలో అబ్బాయిలు ఎన్ని కామెంట్లు వేస్తారని?” అని అమ్మతో చాలా సార్లు గొడవ పెట్టుకుంది సుందరి. అమ్మ ఏమీ బదులిచ్చేది కాదు కానీ, పక్కనే ఉన్న బామ్మ ఒకసారిది విని – “త్రిపుర సుందరీ దేవి కృప వల్ల పుట్టావే నువ్వు! అందుకే ఆ పేరు పెట్టాం. ఆవిడే నీకింత అందాన్నిచ్చింది. ఇప్పుడు ఇలాగే అంటావులే! పెళ్ళయ్యాక తెలుస్తుంది అందంలో ఆనందం ఏమిటో!” అనేసింది. ఈ బామ్మలున్నారే! ఏమీ తెలియనట్టు ఉంటారు కానీ సిగ్గుపడే మాటలన్నీ సిగ్గు లేకుండా అనేస్తారు!

సుందరికి ఉన్న ఒక ప్రత్యేక అభిరుచి ఏమిటంటే పాటలు వినడం! ఇది చాలా మంది చేస్తారు నిజమే. కానీ పాటలోని సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, కవి కల్పనని జీవిస్తూ పాట వినడం అందరూ చేసేది కాదు. అలా సాహిత్యాన్ని మైమరచి వింటూ, తనను అమితంగా ఆకట్టుకున్న పాటలు రాసినది ఎవరా అని ఆరాతీస్తే తెలిసింది ఆయన పేరు “సిరివెన్నెల సీతారామ శాస్త్రి” అని. తన పాటల సిరివెన్నెలలో తేలి ఆడించిన కవి పేరు కూడా సిరివెన్నెలే కావడం ఎంత సముచితంగా ఉందో అని సుందరి సంబరపడి అప్పటినుంచి సిరివెన్నెలకి వీరాభిమానిగా మారిపోయింది. ఎంత అంటే పిచ్చిపిచ్చిగా అభిమానించేంతగా. తన ఈడు అమ్మాయిలు మహేష్ బాబుని ఆరాధించేంతగా!

“సిరితోనో, వెన్నెలతోనో ప్రేమలో పడాల్సిన వయసులో, ఇలా సిరివెన్నెల కవిత్వాన్ని వింటూ మైమరచిపోవడం ఏమిటే సుందరీ నాకర్థం కాదు! ఏ వయసుకా ముచ్చట అన్నారు. ముందో అబ్బాయిని చూసి కట్టేసుకుని అప్పుడు కావాలంటే ఇద్దరూ కలిసి ఆ సిరివెన్నెల పాటలు పాడుకోండి! ఆయన పాటల్లో ఇలాంటి పనికొచ్చే విషయాలేవీ చెప్పలేదా?” అని బామ్మ పదే పదే విసిగించి చంపేసినా సిరివెన్నెల పాటలు వినే కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉంది సుందరి. ఇలా సిరివెన్నెల ధారలో తడిసి ముద్దవుతున్న సుందరికి వెన్నెలరేడు, వన్నెలకాడు ఎవరూ తారసపడలేదనే చెప్పాలి, ఈ కథ మొదలయ్యేదాకా!

2

ఇప్పుడు ఈ కథకి హీరో సీతారాంని చిత్తగిద్దాం. పేరుకి తగ్గట్టే బుద్ధిమంతుడు, అందగాడు కూడా.

“నీ అంత హేండ్సమ్నెస్ నాకుంటే, కనీసం ఓ హండ్రడ్ అమ్మాయిలని వెంటేసుకుని హ్యాపీగా ఉందును కదరా!” అంటాడు దివాకర్. ఇతను సీతారాంకి బెస్ట్ ఫ్రెండ్. సినీ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రం అంటే పడి చస్తూ ఉంటాడు, అతని డైలాగులే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు.

“కోటిమంది అమ్మాయిలెందుకురా, కోహినూర్ లాంటి ఒక్క అమ్మాయి చాలు కానీ! అలాంటి అమ్మాయి కోసం నేనూ నా వయసూ ఎదురుచూస్తున్నాం!” అంటాడు సీతారాం.

అతని మనసుని దోచుకున్న అమ్మాయి ఎవరూ దొరకలేదు మరి ఇప్పటిదాకా! అలాగని అతని మనసు ఖాళీగా లేదులెండి. అతని మనసులో స్థిరనివాసం ఏర్పరుచుకున్న మూర్తి ఒకరున్నారు. ఆయనే పాటల రచయిత “వేటూరి సుందరరామ్మూర్తి”! పాటలు వినడం ఇష్టమైన సీతారాం, తెలుగు పాటలు వింటూ వింటూ ఎప్పుడో ఎక్కడో ఒక వేటూరి పాట విని పుష్కరగోదావరిలా ఉప్పొంగాడు. ఆ శైలికీ, ఆ తెలుగు భాషకీ దాసోహమై వేటూరి పాటల పూదోటలో శాశ్వత తుమ్మెదగా మారాడు.

“ఒరేయ్! నీకాయన సూట్ అవ్వడ్రా. నువ్వా పక్కా జంటిల్మేన్ వి. ఆయనా మహా తుంటరోడు. ఆయన పాటలు నీకెలా నచ్చాయ్‌రా! ఏదో వినోదం కోసమని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఓ సినిమాకి వెళ్లి అందులో పాటలు విని రిలాక్స్ అవుదామనుకుంటే, అమ్మాయి చూసే ఓరచూపులా అర్థమయ్యీ అర్థమవ్వనట్టు, ఎంతో అర్థమున్నట్టు, అర్థానికే అందనట్టు, అసలు అర్థమే లేనట్టూ ఇలా రకరకాల తికమక పాటలు రాసే ఆ వేటూరి గారు నిన్నెలా మెప్పించాడ్రా! అసలు ఎలా జరిగిందిది, ఎందుకు జరిగిందిది? నాకు తెలియాలి!” అన్నాడు దివాకర్ ఒకసారి “అతడు” చిత్రంలో ఎమ్మెస్ నారాయణ పలికిన డైలాగుని ఇమిటేట్ చేస్తూ.

“ఒరేయ్, అతడు సినిమా డైలాగ్ కాపీ కొట్టావులే కానీ, అదే సినిమా డైలాగ్‌తో సమాధానం చెప్తాను. నేనూ ఆ సినిమాలో మహేశ్ బాబులా ఏవో పాటల్లో తిరుగుతూ ఎక్కడో ఉన్నాన్రా, ఓ రోజు అమ్మ చేతిముద్ద లాంటి పాటొకటి విన్నాను. వేటూరి పాటంత బావుంటుందని అప్పుడే తెలిసిందిరా. తెలిస్తే ఎప్పుడో వేటూరిని అంటిపెట్టుకునేవాడిని.”! ఇదీ సీతారాం సమాధానం!

ఈ వేటూరి పాటే ఓ ఘాటైన వలపుకి దారితీస్తుందని సీతారాంకి తెలీదు.

3

సీతారాం ఓ రోజు హైటెక్ సిటీలోని ఓ సిటీ బస్ స్టాప్‌లో బస్ కోసం వైట్ చేస్తూ ఉండగా అసలు కథ మొదలైంది. బైక్ సర్వీసుకి ఇవ్వడంతో ఆ రోజు సిటీబస్ లో ఆఫీస్ కి వెళ్ళాల్సి వచ్చింది. అందమైన సాయంత్రం! కానీ చుట్టూ ట్రాఫిక్ రొద! దుమ్మూ ధూళీ! ఇలాంటి కఠిన వాస్తవాల నుంచి బయటపడడానికి సీతారాం ఎప్పటిలానే వేటూరి పాటని ఆశ్రయించాడు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకరకమైన తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయాడు, చుట్టూ లోకాన్ని మర్చిపోయేంతగా. కొంచెం మెలకువగా ఉండుంటే తన పక్కనే మెరిసిన మెరుపుని గమనించి ఉండేవాడు. కవిత్వాల్లో అందాన్ని వెతుక్కునే వాళ్ళెప్పుడూ ఇంతే, పక్కనున్న అందాన్ని గమనించి చావరు!

సుందరి పాపం ఆ రోజు ఆఫీస్ క్యాబ్ మిస్ అయ్యి సిటీబస్ ఎక్కాల్సి వచ్చింది ఇంటికి వెళ్ళడానికి. బస్ స్టాప్ లో జనాలు బానే ఉన్నారు, ఓ చివర కొంచెం డీసెంట్ లుకింగ్ అబ్బాయి కనిపించడంతో అతని పక్కన కొంచెం దూరంలో నిలబడింది. దగ్గరగా చూస్తే, డీసెంట్ లుకింగే కాదు, హేండ్సమ్ గానే ఉన్నాడు అనుకుంది. కానీ ఏదో మ్యూజిక్ వింటున్నాడు అనుకుంటా, తనని గమనించట్లేదు. చుట్టూ ఇంకొందరు కుర్రాళ్ళు తననే దొంగచూపులు చూస్తున్నారు. తన పక్కనున్న అబ్బాయి మాత్రం జంటిల్మేన్ లా డీసెంటుగా ఉండడం రిలీఫ్‌గా అనిపించింది సుందరికి.

సీతారాంకి ఉన్న ఒక పాడు అలవాటు ఏంటంటే, బాగా లీనమై పాటలు వింటున్నప్పుడు పల్లవిని బయటకి హమ్ చెయ్యడం. ఎక్కడ ఉన్నాం, ఆ పల్లవి ఎలాంటిది అని కూడా పట్టించుకోడు. ఆ రోజు అదే అతని కొంపముంచింది!

చూడచక్కని చూర్ణకుంతల, చూపుకందని హేల!
సందెవేళలో శకుంతల, వెన్నెలెందుకీ వేళ!
హాయి నవ్వుల సుహాసినీ! తేనె వెచ్చని కలా!
వాలుకన్నుల వరూధినీ, లేత హెచ్చరికలా?
చకోరి చంద్రికా చంచలా
మోహనాల మేఘమాల

సడన్‌గా తన పక్కనున్న కుర్రాడు ఈ లైన్లు హం చెయ్యడం చూసి సుందరి ఆశ్చర్యపోయింది! ఈ అబ్బాయిలతో వచ్చిన చిక్కు ఇదే! బావున్నారు అనుకునే లోపే ఏవో తిక్కవేషాలేసి మొత్తం ఇంప్రెషన్ పోగొట్టుకుంటారు! వాట్ ఎ పిటీ! కవిత్వం ఉన్న పాట పాడి టీజ్ చేస్తే సరసం అనుకున్నట్టు ఉన్నాడు వెధవ!

వెంటనే ఇంకో ఆలోచన వచ్చింది – ఒక వేళ తను అతనిని అపార్థం చేసుకుందేమో, అతను ఊరికే పాట వింటూ హమ్ చేశాడేమో! సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి చూద్దాం అనుకుంది, అబ్బాయిల గురించి ష్యూర్‌గా తెలిసినా! అతను పాడిన పల్లవిపై ఆలోచన పోయింది. “చూర్ణకుంతల” అంటే ఏమిటబ్బా? చక్కని జుట్టు ఉన్న అమ్మాయి అనా? ఏమో! ఆ మాటకొస్తే తన జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటుంది. “నువ్వు మొగుణ్ణి కొంగుకి కాదే, జడకే కట్టేసుకోవచ్చు!” అంటుంది బామ్మ. “సందెవేళలో శకుంతల, వెన్నెలెందుకీ వేళ” – నువ్వు చందమామలా అందాల వెన్నెలని కురిపిస్తూ ఉంటే ఇక ఈ సందెవేళ మళ్ళీ వెన్నెలెందుకు దండగ! ఎంత అందమైన ఊహ!

ఇలా సుందరి తీయని తలపుల్లో ఉండగా, తనని ఉలిక్కి పడేలా చేస్తూ వినిపించింది ఇంకో పాట –

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయత్తు
నేను రోమియోగ మారినది లగాయత్తు
నాకు గుండెలోన పుట్టుకొచ్చే “సెగా”యత్తు
అది భామ కాదు బాతు!

“చీ! డౌట్ లేదు. వీడు ఈవ్ టీజరే. బావున్నాడు అనుకున్నంత సేపు పట్టలేదు!”. సుందరి కోపంతో పక్కకి తప్పుకుందాం అనుకునేలోపే బస్ వచ్చింది లక్కీగా.

ఏదో బస్ రావడంతో లోకంలోకి వచ్చిన సీతారాంకి కళ్ళు జిగేల్మన్నాయి! ఓ అమ్మాయి బస్ ఎక్కడానికి వెళుతూ కనిపించింది. వేటూరి పాటే అమ్మాయై పక్కనే ఉంటే తను పట్టించుకోలేదా ఇంత సేపూ! ఇంతకంటే అందమైన అమ్మాయిలనే చూశాడు కానీ, ఈసారి గుండె కలుక్కుమనడమే కొత్తగా ఉంది. ఎవరీ మనోహరి? ఇంతలోనే ఆ అమ్మాయి బస్ ఎక్కుతూ వెనక్కి తిరిగి తనని ఓ చూపు చూసింది. ఆ కళ్ళలో కోపం, చూపులో ఏహ్యభావం. వెంటనే జరిగింది అర్థమైంది సీతారాంకి. కానీ అంతలోనే బస్ వెళ్ళిపోయింది!

4

జరిగిన పొరబాటుని పదే పదే తలుచుకుని, తనని తానే నిందించుకున్నాడు సీతారాం. పనిలో పనిగా “ఎంత పని చేశావయ్యా!” అని వేటూరిని కూడా ఓ మాట అన్నాడు, ఆయన ప్రమేయమూ ఉంది కనుక. తన మనసు దోచుకున్న ఒక చిన్నది ఆఖరుకి కనిపించిందని ఆనందించాలో, తాను చేసిన పొరబాటు వలన ఆ చిన్నది బహుశా ఎప్పటికీ దక్కదని బాధపడాలో అతనికి అర్థం కాలేదు. “అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిదీ పూచిన కొమ్మ!” అంటే ఇదేనేమో!

ఆ అమ్మాయి చేజారిందన్న బాధ కన్నా, తనని అనుకోకుండా బాధ పెట్టానన్న విషయమే సీతారాంని కలతకి గురిచేస్తోంది. తన వెంట పడిన అమ్మాయిలే తప్ప, తాను వెంటపడిన అమ్మాయిలు ఎవరూ లేరు ఇప్పటి వరకూ. ఇప్పుడు ఈ అమ్మాయిని వెతికి, సారీ చెప్పి తరువాత కుదిరితే వెంటపడి ప్రేమించాల్సిన అవసరం ఏర్పడింది!

ఆ రోజు నుంచి కొన్ని వారాల పాటూ హైటెక్ సిటీ అంతా అణువణువూ గాలించాడు. తన బైకుని వదిలి రోజూ సిటీబస్సుల రద్దిలో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు, షేర్ ఆటోల ఝంఝాటంలో పడ్డాడు, MMTS ప్లాట్ఫారాలన్నీ వెతికాడు. కానీ ఆమె కనిపించలేదు – “ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం, దక్షిణాన లేవంది మలయ పర్వతం” అన్న వేటూరి పాట గుర్తు రావడం తప్ప. కానీ అతనికో విషయం అర్థం అయ్యింది. హైదరాబాదులో అందమైన అమ్మాయిలు చాలా మందే ఉన్నారు, అమ్మ చూసే ఆ తెలుగు మాట్రిమోనీ సంబంధాల్లో కనిపించరు కానీ. అయితే ఎంత అందంగా ఉన్నా తన మనసు దోచుకున్న చిన్నదిలా ఎవరూ లేరు, ఇది నిజం!

ఇలా వెతికి వెతికి అలసి ఒక రోజు సాయంత్రం దివాకర్ దగ్గరకి వెళ్ళాడు రిలాక్స్ అవుదామని. దివాకర్ పనిచేసే కంపెనీ కూడా హైటెక్ సిటీలోనే ఉంటుంది, అతని కంపెనీ క్యాంటీన్లో అప్పుడప్పుడూ కలవడం అలవాటే ఇద్దరికీ.

“చూడు సీతారాం! అమ్మాయిలు నీ వెంట పడాల్సినోడివి, నువ్వే ఓ అమ్మాయి వెంట పడడం నీ మగతనానికే అవమానం!” – గంభీరంగా డైలాగ్ చెప్పాడు దివాకర్.

“ఊరుకోరా! నువ్వూ నీ కామెడీలు. మేటర్ సీరియస్ ఇక్కడ. అలాంటి అమ్మాయిని చూసి కూడా ప్రేమలో పడి, తన వెంటపడకపోతే అదీ నిజమైన అవమానం నా మగజన్మకి!”

“అప్పుడే ప్రేమ దాకా వచ్చిందీ! నేను అనుకుంటూనే ఉన్నాను. అమ్మాయిలతో అసలు ఏ మాత్రం టచ్ లేని నీ లాంటి వాడికి పెద్ద షాక్ ఇచ్చే అమ్మాయే ఏదో రోజు తగులుతుందని! నువ్వు మరీ అమాయకుడివి కాకపోతే తొలి చూపులోనే ప్రేమలో పడడాలు, తొలి అటెంప్ట్ లోనే తత్కాల్ టికెట్లు దొరకడాలూ ఉండవు!”

“దివాకరూ, ప్రేమలో పడ్డవాడికి కదా తెలిసేది ప్రేమ ఘాటూ, ప్రేమ కాటూ. నీకెలా తెలుస్తుంది. “తొలి చూపు తోరణమాయే, కళ్యాణ కారణమాయే” అన్న వేటూరి పాట అర్థం కావాలంటే నువ్వూ నాలా ప్రేమలో పడాలి!

“బాబూ! నన్నొదిలెయ్. నిన్నూ, ఆ వేటూరి కవిత్వాన్నీ అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాఫీ తాగాం కదా, వెళ్దాం పద. నాకు వర్క్ ఉంది”

“ఒరేయ్ ద్రోహీ. నేను నువ్విచ్చే ఈ చెత్త కాఫీ తాగడానికి రాలేదు, నా మనసులో బాధ చల్లార్చుకోవడానికి వచ్చాను” అన్నాడు సీతారాం లేస్తూ

“అవునా! ఆ ముక్క ముందే చెప్పుంటే కోల్డ్ కాఫీ ఇచ్చేవాడిని కదా, హాట్ కాఫీ బదులు! చల్లగా ఉండేది”!

5

వాళ్లిద్దరూ ఆఫీస్ క్యాంటీన్ నుంచి బయటకు నడిచి లిఫ్ట్ దగ్గరకి వెళుతూ ఉంటే, అప్పుడే లిఫ్ట్ డోర్ మూస్కోవడం, మూసుకుంటున్న డోర్ లోంచి ఓ అందమైన రూపం ఓ క్షణం మెరిసి మాయమవ్వడం జరిగింది.

“తనే! తనే! ” అంటూ మెట్ల వైపు పరిగెత్తడం మొదలెట్టాడు సీతారాం!

“ఒరేయ్! ఇదేమైనా సినిమా అనుకుంటున్నావ్ రా! ఈ రోజుల్లో లిఫ్టులు చాలా స్పీడుగా వెళ్తాయ్, మనం ఎంత పరుగెత్తి మెట్లెక్కినా అందుకోలేం. పైగా పది ఫ్లోర్లు ఉన్నాయ్ ఇంకా, లిఫ్ట్ ఎక్కడ ఆగుతుందో ఎవడికి తెలుసు? పక్క లిఫ్ట్ లో వెళ్దాం ఆగు” అని దివాకర్ చెబుతున్నా వినిపించుకునే స్థితిలో లేడు సీతారాం!

లక్కీగా ఆ లిఫ్ట్ పై ప్లోరులోనే ఆగింది. సీతారాం మెట్లు ఎక్కి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి లిఫ్ట్ నుంచి పైకొచ్చి నడుస్తోంది, ఇంకో స్నేహితురాలితో. సీతారాం ఆనందానికి అవధులు లేవు. సుందరికి కనబడకుండా గోడ పక్కనుంచి తననే చూస్తున్నాడు – “కడగంటి కొలకుల్లో, తెలుగింటి వెలుగుల్లో, తెరతీసిన తేనె దీపం, తేనే కన్నా తీపి రూపం!” ఆహా!

కొద్ది సేపటికి రొప్పుతూ దివాకర్ కూడా వచ్చాడు, “బతికించింది ఈ అమ్మాయెవరో. ఇంకా ఎన్ని ఫ్లోర్లు ఎక్కాలా అని టెన్షన్ పడ్డాను రా బాబూ! అమ్మాయిల వెంట పడడం వలన కొలెస్టొరాల్ తగ్గే చాన్సులు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది”

రెప్పకూడా వేయకుండా సీతారాం చూస్తున్న అమ్మాయి ఎవరా అని చూసిన దివాకర్ – “వాట్! నీ మనసు దోచుకున్నది సుందరా!” అన్నాడు వెంటనే!

“వాట్! నీకా అమ్మాయి తెలుసా!”

“మా కంపెనీయే. మా ఆఫీసులో సుందరి తెలియని అబ్బాయిలు లేరు!”

“మా ఆఫీసులో అమ్మాయిలే లేరు, ఆఫీస్ కి వెళ్ళడానికి మోటివేషనే లేదు లాంటి డైలాగులు ఎలా కొట్టావురా, ఇలాంటి అమ్మాయిని పెట్టుకుని?”

“ఎగ్జాం పేపర్ లో ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం తెలిసినట్టు ఆఫీసులో ఒకే ఒక్క అందమైన అమ్మాయుంటే ఎలాగరా ప్రేమ పరీక్షలో నాలాంటి నవయువకులు పాసవ్వడం?”

“చందమామే ఉన్నప్పుడు ఇంక చుక్కలెందుకురా!”

“ఆ, చందమామే! అందని చందమామ. ఎంత మంది ట్రై చేశారో! అబ్బే! …. కానీ చాలా మంచి అమ్మాయి. ఈ ప్రేమలూ దోమలూ వంటి వాటి జోలికిపోకుండా ఎప్పుడూ ఆ సిరివెన్నెల పాటల లోకంలో ఉంటుంది”

“యూ మీన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి?”

“ఆ, ఆయనే! టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచీ పెళ్ళైన ఆంటీల దాకా ఆయన పాటలంటే పడి చచ్చిపోతూ ఉంటారు, ఎందుకో తెలీదు! ఇక్కడ ఒక్క అమ్మాయిని పడెయ్యలేక చస్తున్నాం!”

“ఆహా! రమేష్ నాయుడి ట్యూనుకి వేటూరి పాటలా ఎంత తియ్యని మాట చెప్పావురా! నా పెళ్ళి మొదటి శుభలేఖ నీకే ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాను! సిరివెన్నెలే శరణం ఇక!”

“నువ్వు వేటూరికి కదా ఫ్యాన్‌వి?”

“పిచ్చివాడా! వేటూరి కొండపైన దేవుడు, మనమే ఎక్కి కొలుచుకోవాలి. సిరివెన్నెల మన కోసం తానే కొండ దిగొచ్చిన దేవుడు. ఇద్దరూ దేవుళ్ళే!”

“ఏంటో! ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు!”

“నీకర్థం కాదులే గానీ, నాకో చిన్న హెల్ప్ చెయ్యరా! నీకో లెటర్ ఇస్తాను, ఆ అమ్మాయి క్యూబికల్‌లో పెడతావా, రేపు ఉదయం ఆఫీసుకి వచ్చినప్పుడు తను చూసేలా?”

“నువ్వు జనాలందరూ మరిచిపోయిన పాతకాలం తెలుగు మాటలన్నీ పాటల్లోకి తీసుకొచ్చి ప్రయోగాలు చేసే వేటూరికి అభిమానివి మాత్రమే అనుకున్నాను. నీ బుర్ర కూడా ఇంకా పాతగానే ఆలోచిస్తూ ఉందని ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఈ రోజుల్లో లెటర్లు ఎవరు రాస్తున్నారురా?”

“అందుకే కదా నేను రాస్తున్నది! నువ్వు జాగ్రత్తగా లెటర్‌ని సుందరికి అందజెయ్యి చాలు”

“ఏదోకటి ఏడు! కానీ నీ లెటర్ సుందరికి ఇవ్వడం వల్ల HR వాళ్ళు నాకు టెర్మినేషన్ లెటర్ చేతికివ్వకుండా చూడు చాలు! అసలే ఆ HR లేడీస్ అందరూ ఫెమినిస్టులు!”

6

సుందరి పక్కరోజు ఆఫీసుకి వచ్చినప్పుడు కనిపించింది ఆ ఉత్తరం. తెల్లని కాగితంపై చక్కని తెలుగు అక్షరాలు…

సుందరి గారికి,

ట్రాఫిక్ రాగం హారెన్ల మోత పెడుతున్న వేళ, దుమ్మూ ధూళీ మసక మసకగా పరుచుకున్న వేళ, ఓ తప్పనిసరి ముహూర్తాన కొద్దిరోజుల క్రితం నేను హైటెక్ సిటీ బస్ స్టాపులో నిలుచున్నాను. అప్పుడే మీరు నా పక్కన నిలబడ్డారు! కానీ నేను మిమ్మల్ని చూడలేదు. అలా తొలిసారి మిమ్మల్ని చూడంది మొదలు మన కథ మొదలైంది.

తప్పే, నా తప్పే! పక్కనే వేటూరి పాటంత అందంగా మీరుంటే గమనించకుండా నేను హెడ్ ఫోన్ లో వేటూరి పాటలు వింటూ ఉండిపోవడం నా తప్పే! వేటూరి పాటల పల్లవులపై నా ఇష్టాన్ని దాచుకోకుండా, అవి ఎలాంటి పాటలని చూడకుండా పైకి హమ్ చెయ్యడం నా తప్పే! అందుకు మీరు నన్ను క్షమించాలి. మీరు బస్సెక్కుతూ నాకేసి తీక్షణంగా చూసిన చూపుల్లో నాపై కోపం కనిపించింది. కానీ అదే చూపుకి నాపై వెన్నెల వర్షం కూడా కురిసిందనీ, నా గుండె కలుక్కుమందనీ మీకు తెలుసా? అప్పటి నుంచీ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు” అన్న వేటూరి పాట పల్లవి జానకి గొంతులో రిపీట్ మోడ్‌లో నాలో ప్లే అవుతూనే ఉందని మీకు తెలుసా? మిమ్మల్ని కలిసి సారీ చెప్పాలని ఎంతగా మీకై వెతికానో మీకు తెలుసా?

మీ ఆఫీసులోనే పనిచేసే మా దివాకర్ గాడి పుణ్యమా అని మీరు మళ్ళీ కనిపించారు. మీ పేరు సుందరనీ, మీరు సిరివెన్నెల అభిమాననీ వాడే చెప్పాడు. ఏ అబ్బాయీ మీ మెళ్ళో పూలమాల వెయ్యలేదనీ కూడా చెప్పాడు. మీలాంటి అందాన్ని ఎవరూ అందుకోవాలనుకోకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. “అదెలా సాధ్యం” అని నా అనుమానానికి మీ సిరివెన్నెలే సమాధానం చెప్పారు తన పాటలో – “ఎందరు చూశారో కలగన్నామనుకున్నారో! అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో” అంటూ. అవును! మీరు అందని కల అందరికీ. నాకు మాత్రం అందే నిజం అవుతారేమోనని చిన్న ఆశ!

వీడెవడు, నా గురించి ఏమీ తెలియకుండా, నా ఇష్టం తెలుసుకోకుండా, సరాసరి ప్రపోజ్ చేసేస్తున్నాడు? ఈడియట్! అమ్మాయిల్లో కేవలం అందాన్నే చూసే సెక్సిస్ట్! అని కోప్పడకండి ప్లీజ్! “విధాత తలపున” అనే ఒక్క పాట విని సిరివెన్నెల తలపునీ, ఆయన ఘనతనీ ఎలా చెప్పెయ్యొచ్చో, ఒక్క చూపులో మీ వ్యక్తిత్వం మొత్తం నాకు అర్థమైపోయింది. మీరు సిరివెన్నెల అభిమానని తెలియగానే మరింత రుజువైపోయింది. సిరివెన్నెల ఆడ అభిమానుల కంటే మంచి అమ్మాయిలు ఉంటారా చెప్పండి? పైగా నాకెక్కువ టైం లేదు. మా అమ్మ నేను త్వరగా తెలుగు మాట్రిమోనీ అమ్మాయిల్లో ఎవరో ఒకరిని ఓకే చెయ్యకపోతే మా దూరపు చుట్టాలమ్మాయిని కట్టబెట్టేస్తానని బెదిరిస్తోంది! అందుకే ఈ తొందర! అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.

మనం మళ్లీ ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బావుంటుంది కదూ? ఈ రోజు సాయంత్రం ఆరింటికి అదే బస్ స్టాపులో మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను! వస్తారు కదూ?

వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం?

సీతారాం

లెటర్ చదివిన సుందరి సీతారాంని తిట్టుకుని “చస్తే వెళ్ళను!” అనుకుంది. తన సిరివెన్నెల వీక్నెస్ ని పట్టుకుని ట్రాప్ చేసేద్దామనే! అంత ఈజీనా అమ్మాయిలంటే?

కానీ రోజంతా సీతారాం ఆలోచనలు ఆమెను చుట్టముడుతూనే ఉన్నాయి! ఏదో ఉందా అబ్బాయిలో! ఏ మాత్రం తెలియని అబ్బాయిపై కొంచెం ఇష్టం లాంటిది కలగడం ఆమెను ఆశ్చర్యపరిచింది. “పోనీ సరదాగా వెళ్తే? వెళ్తే లవ్ చేసెయ్యాలి, పెళ్ళి చేసేసుకోవాలి అని లేదుగా! జస్ట్ కలవడమేగా!” అనుకుంది ఒకసారి. మళ్లీ “నో నో అస్సలు వెళ్ళకూడదు” అనుకుంది. సాయంత్రం ఐదయ్యినప్పుడు టైం చూడనట్టు నటించింది. ఐదున్నరకి – “వెళ్ళాలి. వెళ్లి వెధవని దుమ్ము దులపాలి!” అన్న ఆలోచన వచ్చింది. “యెస్! అందుకే, జస్ట్ అందుకే! ఇంకే కారణం లేదు” అని పదే పదే సర్దిచెప్పుకుంటూ వెళ్లింది చివరికి!

పాపం సుందరికి తెలీదు. ఈ ప్రేమ కూడా సిరివెన్నెల పాటలాటిదేననీ, కొంచెం కొంచెంగా మనసంతా కమ్ముకుంటుందనీ! కొంచెం కారంగా, కొంచెం గారంగా, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా!

7

బస్ స్టాప్‌లో ఓ మూల బుద్ధిమంతుడిలా ఫోజ్ కొడుతూ కనిపించాడు సీతారాం సుందరికి! సుందరిని చూసి ఆనందంగా ఓ చిరునవ్వు నవ్వాడు!

“మీరొస్తారని తెలుసు!”

“అసలేంటండి? ఆ లెటర్ ఏంటి? ఈ కలవడమేంటి? ఎవరైనా బస్ స్టాపుల్లో అమ్మాయిలని కలవమంటారా?”

“అంటే, పార్కుల్లో కలవడానికి మనమేమీ ప్రేమికులం కాదు కదా!”

“యెస్! కాదు, అస్సలు కాదు. అది చెప్పడానికే వచ్చాను. మీతో కబుర్లు చెప్పడానికి కాదు”

“ఏంటండీ! నా తప్పుకు సారీ చెప్పాను కదా! ఇంకా అంత కోపమా! పోనీ మీ కాళ్ళ పైన పడమంటారా చెప్పండి”

“ఓకె! మీ సారీ ఆక్సెప్ట్ చేస్తున్నా! అయితే మీరు మరీ అమాయకుల్లా నటించి, సిరివెన్నెల పేరు చెప్పి నన్ను ఫ్లాట్ చెయ్యాలని చూడకండి. ఇంక నన్ను కాంటాక్ట్ చెయ్యకండి ఎప్పుడూ!”

“అంతే అంటారా?”

“అంతే!”

“చూడండి. మీకు ఇష్టమైన సీతారామ శాస్త్రి నా పేరులో ఉన్నారు, నాకు ఇష్టమైన సుందరామ్మూర్తి మీ పేరులో ఉన్నారు. అంటే మనకి ఏదో ముడి ఉన్నటేగా! చూశారా ఆ దేవుడి మహత్యం!

“మహత్యం లేదు గిహత్యం లేదు. అది కథ రాసినవాడి పైత్యం!”

“ఏదో ఒకటి. కానీ మీరే నాకు అగత్యం, మీరు తప్ప నాకు లేదు గత్యంతరం”

“పాతకాలం సినిమా హీరోల డైలాగులు కొడుతూ టూ మచ్ ఏక్ట్ చేస్తున్నారు!”

“లేదండి! నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు, మీరు నమ్మాలి!”

“ఆహాహా! ఇదో కొత్త ట్రిక్కా!”

“లేదండి! అన్ని ట్రిక్కులే తెలిసుంటే…. ఈపాటికి మిమ్మల్ని బుట్టలో పడేసే వాడిని కదా!”

కొంచెం నెమ్మదిగా, నాటకీయంగా ఈ డైలాగ్ కొట్టి ఎందుకైనా మంచిదని ఓ చిరునవ్వు నవ్వాడు సీతారాం. సుందరి చురచురా చూసింది.

“అయినా మీతో నాకేంటండీ! నేను వెళ్తున్నా! బస్ కోసం వైట్ చేస్తున్నా అంతే! గుడ్ బై!” అంది!

“సరే! నేనూ బస్ కోసమే వైట్ చేస్తున్నాను లెండి! బై!”

సీతారాం హెడ్ ఫోన్స్ తీసి పెట్టుకుంటూ, సుందరి కేసి తిరిగి చూశాడు ఆఖరుసారి. సుందరి మూతి ముడిచి తల పక్కకి తిప్పుకుంది!

“తనకి అతనిపై నిజంగా కోపం ఉందా లేక కోపాన్ని నటిస్తోందా? అతనితో ఇంకా పోట్లాడాలని ఎందుకు అనిపిస్తోంది? ఈ పోట్లాటలో ఒక రకమైన సాన్నిహిత్యం ఉండడమేమిటి? ఏదో ముచ్చట కలుగుతోంది అతన్ని చూస్తే! ముచ్చటేనా, లేక ఇష్టం కూడానా?….”

సుందరి ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ వినిపించింది సీతారాం హమ్ చేస్తున్న పాట –

మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధ సింగారమా….

సిరివెన్నెల పాట! కావాలనే ఈ పాట పెట్టుకుని హమ్ చేస్తున్నాడు! కానీ సుందరి తల తిప్పలేదు! ఇంతలో బస్ రానే వచ్చింది. సీతారామ్ కేసి అస్సలు చూడకుండా బస్ ఎక్కుతోంది..

నేలకే నాట్యం నేర్పావే నయగారమా!
గాలికే సంకెళ్ళేశావే….!

అతను ఇంకా పాడుతున్నాడా? పాడినా అంత ట్రాఫిక్ లోనూ తనకి వినిపిస్తోందా ఈ పాట? లేక తన ఊహా? ఓ సారి వెనక్కి తిరిగి చూసింది సుందరి. తననే చూస్తున్నాడు అభ్యర్థనగా, ముద్దొచ్చేలా. ఓ అందమైన చిరునవ్వు విరిసింది సుందరి పెదాలపై. ఎలా వచ్చిందది తనకే తెలియకుండా, తనని అడక్కుండా! సిగ్గుతో తల తిప్పేసుకుంది. సీతారామ్ కి తెలిసిపోయింది, ఇక ఆమె మనసుని తన వైపుకి తిప్పేసుకున్నానని. “యూరేకా!” అంటూ “నవ్వింది మల్లెచెండు” పాటలో చిరంజీవిలా అరుపు అరిచి, ఓ గెంతు గెంతాడు!

8

శోభనం గది అందంగా అలంకరించి ఉంది! గదిలో మంచం పైన కూర్చుని సుందరి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సీతారామ్ నిరీక్షణకి తెరదించుతూ జంధ్యాల సినిమాలో వేటూరి ప్రేమగీతంలా సుందరి గదిలోకి అడుగుపెట్టింది.

“అదేంటి! పాలగ్లాసుతో వస్తావు అనుకున్నానే! ఈ మధ్య పద్ధతి గానీ మార్చారా?”

“ఆ! వచ్చి నీ కాళ్ళకి దణ్ణం కూడా పెడతానని ఎక్స్పెక్ట్ చేశావా ఏంటి?” అంది సుందరి అతని పక్కనే సర్దుకు కూర్చుంటూ…

“నేను కొంచెం ఎక్కువ ఊహించానులే!”

“ఆ! ఊహల్లో అన్నీ బానే ఉంటాయి. పెళ్లి గురించి కూడా సినిమా కవులు తెగ పొగిడేస్తే నేనూ చాలా ఊహించాను. కళ్యాణమనీ, వైభోగమనీ! చూస్తే పొగలూ, భుగలూ, వ్రతాలూ, పూజలూ, గుళ్ల చుట్టూ తిరగడాలూ…అబ్బబ్బా అలిసిపోయాననుకో! కాళ్లు ఒకటే నొప్పులు! కొంచెం పట్టరాదూ! “ప్రేమాడే కృష్ణుడూ కన్నుకొట్టాల, పెళ్ళాడే కృష్ణుడూ కాళ్ళు పట్టాల” అన్నాడుగా మీ వేటూరి!

“వామ్మో! మంచి అమ్మాయిలా ఏక్ట్ చేసి, నన్ను నీ నవ్వుతో ఫ్లాట్ చేసి, ఇంత కుట్రా! దగా దగా!”

“నీకెన్నో సార్లు చెప్పాను! నేను ఆ రోజు బస్సెక్కుతూ నవ్వింది నీ మీద లవ్వు పుట్టి కాదు సిరివెన్నెల పాట సాహిత్యానికి అని! ఆ తర్వాత మూడు నెలల పాటూ నా వెంటపడి, నన్ను పెళ్ళి చేసుకో అని ప్రాధేయపడి, నానా తంటాలు పడి నన్ను ఒప్పించి, తర్వాత నువ్వే మా అమ్మానాన్నలతో మాట్లాడి, ఇదంతా నువ్వే చేసి ఇప్పుడు నన్నంటావా?”

“ఏదో సిరివెన్నెల వారి అమ్మాయివనీ, అందంగా ఉన్నావనీ మనసు పడితే నన్ను ముగ్గులోకి దించి కట్టేసుకున్నావుగా”

“అవును మరి! నువ్వు పెద్ద అమ్మాయకుడివి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ముద్దు కోసం చిలిపిగా వేధించలేదూ?”

“ఆ! ఇచ్చినట్టు పెద్ద!”

“తీసుకోవడం ఎలాగో తెలీదని చెప్పు!”

కళ్ళతో చిలిపిగా చూసింది సుందరి! ఇద్దరూ అందంగా నవ్వుకున్నారు. సుందరి సీతారామ్ ఒళ్ళోకి తలవాల్చి ఒదిగిపోయి, గారంగా –

“నా ప్రియమైన శ్రీవారూ! మనం ఎప్పుడూ ఇలాగే సరదాగా ఆనందంగా ఉందామా? “నాలోనే నువ్వు, నాతోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు”, అవుతావా నువ్వు?”

“ఎప్పుడో అయిపోయానుగా!” అన్నాడు సీతారాం ఆమె జుట్టును నిమురుతూ!

“ఊ..”

“ఓ పాట పాడనా!”

“నువ్వు పాటలు కూడా రాస్తావా?”

“లేదు. ఊరికే ట్రై చేశాలే! ఫస్ట్ నైట్ కి ఏప్ట్ గా ఉంటుందని”

“ఆహా! నన్ను చూసి పాట పొంగింది అంటావ్ అనుకున్నానే!”

“ష్!..విను” –

“పెదవికి ముద్దిస్తే బుగ్గకి కోపం
బుగ్గకి ముద్దిస్తే పెదవికి కోపం
ఎలా తగువు తీర్చడం?
ఎలా సరసమాడడం?…”

ఇద్దరి మధ్యనా మౌనం ఓ క్షణం పాటూ. సీతారామ్ ఒడిలో ఉన్న సుందరి అతన్నే చూస్తూ చిలిపిగా నవ్వింది.

“సరసం తెలీదు అనుకున్నాను కానీ పర్వాలేదే! తర్వాత లైన్ నేను చెప్పనా?” అంది.

“చెప్పు”

“దగ్గరగా రా! చెవిలో చెప్పాలి”

“సరే!”

అప్పుడు సుందరి సీతారాం చెవిలో గుసగుసగా చెప్పిన మాట విని చీకటి సిగ్గుపడింది, జాబిలి ముసిముసిగా నవ్వుకుంది –

“మాటలతో సరిపెడితే శ్రీమతికి కోపం!!!”

అదండీ కథ! కథ కంచికి, ఈ జంట వలపు కౌగిలికి, మనం ఇంటికి!!

(వేటూరి సిరివెన్నెలపైన ఉన్న అభిమానంతో రాసుకున్న సరదా కథ ఇది. దీనిని అందంగా మార్చి 2017 సంచికలో ప్రచురించిన కౌముది వారికి ధన్యవాదాలు!)

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s